రైల్వేకోడూరు మండలానికి చెందిన యువరైతు బండి నరసింహారెడ్డి మిశ్రమ సాగుతో అధిక ఆదాయం పొందేలా వినూత్న వ్యవసాయానికి శ్రీకారం చుట్టూరు. తనకున్న 13 ఎకరాల పొలంలో 9 రకాల కూరగాయల పంటలను సాగు చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి సేద్యం చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇతను ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ సిడ్నీలో 2004 లో ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తి చేశారు. అప్పటి నుంచి అక్కడే 10 ఏళ్లపాటు ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం చేశారు. తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ సొంతంగా ఏదైనా చేయాలనే తపనతో మన దేశానికి వచ్చి వ్యవసాయాన్ని చేపట్టారు. హైదరాబాదులోని వారాహి సంస్థ సహకారంతో పంటసాగులో కషాయాలను వినియోగిస్తున్నారు. సేంద్రియ పద్ధతులతో బెండ, వంగ, టమాట, మిరప, కాలీఫ్లవర్, క్యాబేజీ, సొరకాయ, కాకర, దొండ, బీర సాగుతో పాటు వాణిజ్య పంటలైన అమృతపాణి అరటి, మామిడి పంటలను పండిస్తున్నారు. మార్కెట్ ఖర్చులు తగ్గి ఏటా రూ. 30 లక్షలు వరకు ఆదాయం పొందుతున్నట్లు నరసింహారెడ్డి చెబుతున్నారు.