తెలంగాణ సేద్యంమన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

ఆధునిక సేద్యంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నరంగారెడ్డి రైతులు పాలిహౌస్‌లలో  సాగుకు “సై” అంటున్న బడుగులు

0

తరతరాలుగా, చారిత్రక భాగ్యనగర పౌరుల అవసరాల నిమిత్తం కూరగాయలు, పూలు, పండ్లు, పాలు ఇతర నిత్యజీవిత ఉత్పత్తులను పండించి, సేవలందిస్తున్న నగర పరిసర ప్రాంత జిల్లా రైతులు ప్రస్తుతం హరిత గృహాల్లో నూతన సాంకేతిక విప్లవానికి వారసులుగా నిలుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిస్థితుల్లో మార్పురావడం, వాతావరణం, నీరు, భూమి కలుషితమై పంటలపై ప్రభావాన్ని చూపించి, ఉత్పత్తులు కుదుటబడటం అకాల వర్షాలు, అరుదైన వర్షపాతంతో పంటల ప్రణాళికలను సాంప్రదాయ పద్ధతిలో కొనసాగించలేకపోవడం, చెరువులు, తటాకాలు, చిన్న చిన్న నీటి వనరులు అడుగంటి పోవడంతో ప్రపంచ మార్కెట్‌తో పోటీపడేందుకు ఇక్కడి రైతులు కూడా సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా ప్రపంచమే ఒక సంగ్రామంగా మారిపోయిన నేపథ్యంలో కూరగాయలు, పూలు, పండ్లతో పాటు ప్రజల ప్రధాన అవసరమైన మాంసం కొరతను తీర్చడానికి అనేక నూతన సాంకేతిక పద్ధతుల్లో రైతులు ముందడుగు వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రత్యామ్నాయ సాగు విధానాల్లో భాగమైన హరిత గృహాల్లో వ్యవసాయ ఉత్పత్తులు తీయడానికి యజ్ఞంలాగా రైతాంగం కదలి ముందుకు వస్తున్నది. అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న, దళిత, గిరిజన రైతులు కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకుని తాము ఎవ్వరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. తరతరాలుగా వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న వీరు ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమో, ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాల ఫలితమో తామూ సస్యవిప్లవంలో మెరుగైన పాత్రను నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు.

రైతు చింతలు తీర్చే మూడు చింతలపల్లి :

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హరిత గృహాల స్థాపనకు రూ. 320 కోట్లు మంజూరు చేయడం, రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో వెయ్యి ఎకరాల్లో పాలీహౌస్‌ల స్థాపనకు రైతులను ప్రోత్సహించడం ద్వారా చుక్కలంటిన కూరగాయల ధరలను భూమికి దించడం, పండుగలు, ఉత్సవాలు, వ్యక్తిగత శుభకార్యాల సమయంలో వినియోగించే ఆధునిక విదేశీ అలంకరణ పుష్పాల సాగుకు సహకారం అందిస్తామని ప్రకటించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినేట్‌ సమావేశానంతరం ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడం ఇక్కడి రైతుల్లో ఆనందాన్ని పురికొల్పింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్‌ మండలం కూరగాయలు, పూలు పెంపకానికి ప్రసిద్ధి చెంది ఉండడం, రైతులు స్వయంగా కోళ్ళ ఫారాల నిర్వహణ, ఇతర వ్యవసాయానుబంధ రంగాల ఉత్పత్తిలో నూతన చైతన్యంతో పురోగమించడం, వారి అభివృద్ధి బాటకు పాలీహౌస్‌ల ద్వారా సాగు చేపట్టడం ఎంతో ఉపయోగపడే విషయమని ప్రతి రైతు గమనించి ఆ విధంగా ముందుకు వెళుతున్నారు.

