మన వ్యవసాయం

కుండీలో… పచ్చని మిర్చి

1

మనకు తెలిసి, వాడే మిర్చిలు రెండే… ఒకటి ఎర్రగా ఉండేవి రెడ్ మిర్చి. ఇంకోటి పచ్చగా ఉండే పచ్చిమిర్చి. ఒకటి ఘాటు అయితే, ఇంకోటి మహా కారం. అసలు ఈ మిర్చి పంటను వ్యవసాయ భూమిలో కాకుండా ఇంట్లో పెంచుకోవడం సాధ్యమేనా?… అంటే, అవుననే చెప్పొచ్చు.
ఇప్పుడంతా ఇంటి పెరట్లో ఏ కాస్తా చోటు దొరికినా నచ్చిన మొక్కల్ని పెంచుకుంటున్నారు. అటు అలంకరణగానూ, ఇటు ఆరోగ్యంగానూ పనికొచ్చే ఈ కుండి మొక్కల గురుంచి… అది ముఖ్యంగా పచ్చిమిర్చి మొక్క గురుంచి ఈరోజు తెలుసుకుందాం.
పచ్చిమిర్చిని కొందరు కుండీల్లో, మరికొందరు కంటైనర్ లో పెంచుతున్నారు. ఎలా పెంచిన మార్కెట్ లో కొన్న మిర్చికంటే ఇంట్లో పెంచుకున్న మిరపనే మంచిదని చెప్పాలి.

పెంచే విధానం:
మనం నిత్యం వాడే పండుమిర్చిలోని గింజలను లేదా మార్కెట్ నుంచి తెచ్చిన మిర్చి వేరుతో అయిన మిర్చిని పెంచుకోవచ్చు. ముందుగా ఒక కుండి లేదా కంటైనర్ లో మట్టిని నింపి, తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాతిరోజు ఆ కుండిలో మట్టి కాస్త తేమగా ఉన్నపుడే గింజలను చేత్తో చల్లినట్లుగా వేసుకోవాలి. పైన కొద్ది మట్టిని పొరలా వేసి, కొన్ని నీళ్లను చల్లితే చాలు! మరి ఎండలో కాక, పూర్తి నీడలో కాకుండా చూసుకోవాలి. ఓ నాలుగు రోజుల నుంచి వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. కొద్దిగా పెరిగిన తరువాత నారు వచ్చాక ఆ మొక్కలను వేరే కుండిలోకి మార్చుకోవాలి. అలా అని అన్ని మొక్కలను ఒకేదాంట్లో ఉంచకూడదు. అలా చేస్తే మొక్కలు ఒకదానికొకటి అడ్డుగా మారి పెరుగుదల ఆగిపోతుంది. కనీసం ఒక అంగుళం దూరం ఉంచేలా నాటుకోవాలి. ఒకవేళ ఎండాకాలంలో ఈ మొక్కను పెంచాలనుకుంటే సాయంత్రంపూట మాత్రమే నీటిని అందించాలి. అలాగని మరి ఎక్కువ నీళ్లను పోయకూడదు. మరి నీరు పోయకుండా వదిలేయకూడదు. మొక్క చుట్టూ మట్టిని తేమగా ఉండేలా చూసుకోవాలి. కొద్దిగా పెరిగాక పైన వచ్చిన చిగురును చేత్తో తెంపేయాలి. ఆ చిగురునుంచి కొమ్మలు వేరుపడి, ఆకులు గుబురుగా పెరిగే అవకాశముంది. ఇలా ఆ మొక్కకు పువ్వు వచ్చేవరకు చేయాలి. ఆ తరువాత చిగురులను తెంపకూడదు. ఆ పువ్వు వాడిపోయి దానిలోపలి నుంచి చిన్నగా మిర్చి బయటకు వస్తుంది. పొడవు పెరిగాక వాటిని తెంపేయాలి. లేదంటే అవి ఎర్రగా మారి వాడిపోతాయి.

మొక్క పెరుగుదలకు వీటిని వాడాలి:
పచ్చిమిర్చి మొక్కకు మట్టి,  కోకోపీట్ సేంద్రీయ ఎరువు ప్రధానమైనవి. ముందుగా మట్టిని తీసుకునేముందు చెత్త, రాళ్లు, మట్టి పెడలు అనేవి లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. కోకోపీట్ ఒకవేళ అందుబాటులో లేకపోతే బదులుగా కొద్దిపాటి ఇసుకను వాడొచ్చు. ఎందుకంటే ఎక్కువ నీటిని ఇసుక గ్రహించలేదు. కాబట్టి మొక్క పాడవకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఎరువు కోసం మార్కెట్ లో దొరికే ఎరువు రకాల్ని వాడుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకున్న ఎరువును వాడొచ్చు. రెండు వారాలకోసారి సేంద్రీయ ఎరువు(వర్మి కంపోస్ట్)ను ఇవ్వాలి. వారానికి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ ను చల్లాలి.

మొక్కలో వచ్చే సమస్యలు:
మిర్చి ఆకు ఒక్కోసారి ముడత బారిన పడుతుంది. దీంతో మొక్క పెరుగుదల అంతటితో ఆగిపోతుంది. ముడత పడిన చోట బాక్టీరియా, సన్నని పురుగులు చేరి మొక్క క్రమంగా పాడవుతుంది. మొక్క పాడవకుండా ఉండటానికి రెండు మార్గాలు… ఒకటి ముడత వచ్చిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయడం. రెండు పుల్లటి పెరుగును చల్లడం. తాజా పెరుగును నాలుగు రోజులు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచితే బాగా పుల్లగా మారుతుంది. ఆ పెరుగులో కాసిన్ని నీళ్లను కలిపి మజ్జిగలా చేసి, ఒక స్ప్రే డబ్బాలో పోసి, పూర్తిగా ఆకులపైన కింద మొక్క చుట్టూ, మట్టిపై స్ప్రే చేయాలి. ఆకు ముడతలు తగ్గకున్న మరలా ఈ ప్రయోగాన్నే కొనసాగించాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎప్పుడు మొక్క చుట్టూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోని ఎరువు వేసినప్పుడు పురుగులు, దోమలు వంటివి వస్తే, నీటిని లేదా తయారుచేసిన కషాయానైనా పోయాలి.

పచ్చిమిర్చి వల్ల కలిగే ప్రయోజనాలు :
పచ్చిమిర్చిలో క్యాస్పేసియన్ అనే పదార్థం ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. జీర్ణక్రియను పెంచి తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. అంతేకాక ఆకలిని పెంచుతుంది. గాయాలైనప్పుడు ఎక్కువ రక్తస్రావం జరగకుండా చేస్తుంది.
కీళ్ల నొప్పులుంటే, మిరప గింజలను నువ్వుల నూనెలో కలిపి కొద్దిగా కాచి నొప్పి ఉన్న చోట రాసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

పోషకాలు:
పచ్చిమిరపకాయల్లో విటమిన్ -సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో విటమిన్ ఎ, బి -6, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.
శరీరంలో వృద్ధి చెందే వేడిని నియంత్రించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

రకాలు…
మిర్చిలో చాలా రకాలుంటాయి. చిన్నగా ఉండి ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మిరపలో కారం ఎక్కువగా ఉంటుంది. ఎర్రగా ఉండే గుంటూరు మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది.

Leave Your Comments

పురుగులు మరియు తెగుళ్ల మందుల మిశ్రమాల వాడకం లో రైతులు పాటించ వలిసిన సూచనలు

Previous article

రైతుల ఖాతాలోకి సొమ్ము జమ..ఇలా చెక్ చేసుకోండి

Next article

You may also like