తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువశాతం రైతాంగం వరి సాగునే ఎంచుకుంటుంది. ఈ పంట తాతల కాలం నుండి అధికంగా సాగుబడి అవుతున్నది. ఇతర పంటలు వేసినప్పటికీ వరి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు రైతన్నలు. అయితే ఈ పంటని అధికంగా వెంటాడుతుంది సుడిదోమ. ఈ సుడిదోమను ముందే గుర్తిస్తే నష్టం నుండి బయటపడొచ్చు. సరైన సమయంలో గుర్తించనట్లైతే భారీ నష్టం వాటిల్లుతుంది. వరి పంటకు సుడిదోమ ఎక్కువ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో పట్టేస్తుంది.దీన్ని గుర్తించడం ఎలా అంటే సుడిదోమ రెండు రంగుల్లో ఉంటుంది. గోధుమరంగుదోమ, తెల్ల వీపు సుడిదోమ అంటుంటారు.
తెల్ల వీపు మచ్చ దోమని గుర్తించడం ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ రకమైన దోమ గోధుమ రంగు దోమ కంటే చిన్నవిగా ఉంటాయి తెల్ల పురుగుల ముందు రెక్కలు కలిసే చోట చివర నల్లటి మచ్చ ఉంటుంది రెక్కల ముందు భాగంలో తెల్లటి మచ్చ ఉంటుంది. ఇవి 6 -8 గుడ్లను వరి దుబ్బుల మొదళ్ళ దగ్గర ఆకు తొడిమ లోపలి కణజాలంలో పెడతాయి ఈ గుడ్లు విడి విడిగా ఉంటాయి పిల్ల పురుగులు తెల్లగా ఉండి 8-28 రోజుల్లో పెద్ద పురుగులుగా మారుతాయి. ముఖ్యంగా ఈ దోమ వరి పిలకలు వేసే దశలో పడుతుంది.
గోధుమ రంగు దోమ జాతి రకం ఆడదోమలు మగ వాటి కంటే పెద్దవిగా ఉంటాయి ఈ దోమల్లో కొన్ని దోమలకు రెక్కలు ఉంటాయి. మరికొన్ని దోమలకు రెక్కలు ఉండకపోవడం చూస్తూ ఉంటాం. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు రెక్కలున్న దోమలు అభివద్ధి చెందుతాయి తల్లి దోమ 300-500 గుడ్లను ఆకు తొడిమలో గాని లేదా మధ్య ఈనేలో గాని పెడుతుంది 2-12 గుడ్లను ఒక దాని పక్కన ఒకటి పెట్టి వాటి చివరలను ఒక దానితో ఒకటి కలిపి గుంపుగా చేస్తుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారుతాయి. ముఖ్యంగా వరి పొట్ట దశలో ఆశిస్తుంది.
అయితే ఈ రెండు దోమలు వరి పంటను కొంచెం కొంచెం నాశనం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వాటిని అవి అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి. రెక్కలున్న సుడిదోమలు వరి పిలకలు వేసే దశలో పట్టేస్తాయి. ఇవి మూడు, నాలుగు వారాల్లో రెక్కలు లేని దోమల్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ తరువాత ఇవి రెండో సంతతిని ఉత్పతి చేస్తాయి ఈ దశలో పిల్ల, తల్లి పురుగులు తీవ్రంగా నష్టపరుస్తాయి మనం ఈ దశలో మాత్రమే పురుగుల్ని గుర్తించగల్గుతాం. ఈ సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే రెక్కలున్న మూడోతరం పురుగుల వద్ధి చెంది పైరును నష్టపరుస్తాయి.
అనుకూల పరిస్థితులు :
యాజమాన్య పద్ధతుల ఇలా పాటిస్తే ఫలితం ఉంటుంది. ముందుకు సంబంధిత శాస్త్రవేత్తలను కలిసి వారికి సుడిదోమ గురించి వివరించాలి. ఈ నేపథ్యంలో వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళాలి. నత్రజని ఎరువులను 3 నుంచి 4 దఫాలుగా సిఫారసు చేసిన మోతాదులో వేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు ఏర్పాటుచేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. పిలక దశలో వరి దుబ్బుకు 10-15 దోమలు, అంకురం నుంచి ఈనే దశలో 20-25 దోమలు ఉన్నట్లు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వాటి నివారణ కోసం తొలి దశలో లీటర్ నీటిలో ఇటోఫెన్‌ప్రాక్స్ రెండు మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. దోమ ఉధృతి ఎక్కువుంటే పైమెట్రోజిన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్యురాన్ 0.4 గ్రాములు లేదా ఇమిడాక్లొప్రిడ్, ఎథిప్రోల్ 0.25 గ్రాము లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు మందులు పిచికారీ చేసే ముందు పొలంలో నీటిని తగ్గించి, పాయలు తీసి మొక్కల మొదళ్లపై పడేలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చివరిగా ఒక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జాతి రకం దోమ పైరును చాలా తక్కువ కాలంలోనే పంటను పీడిస్తుంది. దాన్ని త్వరగా గుర్తించి చేయాల్సిన కార్యాచరణ మొదలు పెట్టాలి లేదంటే నష్టం తీవ్రతరం అవుతుంది.
#BrownPlanthopper #PaddyCultivation #AgricultureLatestNews #Eruvaaka