మండలంలోని మూడుచింతలపల్లి గ్రామంలోనే దాదాపు  ప్రతి ఇంటా ఒక పాలీహౌస్‌ ఉందంటే నమ్మశక్యంగాని విషయం. అయినప్పటికీ, చిన్న కమతాల రైతులు, దళితులు ఎక్కువగా ఈ పద్ధతిలో సాగు నిర్వహించి లాభాల బాటన పయనిస్తున్నారు. అదేవిధంగా ఉద్దమర్రి, నాగిశెట్టిపల్లి, తిమ్మాపురం సమీపంలోని నల్గొండ జిల్లా బొమ్మల రామారం మండలం పోతారం గ్రామ రైతులు ఈ పూల సాగులో ముందున్నారు. మూడుచింతలపల్లి గ్రామానికి చెందిన మహిళారైతు రాజమ్మ విజయగాధను ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఎందరో మహిళలకు స్ఫూర్తి  దళిత రైతు ” రాజమ్మ ” :

వ్యవసాయ కూలీగా జీవితాన్ని ప్రారంభించి, చిన్న వయసులోనే లారీ ప్రమాదంలో భర్తను పోగొట్టుకున్న రాజమ్మ ఉన్న ఎకరన్నర పొలానికి నీటి సౌకర్యం లేక ముగ్గురు పిల్లలను పోషించడానికి, వారిని పెంచడానికి అనేక అష్టకష్టాలు పడిరది. ఇద్దరు పిల్లలను చేతనైనంత మేరకు చదివించి, సమీపంలోని బయోటెక్‌ కంపెనీలో ఉద్యోగాలు చేసుకునే విధంగా తీర్చి దిద్దింది. మరో కుమారుడు జాము రవి సర్ఫ్‌ వ్యాపారం ద్వారా స్వయం ఉపాధిని పొంది, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మరో 25 మందికి ఉపాధి కల్పిస్తున్న సమయంలో ఆయనకు వ్యవసాయంపై మక్కువ కలిగి, గ్రామంలోని ఇతర యువరైతులు సాగిస్తున్న వ్యవసాయ విధానాలను ఔపోసనపట్టాడు. ముఖ్యంగా పాలీహౌస్‌ల్లో విదేశీ అలంకరణ పుష్పాల సాగుకు లభిస్తున్న ప్రోత్సాహం, ఆకర్షణీయమైన మార్కెట్‌ స్థితిగతులను అర్ధం చేసుకున్నాడు. దానితో పాటు దళితులకు నూరు శాతం సబ్సిడీ ఉన్న బిందు సేద్యాన్ని తన పొలంలో నిర్వహించాలని తపన పడ్డాడు.

రవి ఉత్సాహానికి పాలీహౌస్‌ రైతుల సంఘం ప్రోత్సాహం లభించింది. తనకున్న ఉమ్మడి ఆస్థి ఎకరంన్నర పొలంలో వెంటనే పాలీహౌస్‌ నిర్మించి జర్బెరా పూల సాగును ప్రారంభించాడు. మిగిలిన పొలంలో సీజన్‌ను బట్టి బంతిపూల సాగు, టమాటా, సొర, బీర ఇతర పందిరి పంటలతో పాటు బెండ సాగుచేస్తున్నారు. రాజమ్మ మిగిలిన ఇద్దరు కుమారులు ఫ్యాక్టరీలో పని అనంతరం పొలంలో తాము కూడా దిగి సాగుకు ఉపక్రమిస్తారు. వృద్ధాప్యంలో కూడా రాజమ్మ వారికి అండగా నిలిచి పెద్ద దిక్కుగా రోజంతా పొలంలోనే ఉండి కార్యక్రమాలను తానే చక్కబెడుతుంది. ఎకరన్నర భూమిలో చాలినంత ఆదాయాన్ని పొందుతూ ఆ కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా ఎంతో ముందుకువెళుతున్నది. సహజంగా ఉండే న్యూనతాభావాన్ని వదలి సమాజ జీవితంలో భాగమైన రాజమ్మ కుటుంబం నేడు మూడుచింతలపల్లిలోనే కాక ఒక ఆదర్శ కుటుంబంగా వెలగడానికి ఈ వ్యవసాయ ఆధునీకరణతో పాటు పాలీహౌస్‌ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతోందని ఈ యజ్ఞానికి మూలకారకుడైన జాము రవి అగ్రిక్లినిక్‌ ప్రతినిధికి తెలియచేశారు.

