మనిషి కష్టాన్ని నమ్ముకుని ఇంతవరకు వచ్చాడు. కానీ ప్రస్తుత కాలంలో కష్టం మరిచి స్మార్ట్ గా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాడు. రోజురోజుకి టెక్నాలజీ పెరుగుతూ జీవన విధానంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. ఒకప్పుడు రైతు ఒళ్ళు గుల్ల చేసుకుని పంట పండించేవాడు. కానీ ప్రస్తుతం టెక్నాలిజీని వినియోగిస్తూ రైతు సైతం స్మార్ట్ వ్యవసాయం చేస్తున్నాడు. దేశీయంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం వివిధ స్థాయిల్లో గణనీయంగా పెరుగుతోంది. దీనితో ఇటు దిగుబడులు, అటు రైతాంగానికి రాబడులు మెరుగుపడుతున్నాయి.
డిజిటల్ రంగంలో భాగంగా రైతులు టెక్నాలిజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ గా ఆలోచిస్తే గొప్ప ఫలితాలు పొందవచ్చు. పొలంలో సెన్సార్లు ప్రవేశపెట్టడం ద్వారా పొలంలోని తేమ శాతం, ఉష్ణోగ్రతల వివరాలు, తెలుసుకోవచ్చు. అంతే కాకుండా సెన్సార్లు మొక్కలపై వెలుతురుని విశ్లేషిస్తాయి. ఇక మొక్కల ఎదుగుదల, క్రిమి కీటకాలు ప్రవేశిస్తే సదరు సెన్సార్లు పసిగడతాయి. ఇక నేల పనితనాన్ని మనకు ముందే సమాచారమిస్తుంది. ఇక వ్యవసాయంలో ఇప్పటికే డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. డ్రోన్లు వాడటం ద్వారా ఎంతో సమయం అదా చేయవచ్చు. డ్రోన్ల ద్వారా మొక్కల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనించవచ్చు. వాటికి సెన్సర్లను అమరిస్తే, వాతావరణంలోని తేమనూ పసిగట్టొచ్చు. చాలా సందర్భాల్లో పొలంలోని ప్రతి మొక్కనూ దగ్గరగా గమనించడం, చీడపీడల ప్రమాదాన్ని పసిగట్టడం ఎంతో కష్టం. అయితే, డ్రోన్లతో అది తేలికవడమే కాదు.. చిన్నపాటి సమస్యను కూడా ఆరంభంలోనే గుర్తించవచ్చు. డ్రోన్లతో ఎరువులు, క్రిమి సంహారాలనూ చల్లే అవకాశం ఉండటం మరో లాభం. ముఖ్యంగా రసాయన ఎరువుల పిచికారీ సమయంలో రైతులు వాటి దుష్ఫ్రభావాలకు గురవుతారు. కానీ, డ్రోన్లతో ఆ సమస్య ఉండదు. అంతేకాకుండా వ్యవసాయంలోకి రోబో రైతులు ప్రవేశిస్తున్నారు. ఇదే జరిగితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయ్. టెక్నాలజీ పెరగడం వల్ల రైతులకు ఖర్చులు, శ్రమ, సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
మొత్తంగా గిట్టుబాటు కావడం లేదంటూ వ్యవసాయాన్ని వదిలేసిన రైతులను చూశాం. కానీ, టెక్నాలజీని వదిలెయ్యలేం కదా. గతంలో వ్యవసాయం అంటే వెనకడుగు వేసిన వారు కూడా ఇప్పుడు ఈ రంగంలోకి ఆసక్తిగా వస్తున్నారు.
#SmartFarming #Agriculture #technology #agriculturelatestnews #eruvaaka