దేశ జనాభా పెరుగుతుంది కానీ పంట పండించే రైతులు తగ్గిపోతున్నారు. పండించిన పంటకు దిగుబడి సరిగా లేకా, ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు వ్యవసాయం అంటేనే భయపడుతున్న పరిస్థితి. కానీ రైతు అన్నదాత కదా దేశానికి అన్నం పెట్టాలన్న ఆలోచనను నుంచి బయటకు పోలేక , వ్యవసాయమే జీవితంగా బ్రతుకుతున్నాడు. ఇకపోతే కొన్ని కారణాల వల్ల అధిక సాగుబడినిచ్చే భూములు కూడా చౌడు భూములుగా మారుతున్నాయి. దీంతో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పండించడానికి భూమి ఉన్నా చౌడు భూముల కారణంగా పంట సరిగా పండకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. అయితే ఈ చౌడు భూముల్ని బంగారు భూమిగా మార్చేయొచ్చు అంటున్నారు వ్యవసాయ నిపుణులు. కొన్ని పద్దతులు పాటిస్తే చౌడు భూమిని సైతం బంగారు భూమిగా మార్చుకోవచ్చు. అధిక దిగుబడి సాధించుకోవచ్చు.
చౌడు భూములని గుర్తించి బాగు చేసుకోవడానికి వేసవి కాలం చాలా అనుకూలమైనది. పంట వేసే రైతులు ముందస్తుగా తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మంచి పొలాలు సైతం చౌడు భూములుగా మారుతున్నాయి. వేసవిలో భూగర్భజలాలు విరివిగా వాడడం వల్ల నీటిలోని క్లోరైడ్స్ భూమికి అధికంగా చేరతాయి. తద్వారా పొలాలు చౌడు భూములుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో కొన్ని నెలల ఉపరితలం పైన తెల్లటి చౌడు నీటిలో కరిగే లవణాలను పేరుకొని ఉంటుంది. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు. ఉప్పును తట్టుకొను మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మొలకెత్తిన పైరు కూడ ఏపుగా పెరగదు. పొలంలో మొక్కల సాంద్రత కూడ చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిపై పేరుకొన్న ఉప్పు అంటే చౌడును పారతో చెక్కి తీసివేయాలి. పొలాన్ని మొదట సౌలభ్యాన్ని బట్టి చిన్న మడులుగా చేసుకోవాలి. ప్రతి మడిలో షుమారు 20 సెంటీ మీటర్ల లోతు నీరు నిల్వ ఉండేటట్లు సాగునీటిని పెట్టాలి. ఈ నీటిలో లవణ శాతం తక్కువగా ఉండాలి. నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటే అటువంటి నీటిని ఉపయోగించరాదు. ఈ నీటిని మడిలో 4 లేక 5 రోజులు నిల్వ ఉంచి భూమిలో ఇంకనీయాలి. తర్వాత మురుగు నీటిని కాలువల ద్వారా తీసివేయాలి. వర్షపు నీటిని యీ పనికి ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ విధంగా 3-4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నాణ్యమైన నీరు అందుబాటులో లేనప్పుడు, ఉప్పునీటిని తట్టుకొనగలిగే వరి, చెఱకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఆవాలు లాంటి పైర్లను పెంచుకోవాలి.
#ChouduNelalu #DryLands #ChouduBhoomi #AgricultureNews #Eruvaaka