దీనిలో లోటుపాట్లపై వివరిస్తూ రవి అధికార యంత్రాంగం ఇంకా వేగంగా నిర్ణయాలు తీసుకుని, పథకాలను అమలు చేయడం ద్వారా రైతులకు మరింత న్యాయం చేయగలరని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ముఖ్యంగా సబ్సిడీ మంజూరులో జరుగుతున్న జాప్యం రైతులను అప్పులపాలు చేస్తుందని, సకాలంలో రైతులకు ఫలితాలు లభిస్తే, వడ్డీ భారం నుండి విముక్తి కావచ్చునని తెలిపారు.

నల్గొండ జిల్లా, బొమ్మలరామారం మండలం  తిమ్మాపురం గ్రామానికి చెందిన లకావత్‌ మాన్‌సింగ్‌ నాలుగున్నర ఎకరాల రైతు పాలీహౌస్‌లో పూల సాగుకు ముందు ఆయన సాంప్రదాయ పద్ధతిలో వరి, టమాటా, బెండ, సొర వంగ పంటలను వేస్తూవస్తున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ ఫలసాయాన్ని పొందడానికి అనేక పంటల సాగు ద్వారా ఆయన ఒక పథకం ప్రకారం పైన తెలిపిన వివిధ రకాల పంటలను పండిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పాలీహౌస్‌ల నిర్మాణం వేగం పుంజుకోవడంతో తాను కూడా ఆ రకమైన సాగుకు నడుంకట్టారు. సాంప్రదాయకంగా గిరిజన ప్రాంతాల్లో సాంకేతికత అంతగాలేని సమయంలో ఆయన ప్రస్తుతం 1120 చ.గజాలలో పాలీహౌస్‌ను నిర్మించి, జర్బెరా పుష్పాలను పండిరచి, సుదూరంలో ఉన్న గుడిమల్‌కాపూర్‌ పూల మార్కెట్‌కు వాటిని పంపిస్తున్నారు. సగటున ప్రతిరోజూ వెయ్యి పూలు ఉత్పత్తికాగా మార్కెట్‌ పరిస్థితిని బట్టి ప్రతి పువ్వుకు రూ. 1 నుండి రూ. 20 వరకు సందర్భాన్ని బట్టి ధర పలుకుతుందని వివరించారు. అంటే సగటున వెయ్యి పూలకు రోజుకు రూ. 3 చొప్పున రూ. 3 వేలు ఆదాయం లభిస్తుందని వివరించారు. దానితోపాటు ప్రతిరోజూ కూరగాయలను రైతు బజారుకు, మార్కెట్‌కు పంపడం వల్ల అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. తమ ఇంటి అవసరానికి పండిరచే బియ్యం సరిపోతాయని, వచ్చే ఆదాయంతో గౌరవ ప్రదమైన జీవనాన్ని సాగించడానికి, అవకాశం లభించిందని తెలిపారు. పాలీహౌస్‌తో పాటు బంతి పూల సాగువల్ల కూడా అధిక ఆదాయం లభిస్తుందని వెల్లడిరచారు. ఈ సం॥ రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగ, మహంకాళీ జాతర, వినాయక నిమజ్జనం, బతుకమ్మ పండుగలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించడంతో బంతి రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించిందని మాన్‌సింగ్‌ తెలిపారు. బిందు సేద్యంపై దళితులకు, గిరిజనులకు పూర్తి సబ్సిడీ లభించడంతో మిగిలిన రైతులతో పాటు తాము కూడా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిలో కీలకపాత్ర వహిస్తున్నామని తెలిపారు.

