ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణాలోనూ, చెరకు పంటను సుమారు 1.70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయడం వల్ల 142 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుంది. చెరకు మనకు ముఖ్యమైన వాణిజ్య పంటగా సాగుచేస్తూ ఈ పంట నుండి పంచదార, బెల్లం, ఖండసారి, ఫిల్టర్ మడ్డి, మొలాసిస్, ఇథనాల్ లాంటి ఉత్పత్తులు పొందుతున్నాము. చెరకులో అధిక దిగుబడికి, ఎక్కువ పంచదార పొందడానికి అనువైన వాతావరణ పరిస్థితులతో పాటు, చెరకులో అనువైన సాగు రకాలు, సాగు పద్ధతులు, నీటి నాణ్యత, సస్యరక్షణ లాంటి అంశాలు చెరకు పంటను ప్రభావితం చేస్తాయి.
చెరకు పంట సాధారణంగా 10 – 12 నెలల పంట. అంటే దాదాపు సంవత్సరకాల పంట. కాబట్టి చెరకు పంటకు నీరు దాదాపు 2500 మి.మీ – 3000 మి.మీ వరకు ఒక పంటకాలానికి అవసరమవుతుంది. చెరకు పంట పెరిగే దశలను బట్టి, బాల్యదశ (0 – 45 రోజులు), పిలకదశ (45 – 120 రోజులు) పెరుగుదల దశ (120 – 270 రోజులు) పక్వదశ (270 – 300 రోజులు) వరకు ఇలా దశల వారీగా చెరకు పంట పెరుగుతుంది. పంట దశలను బట్టి కూడా నీరు అవసరమవుతుంది.
చెరకు పంటకు నేలను బట్టి కూడా నీరు అవసరం అవుతుంది. బంకనేలకు నీటిని పట్టి ఉంచుకొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ నీరు అవసరం అవుతుంది. అదే ఇసుక నేలలు తక్కువ నీటిని పట్టి ఉంచుకునే సామర్ధ్యం ఉంటుంది. కాబట్టి నీరు ఎక్కువ అవసరమవుతుంది. చెరకులో నీటి ఎద్దడికి తట్టుకునే గుణం కూడా కొంత వరకు ఉంటుంది. చెరకు పంటలో నీటికి సున్నితమైన దశలు పిలక దశ, పెరుగుదల దశ, మొలకదశ (0 – 45 రోజులు)లో తక్కువ నీటిని తరచుగా ఇవ్వడం వల్ల మొలకశాతం బాగా వస్తుంది. ఇంకా పక్వదశలో నేలను బట్టి 2 – 3 వారాలకొకసారి ఇవ్వాలి. చెరకు పంటకు నీరు అందించడానికి సరైన సమయంలో కరెంటు లేకపోవడం, కూలీలు అందుబాటులో ఉండకపోవడం, నేలలో నీటి సామర్ద్యం తగ్గిపోవడం బోర్లు, బావులు ఇంకిపోవడం వల్ల చెరకు పంటకు నీటి యాజమాన్యంలో మార్పులో బిందుసేద్యం ఒక భాగం.
బిందు సేద్యం అంటే ????
ఈ పద్ధతిలో నీటిని సన్నని లేట్రల్(Lateral)పైపుల ద్వారా కావలసిన పరిమాణంలో మొక్కకు అతి దగ్గరలో అందజేస్తారు. డ్రిప్ పద్ధతిలో నీరు ప్రతిరోజు అందించడం వల్ల మొక్క వేర్ల భాగంలో తేమ కావలసినంత ఉండి మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన, అధిక దిగుబడినిస్తుంది.
బిందు సేద్యం వల్ల లాభాలు :
- సంప్రదాయ పద్ధతులైన కాలువల ద్వారా నీరు కట్టి పారించినప్పుడు నీటి వినియోగ సామర్ధ్యం 30 – 45 శాతం ఉంటే బిందు నీటి సాగు పద్ధతి వల్ల నీటి వినియోగ సామర్ధ్యం 90 – 95 శాతం వరకు ఉంటుంది.
