ప్రస్తుత కాలంలో అతితక్కువ ధరలో వస్తోన్న పండేదైనా ఉందంటే.. అది అరటి. సామాన్యుడు సైతం తృప్తిగా తినగలిగే పండు. ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తే.. ఒక్క అరటి పడు తింటే చాలు.. సుమారు 90 నిమిషాల పాటు ఆకలిని తట్టుకునే శక్తి వస్తుంది. వీటిలో పచ్చి అరటికాయలను కూడా కూరల్లో ఉపయోగిస్తారు. అంతేకాదు, వీటిని ప్రాసెస్ చేసి చిప్స్ లా కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే, ఈ వీటి జాతిలో చైనీస్ అరటికి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, అనేక దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
వీటిని ప్రజలు విస్తారంగా కొనుగోలు చేస్తుంటారు. పండుతో పాటు, చైనీస్ అరటి చిప్స్ అంటూ విస్తృతంగా తింటుంటారు. అయితే, ఈ అరటిని మనం ఏదో చైనా నుంచి తెప్పించుకుంటున్నాం అనుకుంటే పొరపాటే. మన దేశంలోనే పలు ప్రాంతాల్లో ఈ తోటను పండిస్తున్నారు. బిహార్ వైశాలి, సమస్తిపూర్, ముజఫర్‌పూర్ జిల్లాల్లో చైనీస్ అరటితోటను పెద్ద ఎత్తున పండిస్తారు. వీటి మొక్కలు ఇతర జాతి కంటే చాలా మృదువుగా, సన్నగా ఉంటాయి. తక్కువ ఎత్తులో పెరుగుతాయి. అయితే, దీని అరటి గెలలు మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటాయి. వీటి గెల సాధారణంగా 15 కిలోల బరువు ఉంటే.. ఒక్కో గెలకు 150 అరటిపండ్లు ఉంటాయి.
ఇతర జాతి కంటే ఈ పండ్లు చాలా తీయగా ఉంటాయి. వీటిని 3 నుంచి 4 రోజుల పాటు తగిన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ తోట వేస్తే సుమారు హెక్టారుకు 40 నుంచి 45 టన్నుల దిగుపడి ఖాయం. వీటిని నిల్వ చేసిన సమయంలో సువాసన వెదజల్లుతాయి. మార్కెట్లో ఈ పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఇలాంటి పంటల వల్ల రైతులకూ మంచి దిగుబడితో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే మెల్లగా రైతులు వీటి గురించి తెలుసుకుని పంటలు వేసేందుకు ముందుకొస్తున్నారు.