షామీర్‌పేట్‌ మండలం, పోతారం గ్రామానికి చెందిన మరో గిరిజన రైతు రాములు విజయగాథ మరింత ఆసక్తికరమైనది. కొన్నేళ్ళ క్రితం హరిత గృహాల సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తొలిదశలోనే రాములు 1120 చ.గజాలలో తన స్వగ్రామంలో పాలీహౌస్‌ను ప్రారంభించి సంచలనం సృష్టించారు. పాలీహౌస్‌లలో జర్బెరా, కార్నేషన్‌ పూల సాగుతో పాటు సాంప్రదాయ బద్ధంగా కూరగాయలు, బంతి ఇతర ఆహార పంటలను పండిస్తున్నారు. సమర్థవంతమైన సస్యయాజమాన్యం, నీటి యాజమాన్యం, మార్కెటింగ్‌ అవగాహనతో, పాలీహౌస్‌, బిందు సేద్య వ్యవస్థ ద్వారా ఆయన ఇప్పటికీ విజయవంతంగా వ్యవసాయం చేసి లాభాలబాటలో పయనిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పాలీహౌస్‌లు స్థాపించిన తొలి 8 మందిలో రాములు ఒకరుకాగా మిగిలిన వారిలో 6గురు వివిధ కారణాల వల్ల ఈ ఒరవడిలో సాగు కొనసాగించలేకపోయారు.

పాలీహౌస్‌ రైతుల సంఘం విశిష్ట కృషి :

రంగారెడ్డి జిల్లా, షామీర్‌పేట్‌ మండలం, నాగిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రామిడి నరసింహారెడ్డి తొలిసారిగా ఈ ప్రాంతంలో పాలీహౌస్‌ స్థాపించారు. 1620 గజాలలో మూడు పాలీహౌస్‌లను స్థాపించి జర్బెరా, కార్నేషన్‌ పూలతో పాటు, అలంకరణ పుష్పాల బొకేలకు వినియోగించే ఆస్పరాగస్‌ గడ్డిని కూడా డ్రిప్‌ సహాయంతో సాగు చేస్తున్నారు. మూడెకరాల ఆయన తోటలో ఆటవీ, పుష్ప, ఫలాల వృక్షాలు వినూత్నమైనవి వందల సంఖ్యలో పెంచడం విశేషం. హెడ్‌ మాస్టర్‌గా రిటైరై విశ్రాంత జీవితానికి వెళ్ళవలసిన ఆయన వ్యవసాయంపై మక్కువతో ఆధునిక సేద్యబాటను పట్టారు. తాను స్వయంగా సేద్యం చేయడంతో పాటు పాలీహౌస్‌ల పరిజ్ఞానాన్ని తోటి రైతులకు అందించేందుకు నరసింహారెడ్డి పాలీహౌస్‌ రైతుల సంఘాన్ని స్థాపించారు.

కొద్దిమంది రైతులతో ప్రారంభమైన పాలీహౌస్‌ రైతుల సంఘం నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రైతు సంఘంగా అవతరించింది. సుమారు 400 మంది అభ్యుదయ రైతుల సమ్మేళనంగా ఈ సంస్థ అనేక విజయాలను సాధించి, పాలీహౌస్‌ల విస్తరణకు విశేషంగా కృషి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పాలీహౌస్‌ల విస్తరణ ఒకయజ్ఞంలాగా సాగుతుంది. ఈ జిల్లాలతోపాటు నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, చిత్తూరు, కడప, గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అనేక చోట్ల పాలీహౌస్‌లలో కూరగాయలు, పండ్లు పండిరచేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. పాలీహౌస్‌లకు ప్రత్యేక పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలీహౌస్‌, డ్రిప్‌, మల్చింగ్‌ ఇతర సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కొరకు ఒక ప్రత్యేక వ్యవసాయ మిషన్‌ను స్థాపించింది. భారత మాజీ రాష్ట్రపతి డా॥ అబ్దుల్‌కలాం చేతులమీదుగా ఈ మిషన్‌ ఉద్యాన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం జిల్లాలో ప్రారంభించడం విశేషం.

