మొక్కలకు పోషక పదార్థములను మరియు మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయాలను జీవన ఎరువులు అంటారు. ఈ సూక్ష్మ జీవులు పంటలకు కావాల్సినపోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి వుంటాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మ జీవుల సంఖ్య ఎక్కువగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందిస్తాయి.
జీవన ఎరువులు ఎక్కువగా మొక్కలకు కావాల్సిన నత్రజని స్థాపన మరియు భాస్వరపు నిల్వను కరిగించుట ద్వారా మొక్కలకు పోషకాలు అందించుటలో దోహదపడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున చాలినంత సేద్రియ ఎరువులు లభ్యం కానందున జీవన ఎరువుల ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతుంది. సమగ్ర ఎరువుల వాడకంలో ఇది ఒక భాగమై నేల ఆరోగ్యం ఉత్పాదకత కాపాడడంలో దిగుబడి నాణ్యత పెంచడంలోనూ ప్రముఖపాత్ర వహిస్తుంది.
జీవన ఎరువుల ఆవశ్యకత..
హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడముల దిగుబడి రసాయన ఎరువుల వాడకం పై ఎక్కువగా ఆధారపడటం వలన, మనకు తెలియకుండానే వాతావరణ కాలుష్యం, భూసార నిర్వీర్యత, రైతుకు అధిక ఖర్చు, ఎరువుల కొరత, సమస్యాత్మక భూముల సంఖ్య పెరగడం వంటి విపత్కరాలు సంభవిస్తున్నాయి. అధిక రసాయన ఎరువుల వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతిముఖ్య సముదాయమైన సూక్ష్మజీవుల సంఖ్య తగ్గటం, అవి జరిపే రసాయన చర్యలపై మార్పులు రావడం వంటి ప్రక్రియలు జరిగి భూమికి ఉన్న సహజ గుణాలు క్షీణించి భూ ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది.
ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ మరియు సమగ్ర పోషక యాజమాన్యం వంటి పద్ధతులు పాటించాల్సి వస్తుంది. వీటిలో భాగంగానే సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
#ImportanceOfBiofertilizers #Fertilizers #Agriculture #farmingdailyupdates #todayagriculturenews #eruvaaka