పశుపోషణ మరియు పాడి పరిశ్రమ రంగాల్లో అధిక లాభం గడించవచ్చు. ఇవి ఒకదానితో ఒకటి కలిసి మన దేశ వ్యవసాయ విధానంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. పశుపోషణ రంగం అనేది భూమిలేని కూలీలకు, చిన్న రైతులకు మరియు గ్రామీణ యువతకు మంచి ఉపాధి కల్పించే రంగంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో వ్యవసాయం మరియు పశుపోషణ రంగాలను విడివిడిగా చూస్తున్నారు, నిజానికి వ్యవసాయం మరియు పశుపోషణ ఈ రెండు రంగాలు ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటాయి. ఒకదాని వ్యయం ఇంకొక దాని నుండి పొందేలా ఉంటుంది. ఉదాహరణకు, వ్యవసాయ ఉత్పత్తులైన గడ్డి పశువుల మేతగా వినియోగిస్తే, పశువుల నుండి పాలు మొదలగువాటి నుండి వచ్చే ఆదాయం వ్యవసాయానికి పెట్టుబడిగా మారుతుంది. పాలు, పాల ఉత్పత్తుల అవసరం అనుదినం ప్రతి కుటుంబానికీ ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో పాటు పట్టణీకరణ, సగటు కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల పాలు, పాల ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది.
కొన్ని వేల మంది ప్రజలు పాడి పరిశ్రమ ఆధారిత సంస్థలైన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు వంటి సంస్థలలో ఉపాధి పొందుతున్నారు. పాడి పరిశ్రమ రంగాన్ని విస్తరించడానికి తద్వారా ఉపాధి కల్పన దిశగా ముందడుగు వేయడానికి చాలా అవకాశాలు మన దేశంలో ఉన్నాయి. పశువుల నుండి ఉత్పత్తి అయ్యే గోబర్ గ్యాస్ మరియు సేంద్రీయ ఎరువు కూడా పలు విధాలుగా వినియోగించవచ్చు. వీటితోపాటు పశువుల ఆధారిత వెంట్రుకల పరిశ్రమ, మాంసం పరిశ్రమ, చర్మం మరియు ఎముకల వినియోగం కూడా ప్రముఖంగా పేర్కొనవచ్చు. పాలను శుద్ధిచేసి వినియోగదారులకు అందించేందుకుగాను చిన్న మొత్తంలో పెట్టుబడులతో లాభసాటి వ్యాపారాలను యువత చేపడుతున్నారు.
అయితే ముందు ఈ తరహా వ్యాపారంలోకి అడుగుపెట్టాలంటే ముందు సరైన అవగాహనా తప్పనిసరి. దీనికి తగిన సాంకేతిక సమాచారం మరియు శిక్షణ కొరకు ప్రాంతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, జాతీయ పాడి పరిశోధన సంస్ల, కేంద్రీయ గేదెల పరిశోధన సంస్థ, హిస్సార్, జాతీయ ఒంటెల పరిశోధన కేంద్రం, జాతీయ మాంసం పరిశోధన కేంద్రం, హైదరాబాద్ మరియు జాతీయ పశు ప్రాజెక్ట్ డైరెక్టరేట్ కేంద్రాలను సంప్రదించవచ్చు. అయితే పాడి పశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ, శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం తథ్యం.
#AnimalHusbandry #DairyIndustry #AgricultureNews #Benefits #Eruvaaka