పాలిహౌస్‌ల అభివృద్ధి  సానుకూల అంశాలు :

  1. పాలిహౌస్‌లలో జర్బెరా, కార్నేషన్‌, గ్లాడియోలస్‌, గులాబి, ఎల్కోనియా వాటికి అనుబంధంగా ఆస్పరాగస్‌ గడ్డి, పూల సాగుతో నికర ఆదాయాన్ని పొందడం.
  2. మిగిలిన పొలంలో మిశ్రమ రకాల పంటలు, మొక్కలు, వృక్షాలు పెంచడం ద్వారా స్వల్ప, దీర్ఘకాలిక ఆదాయాన్ని సమకూర్చుకోవడం.
  3. బిందు సేద్యంతో, ఫర్టిగేషన్‌ ట్యాంకుల సహాయంతో నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యాన్ని మెరుగుపరచడం.
  4. ప్రకృతి సహజ సిద్ధమైన ఎరువులను, సేంద్రియ ఎరువులను వినియోగించుకోవడం. అందుకొరకు పూలు, ఆకులు, కూరగాయల వ్యర్ధాలను తగుల బెట్టకుండా తగిన సమయం ఇచ్చి వాటిని ఎరువుగా మార్చుకునే ప్రక్రియ, వర్మికంపోస్టు ద్వారా స్వంత ఎరువును తయారుచేసుకోవడం వంటి ప్రక్రియలను ఇప్పటికే చైతన్య వంతమైన రైతులు చేపట్టారు.

పాలిహౌస్‌ రైతుల సమస్యలు –  పరిష్కార మార్గాలు :

