ప్రకృతి మానవాళికి అన్నం పెడుతుంది. ప్రకృతి ప్రసాదించిన మొక్కలు, చెట్లతోనే మనిషి వ్యవసాయాన్ని కనుగొన్నాడు. ఆ వ్యవసాయమే ఇప్పుడు మానవజాతికి ఏకైక వనరుగా మారింది. వ్యవసాయం చేయని రోజున ఆ దేశ అభివృద్ధి ఆగిపోతుంది. ఇప్పుడు రైతుల్లో వ్యవసాయంపై మరింత అవగాహన వచ్చింది. రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. అధిక దిగుబడి వచ్చే పంటలవైపు చూస్తూనే వరి, పప్పు ధాన్యాలను పండిస్తున్నాడు. అయితే కొందరు రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఇది ప్రస్తుతానికి బాగానే ఉన్నా ముందుముందు రైతులకు నష్టం కలిగించే అంశం.
ప్రకృతి ప్రసాదించిన భూమిలో మనం ఎన్నో రకాల పంటలు పండించుకునే అవకాశం ఉంది. రైతులు వరి నాట్లు వేయడంతోపాటు అదనపు ఆదాయంపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న మొక్కలను పొలం గట్లపై నాటుతున్నారు. మొక్కల నిర్వహణ కోసం ప్రభుత్వం ఉపాధిహామీ కింద డబ్బులు కూడా చెల్లిస్తున్నది. దీంతో చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహిస్తున్నది. సాధారణ పంటలతోపాటు అదనపు ఆదాయం వచ్చే మొక్కలు పెంచేలా ప్రభుత్వం హరితహారం ద్వారా ఉచితంగా టేకు మొకలు ఇవ్వడంతోపాటు ఈజీఎస్ కింద గుంతలు తవ్వినందుకు, వాటి సంరక్షణకు డబ్బులు ఇస్తున్నది. పండ్లు, టేకు, వెదురు మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పొలాల వద్ద ఖాళీ స్థలం ఎక్కువుగా ఉంటే టేకుతో పాటు జామ, మామిడి, సపోటా, సీతాఫలం మొకలు నాటుకునే అవకాశమున్నది. ఇందులో అంతర పంటలు సాగు చేసుకునే వీలుంది.
పండ్ల జాతికి చెందిన జామ, నిమ్మ, బొప్పాయి, నేరేడుతో పాటు టేకు, వేప, తెల్లదుద్ది తదితర మొక్కలను ప్రభుత్వం అందిస్తోంది. పొలంలో పంటతో పాటు గట్లపై మొక్కలు పెంచుకుని కొన్ని ఏళ్ల తర్వాత రెండు రకాలుగా ఆదాయం పొందవచ్చు. పండ్ల మొక్కలైన జామ, ఉసిరి, నేరేడు, నిమ్మ ఎత్తు తక్కువగా పెరగడంతో పాటు కాయలు కూడా రెండేళ్లలోనే చేతికి అందుతాయి. టేకు, వేప, తెల్లదుద్ది చెట్లు పదేళ్లలో పెరుగుతాయి. వీటి ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. గట్లపై చెట్టు రైతు భూమి సరిహద్దును గుర్తించడానికి కూడా ఉపయోగపడుతాయి. వర్షాలు తక్కువగా కురిసినప్పుడు పొలంలో నీటి పదును తగ్గకుండా కూడా దోహదం చేస్తాయి.
చాలా వరకు ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకుని ఆకాశం వైపు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడా సాధారణ వర్షపాతాలు సైతం నమోదు కాని పరిస్థితి ఉంది. సరిపడా అడవులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. సో మొక్కలు నాటడం వలన ఆదాయంతో పాటు పర్యావరణానికి కూడా దోహదపడుతుంది. ఒక చెట్టు తన జీవిత కాలంలో రూ. 2.50 నుండి రూ.5 లక్షల విలువ చేసే ఆక్సిజ¯ŒS అందిస్తుంది. విషవాయువులను పీల్చి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. నీటినిల్వ చేయడం, నీటి ఆవిరి ఉత్పాదకత, మేఘాల ఏర్పాటుకు చెట్లు ఎంతో దోహదం చేస్తాయి.
#farmers #secondsourceofincome #agriculture #eruvaaka