వ్యవసాయం నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుని, దానికి ఆధునిక పద్ధతులని జోడిస్తే ఆ పంట మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. తాతల కాలం నాటి పంటను వారసత్వంగా తీసుకుని చేసేవారు కొందరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలని కాదని పొలంలోకి దిగేవారు మరికొందరు. అయితే అందరూ పండించేది నాణ్యమైన పంటే అయినా కొన్ని మెలకువలతో ఆ పంటను మరింత దిగుబడి వచ్చేలా మార్చేయవచు. రైతన్నలు ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా రక్షించుకుంటున్న పంటలకు అతివృష్టి కారణంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నది. ఒక్కోసారి అనావృష్టి కూడా వెంటాడుతూ ఉంటుంది. సరే ప్రకృతిని మనం మార్చలేము కాబట్టి పంటను ఇలా పండిస్తే అధిక లాభాలు గడించడమే కాకుండా వైపరీత్యాలను కూడా జయించవచ్చు.
ఎత్తు మడుల సాగు విధానం ఎంతో మేలైంది. ఈ విధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాలు ఎక్కువగా కురిసినా, తక్కువగా కురిసినా.. అది నల్లరేగడి నేలైనా, ఎర్ర చల్కా నేలలైనా.. అది మెరక పొలమైనా, లోతట్టు ప్రాంతమైనా.. పత్తి /కంది /మిర్చి /పసుపు పంటలైనా లేదా వంగ తదితర కూరగాయ పంటలైనా సరే ఎత్తు మడులపై విత్తుకుంటే మేలు అంటున్నారు నిపుణులు. ఎత్తు మడులలో పంటను పండిస్తే… అతివృష్టి, అనావృష్టి కాలాల్లో వత్తిళ్లను తట్టుకోవడమే కాకుండా పంటలు బాగా పెరుగుతాయని, గాలి వెలుతురు బాగా సోకడం వల్ల చీడ పీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని, అంతిమంగా అధిక దిగుబడులనిస్తాయని చెప్తున్నారు వ్యవసాయ నిపుణులు.
ఇక ఈ విధానాల్లో పత్తి, కంది మాత్రమే కాదు.. మిర్చి, పసుపుతోపాటు వంగ తదితర కూరగాయలను సాగు చేయవచ్చు. అధిక వర్షాలు కురిస్తే.. సాళ్లలో నీరు నిల్వ ఉండి ఇంకుతుంది. వర్షాలు తక్కువగా ఉంటే.. కురిసిన కొద్ది మాత్రం వర్షం ఎక్కడికక్కడే ఇంకి ఎత్తు మడులపై ఉన్న పంటలు త్వరగా నీటి ఎద్దడికి గురికాకుకుండా ఉపయోగపడుతుంది. సాధారణ సాగు పద్ధతిలో అధిక వర్షం కురిసినప్పుడు పంటలు ఉరకెత్తి దెబ్బతింటాయి. తక్కువ వర్షం కురిస్తే పంట త్వరగా బెట్టకు వస్తుంది. ఎత్తు మడులపై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా నష్టాన్ని నివారించవచ్చు. అంతేకాదు పంటలు ఏవైనా సరే ఈ పద్ధతిలో అధిక దిగుబడి కూడా పొందవచ్చు
సో .. పంట పండించే విధానంలో మార్పులు రావాలి. ఆ మార్పులు మనల్నే కాదు మన చుట్టూ ఉన్నవారికి ఆదర్శం అవుతుంది. అంతే కాకుండా సాగులో లాభాలు పొందడమే కాకుండా ఇతర పంటలపై ఆసక్తి పెరుగుతుంది. రొటీన్ పద్దతిలో కాకుండా ఎత్తు మడులలో పంటను వేసి చుడండి అని సలహా ఇస్తున్నారు అధికారులు.
#benefitsofbedfarming #bedfarming #raisedbedfarming #agriculturnews #eruvaakadailyupdates #eruvaaka