  1. పాలిహౌస్‌లో పూలు సాగు చేస్తున్న రైతులకు మార్కెట్‌ భద్రత లేదు. సీజన్‌లో పది రూపాయలు అమ్మిన పూవు మామూలు సమయంలో ఒక్క రూపాయి మాత్రమే రేటు పలుకుతుంది. ఈ హెచ్చుతగ్గుల వలన రైతులకు రక్షణ లభించడం లేదు.
  2. మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌ సమీప ప్రాంతాలలో ఈ రకమైన సాంకేతిక నిపుణత ద్వారా పూలు, క్యాప్సికమ్‌ పండిస్తున్న రైతులకు ఇతర రాష్ట్రాల ఉత్పత్తిదారుల నుండి తీవ్రపోటీ ఎదురవుతున్నది. పూల సాగులో ముందున్న కర్ణాటక రాజధాని బెంగుళూరు సరిహద్దుల్లో ఉన్న బిజాపూర్‌, బీదర్‌, గుల్‌బర్గా జిల్లాల నుండి పూలు దిగుమతి కావడంతో ఇక్కడి రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
  3. ఇరు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్దదైన గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌లో పాలీహౌస్‌లలో పండిరచే పూలు, కూరగాయల రైతులకు ప్రత్యేకంగా ఒక మార్కెట్‌ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే దానిలో ఇంత వరకు నిర్మాణాలు గాని, మౌలిక వసతులు కాని ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం, నాబార్డు, బ్యాంకుల సహాయంతో ఒక వేలం కేంద్రం, మార్కెట్‌, సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసేందుకు పాలీహౌస్‌లలో వ్యవసాయ ఉత్పత్తులు నిర్వహించే రైతుల సంఘం నిర్ణయించింది. దీని కొరకై పరస్పర సహాయ సహకార పరపతి సంఘాన్ని స్థాపించి, ఉత్పత్తుల ధరలపై సాధికారతను రైతులకే అందించేందుకు సంఘం నిర్ణయించింది. అయితే తక్షణం ధరల నిలకడ వచ్చేదాకా సరుకును నిల్వ చేసుకునేందుకు ఈ మార్కెట్‌ పరిధిలో శీతల గిడ్డంగులను నిర్మించాలని సంఘం కోరుతున్నది.
  4. పాలిహౌస్‌ నిర్మాణానికి సబ్సిడీని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 80 శాతం వరకు పెంచింది. ప్రస్తుతమున్న వెయ్యి గజాల పరిమితిని మూడెకరాల వరకు పెంచేందుకు ఇటీవలనే క్యాబినేట్‌ నిర్ణయం తీసుకుంది. ఐతే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో సాధ్యమైనంత ఎక్కువ భూమిలో సాగు చేసుకునేందుకు ఉన్న అవకాశాలను ఇక్కడి ప్రభుత్వాలు కూడా అనుమతిస్తే ఉత్పత్తి పెరగడమేగాక ఇతర రాష్ట్రాల పోటీని తట్టుకోగలుగుతారు.
  5. ప్రస్తుతం ఈ పద్ధతిలో సాగుచేస్తున్న రైతుల విజయగాధలను తెలుసుకుని మరింత మంది రైతులు దీనిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఆసక్తిని గమనించి ప్రభుత్వం శిక్షణా తరగతులు నిర్వహించడం, ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళి మరింత పరిజ్ఞానాన్ని అందజేసేందుకు పథకాలను రూపొందించాలి.
  6. వడగళ్ళు, ఈదురు గాలులు, తుఫానులు వచ్చినప్పుడు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి.
  7. మార్కెట్‌ అస్తవ్యస్థ పరిస్థితులను అధిగమించేందుకు, పూలను ఎక్కువ రోజులు భద్రపరచేందుకు కోల్డుస్టోరేజీలను నిర్మించాలి.
  8. పూల సాగుకు అవరోధంగా పరిణమించిన ప్లాస్టిక్‌ పూల వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణాన్ని కాపాడడంతో పాటు రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
  9. పూల రంగులను అద్దకాల పరిశ్రమలోనూ, వంటలలోనూ, ఐస్‌క్రీమ్‌లు ఇతర తినుబండారాలను తయారు చేయడంలో వినియోగిస్తున్నందున పూల ఆధారిత ప్రక్రియ పరిశ్రమల స్థాపన ఆవశ్యకత ఉంది.
  10. భారతీయ పూలకు ఇతర దేశాలలో ఆదరణ ఉన్నందున హైదరాబాద్‌ కేంద్రంగా బెంగుళూరు తరహాలో ప్రత్యేక పాలిహౌస్‌ ఉత్పత్తుల ఆర్థిక జోన్‌ను ఏర్పాటు చేసి, నిష్ణాతులైన తెలుగు రైతులకు విస్తృత అవకాశాలు కల్పించి మరింత ముందుకు వెళ్ళే విధంగా పథకాలను రూపొందించాలి.
  11. ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఉద్యానవన రాజధానిగా భాసిల్లుతున్న బెంగుళూరు, కర్నాటక రాష్ట్రం నుండి తెలుగు మార్కెట్లలోకి ముఖ్యంగా హైదరాబాద్‌ పూల మార్కెట్‌లోకి ఉత్పత్తుల దిగుమతిపై ఆర్థిక ఆంక్షలు, పన్నుల పెంపు ద్వారా ఆంక్షలు విధించి హైదరాబాద్‌ సమీపంలోని, ఇతర జిల్లాల్లోని పాలిహౌస్‌ రైతుల ఇక్కట్లను దూరం చేయవచ్చు.
  12. పెరుగుతున్న నగరీకరణ, ప్రజల జీవన శైలి మార్పు సందర్భంలో ప్రతి ఇంటా అలంకరణ పుష్పాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఏ చిన్న వేడుకైనా నగరాలు, పట్టణాల్లోని ప్రజలు పూల అలంకరణపై మక్కువ పెంచుకున్న నేపథ్యంలో అలంకరణ పుష్పాలైన జర్బెరా, గ్లాడియోలస్‌, గులాబి, కార్నేషన్‌, ఎల్కోనియా పుష్పాలకు, బొకేలలో అల్లిక కొరకు ఆస్పరాగస్‌ గడ్డికి బాగా డిమాండ్‌ పెరిగింది. ఇటీవల తెలంగాణా ప్రభుత్వం బతుకమ్మ పండుగకు 45 టన్నుల పూలను ప్రభుత్వ పరంగా సేకరించడం, తిరుమలలో బ్రహ్మోత్సవాలు, భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం, నవమి వేడుకలు, కార్తీక మాస సేవలకు, శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో వందల టన్నుల పూల వినియోగాన్ని అర్చకులు ప్రోత్సహిస్తున్నారు. ఈ దేవాలయాల్లో టెండర్ల ద్వారా పూలు కొనుగోళ్ళు చేయడం వల్ల దళారులు లాభపడడం తప్ప ఫలితం నేరుగా రైతులకు దక్కడం లేదు. పాలిహౌస్‌ రైతుల సంఘం లేదా పూల రైతుల సంఘం నుండి నేరుగా పూలు సేకరించడం వల్ల రైతుల ఆదాయ వనరులు వృద్ధి అవుతాయని రైతు నేతలు చెబుతున్నారు.
  13. ప్రస్తుతం విదేశీపూల నర్సరీ మన రెండు రాష్ట్రాల్లో లేదు. అలాగే ఈ మొక్కల సాగుపై సమగ్రమైన, పరిశోధన, తెగుళ్ళు, పురుగుల నివారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక పరిశోధనా కేంద్రం కూడా అవసరం. ఐసిఎఆర్‌కు ప్రత్యేక వినతులు పంపడం ద్వారా నర్సరీ స్థాపనకు అదేసమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు సస్యరక్షణ, నీటి యాజమాన్యం, మార్కెట్‌ వ్యూహాలను రైతులకు అందజేసేందుకు సమగ్ర పూల పరిశోధనా కేంద్రాన్ని స్థాపించి ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలి. దానితోపాటు వర్మికంపోస్టు యూనిట్లు, సేంద్రియ ఎరువుల తయారీకి కూడా రైతులకు ఆర్థికంగా తోడ్పడాలి.