- ఈ పద్ధతి ద్వారా మొక్కకు నీరు అందించినప్పుడు నీరు వేరు వ్యవస్థలోనికి హెచ్చుతగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులైన యూరియా, 19: 19 : 19 పొటాష్‌లను మొ. అందించడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి త్వరితంగా పక్వానికి వచ్చిన పంట మంచి దిగుబడులతో పాటు నాణ్యమైన పంటను ఇస్తుంది.
- అవసరాన్ని బట్టి పంటకు ఒకే మోతాదులో నీటిని అందజేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటర్ నడవబడి కరెంటు వినియోగంలో దాదాపు 30`45 శాతం ఆదా అవుతుంది.
- బిందు సాగు అతి తేలికైన లోతు తక్కువైన, ఎత్తు పల్లాలు ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది.
- బిందు సేద్య పద్ధతిలో నేలను చదునుచేయడం, గట్లుకట్టడం, కాల్వలు తవ్వడం, బోదెలు తవ్వడం, నీరు పారగట్టడం, ఎరువులు, కలుపు మందులు వేయడం లాంటి పనులు ఉండవు. కాబట్టి వీటికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. బిందుసేద్యం పద్ధతిలో పంట వరుసల మధ్య తక్కువ తేమ ఉండడం వల్ల కలుపు కూడా తక్కువగా ఉంటుంది.
- నీటిలో కరిగే ఎరువులను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేళ్ళ దగ్గరకు అందించడం వల్ల వేసిన వినియోగ సామర్థ్యం 80 – 90 శాతం, ఎరువుల ఆదా 25 – 30 శాతం వరకు ఉంటుంది.
- ఈ పద్ధతి వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతినదు.
- ఈ పద్ధతి వల్ల నేల కాలుష్యం కూడా ఉండదు. ఇక చెరకు పంటకొస్తే వ్యవసాయ పరిశోధనాస్థానం, పెరుమాళ్ళపల్లిలో చెరకు పంటపై బిందుసేద్యం యొక్క ఆవశ్యకతలపై పలు ప్రయోగాలు జరిపారు.
- చెరకు పంటను జంట సాళ్ళలో సాలు అంటే 60 సెం.మీ సాలు సాలుకీ మధ్య దూరం, జంట జంటకీ 120 సెం.మీ దూరంలో సాలు వేసి నాటుకోవాలి. ఈ 60 సెం.మీ సాలులో డ్రిప్ లేట్రల్ వేసి ఈ డ్రిప్‌లేట్రల్ డ్రిప్పర్ల ద్వారా చెరకు పంటకు నీరు అందించినప్పుడు 30 శాతం నీటి ఆదాతోపాటు 25 శాతం చెరకు దిగుబడి అదనంగా నమోదు చేయబడుతుంది. ఇలా జంట సాళ్ళ పద్ధతిలో చెరకును నాటుకోవడం వల్ల పంటకు గాలి, వెలుతురు బాగా ప్రసరించడం జరుగుతుంది. తోటలోనికి దూరి అంతరకృషి పనులు చేయడానికి వీలుగా ఉంటుంది. బిందు సేద్యం ద్వారా చెరకు పంటకు నీరు అందించడం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు నీరు బాగా అందుతుంది. తద్వారా గడల సంఖ్య పెరిగి దిగుబడి పెరుగుతుంది.
- చెరకు పంటకు నీటిలో కరిగే ఎరువులను నీటిలో కరిగించి నీటితో పాటు చెరకునాటిన 30 రోజుల నుండి 150 రోజుల వరకు 10 రోజుల వ్యవధిలో కొద్ది కొద్ది మోతాదుల్లో పంపించినప్పుడే పంట అందించిన ఎరువులను సక్రమంగా వినియోగించుకొని పిలకల సంఖ్య, గడల సంఖ్య బరువు పెరిగి చెరకు దిగుబడి దాదాపు 15 శాతం వరకు పెరుగుతుంది.
డా॥ యన్. వి. సరళ, డా॥ యమ్. సుబ్బారావు,
టి.యమ్. హేమలత, వి. గిరిధర్,
వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్ళపల్లి
ఫోన్ : 9000711209, 08772276240.