Politics over paddy procurement add to Telangana farmer తెలంగాణ రాష్ట్ర రైతులతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై రోజుకో వైఖరి.. రెండు నాల్కల ధోరణితో ఆగం పట్టిస్తున్నారు. గల్లీలో ఓ మాట.. ఢిల్లీలో మరో మాటతో రైతుల్నిరెచ్చగొడుతున్నారు. తెరాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ అసలు రైతు సమస్యపై చర్చించడమే మానేశారు. రైతు సమస్య కాస్త రాష్ట్ర పొలిటికల్ వార్ గా మారింది. దీంతో రైతు కేవలం మైదానంలో బంతిగా మారాడు. ఏ నాయకుడి మాటలు నమ్మాలో తెలియక తికమకపడుతున్నారు. కేంద్రం యాసంగి వడ్లు కొనమని తేల్చింది. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ముందు రాష్ట్రం వడ్లు కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తెరాస మాత్రం ముందుగా యాసంగిలో వరి వేయాలని రైతులకు సూచించింది. కానీ ఇప్పుడేమో పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక కాంగ్రెస్ తెరాస, బీజేపీ నాయకుల్ని విమర్శిస్తూ కాంగ్రెస్ అంటే కిసాన్ పార్టీగా ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తుంది.
Triangle Politics In Telangana రైతులకి సమస్య వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు వెళ్లి పరామర్శించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు రైతులతో రాజకీయం చేస్తూ సానుభూతు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు మన రాజకీయ నాయకులు. అసలు యాసంగి పంట అంశం తెరపైకి ఎప్పుడొచ్చిందంటే.. నవంబర్‌లో జరిగిన హుజురాబాద్ ఎన్నిక తరువాత, వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య రాజకీయం దుమారం మొదలైంది. ఈ వ్యవహారం, ఒకప్పుడు ధర్నాచౌక్‌ను తొలగిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి, అదే ధర్నాచౌక్‌లో నిరసనకు దిగేలా చేసింది. అక్కడ మొదలైన రాజకీయ క్రీడ ఢిల్లీ స్థాయిలో మారుమ్రోగుతుంది. ఇక ఎప్పుడూ తెలంగాణ ప్రజలపై స్పందించని వైఎస్ఆర్టిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోయడం విడ్డురంగా కనిపిస్తుంది. రోజు ట్విట్టర్ వేదికగా రైతులపై ప్రేమని చుపిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుపడుతున్న తీరు అందరు గమనిస్తున్నారు. కొంతకాలంగా నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నట్లుగా ప్రకటించుకుని దీక్ష మొదలుపెట్టారు. ఇప్పుడు రైతులపై పొలిటికల్ టర్న్ తిరిగేసరికి షర్మిల కూడా రైతులపై పోరాటం చేస్తున్నట్లుగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
వడ్ల కొనుగోలుపై కేంద్ర రాష్ట్రాల పరిస్థితేంటి ?
Telangana Paddy Procurement ప్రభుత్వం కొంటుందన్న నమ్మకంతో కొందరు, దాచుకునే చోటులేక మరికొందరు మార్కెట్ యార్డులకు ధాన్యాన్ని తరలించగా, అకాల వర్షాలు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతోంది.. అసలే కొనుగోళ్లు ఆలస్యం కావడం, కొనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాదోపవాదాలు, ఆపై అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2015-16లో 15.79 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, 2016 -17లో 35.96 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేంద్రం కొన్నది. అయితే, 2020 -21లో ఏకంగా 94 .54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యం కొనుగోలు జరిగింది. అయితే నిల్వలు పెరిగిపోవడంతో ఈ ఏడాది అంత కొనుగోలు చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడాది తెలంగాణలో సుమారు కోటి లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పండగా, అందులో 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడానికి అంగీకరించింది. మిగతాది తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లర్స్‌కు అవసరమైన 20-30 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వగా, మిగిలిన సుమారు 20-30 లక్షల మెట్రిక్ టన్నులు భారం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 20-30 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు అదనపు భారం పడుతుంది.
politics farmers తెలంగాణలో వరి పంట అవసరమైన దానికన్నా ఎక్కువ పండటమే అసలు సమస్య అని నిపుణులు అంటున్నారు.తెలంగాణలో జనాభాకు 17 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సరిపోతుంది. ఒకవేళ పంట నష్టాన్ని కలుపుకున్నా 25లక్షల మెట్రిక్ టన్నులు సరిపోతుంది. ఎఫ్‌సీఐకి ఇవ్వడానికి మరో 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు కావాలనుకున్నా, మొత్తంగా 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరిపోతుంది. కానీ ఈసారి తెలంగాణలో దాదాపు ఒక కోటీ మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పండింది. అంటే 50-60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా ఉత్పత్తి అయ్యింది.