Janagama Farmer Touches Feet Of DMO ప్రభుత్వాలు మారుతున్నాయి..ముఖ్యమంత్రులు మారుతున్నారు. కానీ రైతన్న సమస్య మాత్రం తీరలేదు. ఓ వైపు భారీగా పెరిగిపోతున్న పంట పెట్టుబడులు..మరోవైపు పండించిన పంటకు దక్కని గిట్టుబాటు ధర వెరసి రైతన్న కష్టాల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడిపోతున్నాడు. భూమిని సాగు చేసి పంటలు పండించి అందరి కడుపులు నింపే రైతన్నకు మాత్రం కష్టాలు తప్పటంలేదు. రైతు కుటుంబానికి న్యాయం జరగటంలేదు. ఇటువంటి దుర్భర స్థితితో రైతన్నలు తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఫలితం దక్కటం లేదు. చివరికి ప్రభుత్వ అధికారుల కాళ్లపై పడి మొరపెట్టుకుంటున్న దీన పరిస్థితులు తెలంగాణాలో చోటుచేసుకుంటున్నాయి.
తేమను పరిశీలించేందుకు జనగామ మార్కెట్ కాటన్ యార్డుకు అధికారులు వచ్చారని ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లను రైతులు తొలగించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కురిసిన వర్షానికి 150 బస్తాల వరకు కొట్టుకుపోగా, 10వేల బస్తాలకుపైగా ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఓ రైతు డీఎంవో నాగేశ్వరరావు కాళ్లపై పడి వేడుకున్నాడు. ధాన్యం కొనకపోతే ఆత్మహత్యే శరణ్యమని మరో మహిళా రైతు సుజాత కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ రైతులు కాళ్లపై పడి ఏడ్చిన తీరు అందరిచేత కంటతడి పెట్టించింది.
ఇక జనగామ రైతు సమస్యలపై వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీ రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడి రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదు.పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే, అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ గారికి మాత్రం కనిపించడం లేదు. దొరా.. పంటలు కొనండి అని గుండెలు ఆగేలా మొత్తుకొంటున్నా..కేసీఆర్ కు మాత్రం చెవిటోని ముందు శంఖం ఊదినట్టే ఉంది. ఆఖరి గింజ వరకూ కొంటానన్న దొర గారు, ఇప్పటికైనా మీ డ్రామాలు పక్కన పెట్టి.. కాళ్ళు పట్టుకొంటున్న రైతులు, గల్లా పట్టుకోకముందే రైతుల ధాన్యాన్ని తక్షణమే కొనాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. YS Sharmila