వ్యవసాయంలో ఘనమైన మార్పులు వచ్చాయి. రసాయనిక సాగుని పక్కనపెట్టి సేంద్రియ పంట వైపు వేస్తున్నారు రైతులు. ఒకప్పుడు చెత్తే కదా అని తీసిపారేసే పరిస్థితి కానీ ఇప్పుడు ఆ చెత్తే బంగారమైపోయింది. అది సేంద్రియ ఎరువుగా మారి సత్తా చాటుతోంది. మిద్దెతోటలకు జవం అవుతోంది. మొక్కలకు జీవం పోస్తోంది. ఓ వైపు చెత్త నిర్మూలన చేపడుతూనే.. మరోవైపు ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. రసాయనిక ఎరువులు భారంగా మారుతున్నాయి వేల రుపాయల పెట్టుబడి పెట్టిన తర్వాత పంటల దిగబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. రైతులను పెట్టుబడి వ్యయం నుండి విముక్తి కలగాలంటే అందరు ఈ సేంద్రియంపై ద్రుష్టి పెట్టాలి.
వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరిగింది. వీటి ధరలకూ రెక్కలు వచ్చి పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఎరువుల అధిక వాడకంతో భూమి నిస్సారమవుతున్నది. దీంతో దిగుబడి తగ్గుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి చేకూరే సేంద్రియ సేద్యంపై దృష్టి పెట్టి సిరులు పండించాలి. సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడులు సాధించడంతోపాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. రైతులు రాజులుగా మారడం కేవలం సేంద్రీయ వ్యవసాయంతోనే సాధ్యమవుతుందని అంటున్నారు నిపుణులు. సేంద్రియ ఎరువుతో పండించిన పంటలకు ఎటువంటి చీడపీడలు, రోగాలు దరిచేరవు. ఈ సేంద్రియ ఎరువును తయారు చెయ్యడం సులభమే.
సేంద్రియ ఎరువు ఎలా తయారు చేయాలి…?
బక్కెట్ చుట్టూ రంధ్రాలు చేయాలి. బక్కెట్‌లో ఒక అంగుళం మేర కొబ్బరి పొట్టు వేయాలి. ప్రతి రోజూ వంట గదిలో పోగుపడే కూరగాయలు, ఆకుకూరల వ్యర్ధాలు, ముక్కలు, పండ్ల తొక్కలు, పూలు, టీ పొడిని ఈ కంపోస్టు బక్కెట్‌లో వేయాలి. తడి చెత్తను ఇందులో వేసిన ప్రతిసారీ పైన అంగుళం మందాన కొబ్బరి పొట్టును వేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ వారంలో రెండు సార్లు బక్కెట్‌లో కింది నుంచి పైకి కలియ తిప్పాలి. పది రోజుల తరువాత వేసిన వ్యర్ధాలు కుళ్లడం ప్రారంభమవుతుంది. 45 రోజులకు నాణ్యమైన రసాయనాలు లేని సారవంతమైన సేంద్రియ ఎరువు తయారవుతోంది. అయితే అప్పుడప్పుడు బక్కెట్‌లో పురుగులు కనిపించే అవకాశం ఉంటుంది. బక్కెట్‌లోని వ్యర్థాల్లో 40 శాతం తేమ ఉండేలా చేసుకోవడంతోపాటు, మార్కెట్‌లో లభ్యమయ్యే ద్రావణం వేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. వంటింటి నుంచి వెలువడే తడి చెత్త, వ్యర్థాలను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయడానికి అవసరమైన కొబ్బరి పొట్టును నగరపాలక సంస్థ ఉచితంగా ఇస్తుంది. దీంతో చాలా మంది కంపోస్ట్ ఎరువులపై ఆసక్తి చూపిస్తున్నారు.
సేంద్రీయ వ్యవసాయంతో ప్రయోజనాలు..!
* ప్రజలు సేంద్రీయ ఉత్పత్తుల నుండి ప్రయోజనం పొందుతారు అలాగే పర్యావరణానికి హాని లేదు.
*. వ్యవసాయ చక్రం అనుసరించబడుతుంది, రైతులు కూడా దాని నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాధి, తెగులు నియంత్రణ.
*. పురుగుమందులు , ఇతర రకాల ఎరువుల దిగుమతులు తగ్గుతాయి.
*. ఇది కొత్త ఉపాధి అవకాశాలను అందించడంలో సహాయపడుతుంది.
* సేంద్రీయ ఎరువుల నుంచి నత్రజని మెల్లగా విడుదల అవడం వలన నత్రజని నష్టం తక్కువగా ఉంటుంది.
* నేలలోని సూక్ష్మజీవులకు మంచి ఆహారం గాను, అవి అభివృద్ధిచెంది చురుకుగ పని చేయడానికి ఉపయోగ పడుతుంది.
* పండ్లు, కూరగాయలు, ఇతర పంటలలో నాణ్యత పెరుగుతుంది.
* ఉప్పునేలలు, చౌడునేలలో లవణ, క్షార గుణాలు తగ్గించి పంటల దిగుబడులను పెంచడంలో దోహద పడుతుంది.
#OrganicFertiliser #organicfertilizerbenefits #agriculturelatestnews #eruvaaka