రైతే రాజు, వ్యవసాయం దండగ కాదు పండుగ, వ్యవసాయమే మన భవిష్యత్తు ఈ మాటలు వినడానికి ఎంత తియ్యగా ఉన్నప్పటికీ పండించే రైతుకు మాత్రమే తెలుసు ఆ కష్టాలు. నెలల పొడవునా కష్టించి రాత్రి అనకా పగలు అనకా సాగు చేసి పంట మార్కెట్ కి తీసుకెళితే అక్కడ దళారులు చెప్పిన రేటుకి అమ్ముకుని చేసేదేం లేక మళ్ళీ ఏడాది పాటు ఖాళీగా ఉండటం, ఈ మధ్యలో కరోనా లాంటి విపత్తులు వస్తె ఇక రాజు అని చెప్పుకునే ఆ రైతు పరిస్థితేంటి. ఏడాది పాటు ఎలా బ్రతకాలి? రైతు కూలీగా మారాలా? .
అభివృద్ధి చెందిన దేశాల్లో రైతు డిమాండ్ ఆధారంగా పంటలు పండిస్తాడు. రైతు పండించే పంటను మార్కెట్ ముందే సిద్ధంగా వుంటుంది. మన పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఈ ఏడాది ఏ పంట పండిస్తే లాభదాయకమో రైతుకు తెలియదు. పండించిన పంటకు ఎంత ధర వస్తుందో అసలే తెలియదు. మంచి ధర రానప్పుడు సరుకును గిడ్డంగుల్లో నిల్వ చేద్దామన్నా అవకాశం వుండదు. అందుకే రైతులు కేవలం వ్యవసాయం పైన మాత్రమే ఆధారపడకుడదు. పొలం పనులు ఏడాది పాటు ఉండకపోవచ్చు. దీంతో రైతులకు ఆదాయ భద్రత లేకుండాపోతోంది. పొలం పనులు లేని మిగిలిన రోజులు ఖాళీగా ఉండకుండా వ్యవసాయం తాలూకు వాణిజ్యంపై దృష్టి పెట్టాలి. తేనె, కొబ్బరినూనె తయారీ, చిరుధాన్యాలతో ఫ్లేక్స్, చిప్స్ వంటి ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించడం, పచ్చళ్లు, ప్యాకింగ్ వంటి వందలాది వ్యవసాయ అనుబంధ పనులపై రైతులు దృష్టి సారించాలి. వీటి ద్వారా నామమాత్ర పెట్టుబడితో రైతులు అదనపు ఆదాయం పొందుతారు. ఎగుమతులు చేసేందుకు వీలుగా నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తే రైతులకు తిరుగే వుండదు.
రైతులు కేవలం సాగుకు మాత్రమే పరిమితం కాకుండా కాస్త సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రైతులు గమనించాలి. నాణ్యమైన ఉత్పత్తుల్ని ఇప్పుడు దేశంలో ఎక్కడైనా మంచి ధరకు విక్రయించుకునే వీలుంది. ఇలాంటి ఆధునిక సమాచారాన్ని రైతులు తెలుసుకోవాలి. అప్పుడే అన్ని రంగాల మాదిరిగా వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి సాధిస్తుంది. దీనికి ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇస్తున్నాయి. అందుకు రైతు సదస్సులు ఏర్పాటు చేసి రైతుల్లో అవగహన కల్పిస్తున్నాయి.
#agriculturaltrade #farmers #agriculture #eruvaaka