Special Story On Punganur Cow దేశంలోనే ప్రాముఖ్యత సంతరించుకున్న ఆవులలో పుంగనూరు జాతి ఆవులు ఒకటి. చూడటానికి పొట్టి పొట్టిగా, ముద్దుగా కనిపించే ఈ రకం జాతి ఆవులకు చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రసిద్ధి. గతంలో ఈ ఆవుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ రకం జాతి ఆవులు అంతరించే ప్రమాదం ఉందంటున్నారు రైతులు. సాక్షాత్తు పరమశివుడి వాహనం అయిన నందిలాగా ఉండే ఈ జాతి రకం ఆవుల ధర కూడా ఎక్కువే. నిజానికి మన దేశంలో 34 రకాల పశు జాతులుండగా.. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులు అని చెప్పవచ్చు.price of Punganur cow
పుంగనూరు ఆవులు మామూలు ఆవు దూడల సైజులో ఉంటాయి. కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది. ఇవి 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. ఇవి 115 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ఈ రకం జాతి ఆవులు ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా, తోక మాత్రం నేలను తాకుతూ చూపరులని ఇట్టే ఆకర్షిస్తుంది. అసలు ఈ పుంగనూరు జాతి ఆవుల చరిత్ర ఒకసారి చూస్తే.. ముందుగా ఈ జాతి ఆవులను క్రీస్తుశకం 610 సంవత్సరంలో కనుగొన్నారు.బాణులు, నోళంబులు, వైదంబచోళ ప్రభువులు పుంగనూరు ఆవులను తమ సంస్థానాల్లో పోషించేవారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకున్న అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవుల అభివృద్ధి సాగింది. మందలు మందలుగా ఉండే ఈ ఆవుల కోసం యుద్ధాలు చేసేవారు. విజేతలు విజయచిహ్నంగా ఆవుల మందలను తీసుకెళ్లినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. Punganur Cow Story
ఈ రకం జాతి ఆవులను పెంపకం చాలా సులువైందిగా చెప్తున్నారు పుంగనూరు వాసులు. సాధారణ ఒక ఆవుని పోషించే బదులు పుంగనూరు జాతి గోవుల్ని 10 పెంచవచ్చు అని చెప్తున్నారు. వీటికి కావాల్సిన దాణా పరిమాణం కూడా తక్కువే. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే పుంగనూరు జాతి ఆవులు ప్రస్తుతం లక్షల ధర పలుకుతుంది. అయితే ప్రస్తుతం ఈ రకం జాతి అంతరించే ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఈ పశుజాతి ఆవులు ఇప్పుడు వందల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి పాల దిగుబడి తక్కువగా ఉండటం, విదేశీ ఆవుల పాల దిగుబడి ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ జాతి ఆవులకు బదులు ఎక్కువగా పాలిచ్చే ఆవు జాతులను పోషిస్తున్నారు. Speciality of Punganur cow
పుంగనూరు గోవుల విశిష్టతలు ఏంటి?
► పశువు 70 నుంచి 90 సెంటిమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది.
► ఈ ఆవు పాలలో 8 శాతం కొవ్వు ఉండి, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
► ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువుంటాయి.
► రోజుకు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది.
► 2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తుంది.
► ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు.
► లేత చర్మము, చిన్న పొదుగు, చిన్నతోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి.
► ఈ ఆవుల ధర లక్ష నుంచి ఇరవై లక్షల వరకు పలుకుతుంది. Punganur cow