పల్లెలు నగరాలుగా మారుతున్నాయి, అంతా కాంక్రీటుమాయం అయిపోయింది. కాలికి మట్టి అంటకుండా బ్రతికేస్తున్నాం. పెద్దలు సంగతి పక్కనపెడితే పిల్లల్ని కూడా అలానే పెంచుతున్నాం. రోజు తీసుకునే ఆహారం ఎక్కడినుండి వస్తుంది? రైతు అనే వాడు ఎలా ఉంటాడు? అనే విషయాలు వారికి తెలియకుండా పెంచుతున్నారు. నేటి తరం పిల్లలదంతా యాంత్రీకరణ జీవితం. ఉదయం లేవడం స్కూళ్లకు వెళ్లడం తిరిగి సాయంకాలం ఇళ్లకు చేరడం. ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోవడం షరామామూలైపోయింది. నాలుగు గోడల నుంచి బయటికి కాలు పెట్టె పరిస్థితి లేదు. ఇక మట్టి వాసన , దాని ప్రాముఖ్యత వారికేం తెలుస్తుంది, ఎవరు చెప్తారు. ఆ మట్టి విలువ రైతుకే తెలుస్తుంది. ఆ బంగారు నేలల నుంచి వచ్చే ఉత్పత్తులనే నేటితరం హాయిగా తింటూ బంగ్లాల్లో హాయిగా బ్రతుకుతున్నారు.
ఒకసారి మన తాతల కాలం గుర్తు చేసుకుంటే మనందరి రక్తంలో వ్యవసాయం ఉంటుంది. అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చినవారే. కానీ ప్రస్తుతం అందరం యాంత్రిక జీవనంలో బ్రతికేస్తున్నాం. కానీ రెండు సంవత్సరాల క్రితం కరోనా విలయతాండవం కొందరిలో మార్పు తీసుకొచ్చింది. ఆ సమయంలో ఆహారం తప్ప ఇంకేదీ అవసరం పడలేదు. గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయం గొప్ప తనం అందరికి అర్ధం అయింది. ఈ నేపథ్యంలో కొందరు ఫార్మింగ్ వైపు చూస్తున్నారు. ఐదంకెల జీతం వదిలి మట్టిలోకి దిగేవారు కొందరైతే ఉద్యోగం చేస్తూనే వీకెండ్స్ వ్యవసాయం చేస్తున్న వారు మరికొందరు. రసాయన పంటను వీడి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు.
ఒకవైపు ఉన్నతోద్యోగాలు చేస్తూనే తీరిక సమయంలో మరోవైపు వ్యవసాయంపై మక్కువ చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సేంద్రియ, ప్రకృతి పద్ధతుల్లో సాగు చేసిన పంటలకు మంచి దిగుబడి లభిస్తుండటం, ఆదాయం కూడా అంతేస్థాయిలో ఉంటుండటంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఒత్తిడితో కూడిన ఉరుకుల పరుగుల సిటీ జీవనం నుంచి ఉపశమనం కోసం కూడా కొంతమంది వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. సొంత భూములు ఉన్నవారు ఉద్యోగం చేసుకుంటూనే వీకెండ్స్ లో సేద్యం చేస్తూ పచ్చటి ప్రకృతితో మమేకమవుతున్నారు. ఈ మార్పు మానవాళికి అవసరం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని అందరిలోనూ కలగాలి.
#TheAgriculturalRevolution #Farmer #weekendfarming #agriculture #eruvaaka