వ్యవసాయంలో ఓ నానుడి ఉంది. ఎంత ఎక్కువ విస్తీర్ణంలో పంటని సాగు చేశామన్నది కాదు ఎంత మేర లాభాలతో కూడిన దిగుబడి సాధించామన్నదే ముఖ్యం. ఏ పంట నాణ్యత బాగుంటుందో ఆ పంటకే మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయంలో టెక్నాలిజీని అందిపుచ్చుకుంటూ కొందరు రైతులు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మామిడి సాగులో అధిక దిగుబడి , నాణ్యతతో కూడిన పంటను మార్కెట్ కి అందిస్తున్నారు కొంతమంది రైతులు. మంచి నాణ్యత ఉండటంతో మార్కెట్లో వారి పంటకు అధిక ధర పలుకుతుంది.
పక్వానికి వచ్చిన దశలో చెట్టుమీదే కొమ్మలకు వాలుతూ నిగనిగలాడుతున్న ఈ మామిడి పండ్లను చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. కానీ ప్రకృతి విపత్తుల కారణంగా మామిడి చెట్టు మీద మామిడి పండే అవకాశం లేకుండా పోయింది. అకాల వర్షాల కారణంగా మామిడి నేలరాలడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు సగటు రైతు. కానీ కొందరు రైతులు మామిడి సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ నాణ్యతతో కూడిన పంటను మార్కెట్ కు తరలిస్తున్నారు. సంచుల్లో మామిడిని పెంచుతూ మంచి నాణ్యత గల మామిడికి ప్రాణం పోస్తున్నారు. కాయలకు కవర్లను కట్టడం వల్ల తొడిమవద్ద నల్లగా మసి పట్టడం, పురుగు పట్టడం, సొనకారడం తగ్గుతుంది. ఫలితంగా పురుగు మందుల అవసరం ఉండదు. గాలి దుమారం, వడగండ్ల వానకు కాయలు రాలవు. దీంతోపాటు మామూలు కాయకంటే 100 గ్రాములవరకూ ఎక్కువ బరువు పెరుగుతుంది. చూసేందుకు పండ్లు నీట్‌గా ఉండటంతోపాటు చెట్టుపైనే పండటం వల్ల అధిక ధర పలుకుతుంది.
అయితే ఈ కవర్ కట్టే విధానంలో కొన్ని మెళుకువలు పాటించాల్సి ఉంది. కాయకు కవర్లను కట్టే ముందు కాయలను గుడ్డతో శుభ్రంగా తుడవాలి. తర్వాత కాయ కిందిభాగం నుంచి తొడిమ పైభాగంలో మూడు సెంటీమీటర్ల పైన కవర్లని కట్టాలి. మామిడికాయలే కాకుండా దానిమ్మ, జామ తదితర కాయలకూ వీటిని ఉపయోగించుకోవచ్చు.అయితే ఈ కవర్ల వాడకం వలన అనేక ప్రయోజనాలున్నాయి. కాయ రాలకపోవడం, పురుగు బెడద లేకపోవడం, క్రిమికీటకాలు, కోతుల బెడద నుంచి పంటను కాపాడవచ్చు. మరీ ముఖ్యంగా సాధారణ పంటతో పోల్చుకుంటే కవర్లో పెరిగిన మామిడి పండ్లు దాదాపుగా 20 రోజులు పాడవ్వకుండా ఉంటాయి.
#MangoFruit #MangoProtectionCovers #AgicultureLatestNews #Eruvaaka