తెలంగాణ ప్రభుత్వం నేరుగా రైతులకు సహాయపడే విధంగా పాలిహౌస్‌ నిర్మాణాలకు రూ. 320 కోట్లు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవలనే ఒక వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేసి ఆధునిక ఉద్యానవన ప్రక్రియలకు ప్రోత్సాహకాలను ప్రకటంచింది. బిందు పరికరాలను అమర్చడంలో ఇరు రాష్ట్రాలలో ఎస్‌.సి/ఎస్‌.టి లకు నూరుశాతం రాయితీ ఇస్తుండగా పాలిహౌస్‌ల ఏర్పాటుకు జాతీయ ఉద్యానవన మిషన్‌ నేరుగా సబ్సిడీలను ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగినా, ఇంకా ఉద్యానవనశాఖలో విభజన పర్వం పూర్తికాకపోవడంతో రైతులకు స్పష్టమైన కార్యాచరణ లభించడంలేదు. మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యి, ఇరు రాష్ట్రాల్లో పాలిహౌస్‌లలో సాగు ఒక వెల్లువలా కొనసాగనున్నది. తెలంగాణలోని 10 జిల్లాల్లో కూడా పాలిహౌస్‌లలో సాగుకు అనుకూల వాతావరణం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాజిల్లాల్లో తరచుగా సంభవించే వాయుగుండాల, తుఫానుల వల్ల పరిస్థితి అనుకూలంగా ఉండదు. కాని రాయలసీమ నాలుగు జిల్లాల్లో పాలిహౌస్‌లలో కూరగాయలు, పూల సాగు ద్వారా కర్నాటక రాష్ట్రానికి ధీటుగా ఉద్యానవన విప్లవాన్ని సాధించవచ్చు.

Leave Your Comments

పాలిహౌస్‌లను వేధిస్తున్న నులి పురుగుల బెడద

Previous article

చెరకు పంటలో బిందు సేద్యం ఆవశ్యకత

Next article

You may also like