Bapatla Rice Research Center మన దేశంలో ఎక్కువగా సాగు అయ్యే ఆహార పంట వరి. మన దేశ ఆహారభద్రత వరి పంట పైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలో భవిష్యత్తులో వరి పంటలో రకాలు కనుగొనాల్సిన అవసరం ఉంది. తక్కువ పెట్టుబడి, తక్కువ నీరు, అధిక దిగుబడి పొందే విధంగా వరిలో రకాలు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో బాపట్ల వరి పరిశోధన కేంద్రం Bapatla Rice Research Center కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాలను అందుబాటులోకి తీసుకొచ్చి అనేక పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన బాపట్ల వరి పరిశోధన కేంద్రం నుంచి మరి కొన్ని రకాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రముఖంగా ఒక రకాన్ని విడుదల చేసింది ఈ కేంద్రం.
దేశవ్యాప్తంగా అకాల వర్షాలు, తుఫానులు రైతుల పాలిట శాపంగా మారాయి. ఆరుగాలం పండించిన పంటను ఒక్క తుఫాను పంటను మింగేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో తుఫానుకు కూడా తలవంచని పంటని పరిచయం చేసింది బాపట్ల వరి పరిశోధన కేంద్రం. తుపాన్ల కారణంగా పంట నష్టపోతున్న రైతులకు శుభవార్త అందించింది ఆ సంస్థ. తుపానుకు సైతం నేలవాలకుండా ఉండే నూతన వరి వంగడం BPT-2846 (BPT-2846 Rice) రకాన్ని బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మూడేళ్లుగా కొంతమంది రైతులకు మినీ కిట్లు ఇచ్చి సాగు చేయించగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నారు. నాణ్యమైన దిగుబడులతోపాటు దోమ, అగ్గి తెగులును కూడా తట్టుకుంటుందని బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Latest Agriculture News