- ఈట్ రైట్ బ్రాండ్ తో ఉత్పత్తుల అమ్మకాలు
- హైదరాబాద్ లో 150 విక్రయ కేంద్రాల ఏర్పాటు
- ప్రైవేటు ఉత్పత్తులకన్నా తక్కువ ధరకే
రాగులు, కొర్రలు, సాములు,ఊదలు,సజ్జలు తదితర పోషక తృణధాన్యాల ఆహారోత్పత్తులకు నేరుగా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రైవేటు సంస్థలు అధిక ధరలకు అమ్ముతున్నట్లు సర్కారు దృష్టికి రావడంతో వాటి కన్నా తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారోత్పత్తులను ప్రజలకి చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాజేంద్రనగర్ లోని భారత తృణధాన్యాల పరిశోధనా సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఐఐఎం ఆర్ లో గల “న్యూట్రిహబ్ “ తో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ది సంస్థ (ఆగ్రోస్) తాజాగా ఒప్పందం చేసుకుంది. తృణధాన్యాల పంటలతో పలు రకాల ఆహారోత్పత్తుల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐఎం ఆర్ (IIMR) అభివృద్ది చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రైవేటు సంస్థలు ఈ పరిజ్ఞానాన్ని , ఆధునిక యంత్రాలపై హక్కులు తీసుకోని తృణ ధాన్యాలతో తయారు చేసిన ఆహారోత్పత్తులను విక్రయిస్తున్నాయి. న్యూట్రిహబ్ ఉత్పత్తులకు “ఈట్ రైట్ “ అనే బ్రాండ్ ను సైతం ఐఐఎంఆర్ సృష్టించింది. ఇదే బ్రాండు, ఈ సంస్థ పరిజ్ఞానాన్ని తీసుకోని తెలంగాణ లో తృణ ధాన్యాల ఆహారోత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయలని అగ్రోస్ నిర్ణయించింది. బిస్కెట్లు, కేకులు, ఇడ్లీలు, రొట్టెలు, వడియాలు తదితర అనేక రుచికరమైన ఆహారోత్పత్తులను ఈట్ రైట్ పేరుతో తయారు చేయనున్నారు. తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ లోని 150 పురపాలక డివిజన్లలో 150 విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రజలు ఎంత మేర కొనుగోలు చేస్తారు ? నిర్వహణ సవాళ్ళను పరిశీలించి మలి దశలో వరంగల్,కరీంనగర్ ,ఖమ్మం తదితర అన్ని పెద్ద పట్టణాల్లోను విక్రయ కేంద్రాలను తెరవాలని సంస్థ యోచిస్తోంది. ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి కల్పించాలని అగ్రోస్ నిర్ణయించింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విద్యాలయానికి చెందిన గృహ విజ్ఞాన శాస్త్రం, ఆహార శాస్త్రం పట్టభద్రులైన అమ్మాయిలతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తారు. ఈ వనితల వివరాలు ఇవ్వాలని వర్సిటీ కాలేజ్ లకు ఇటివల అగ్రోస్ లేఖ రాసింది. వీరిలో ఆసక్తి ఉన్నవారిని వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. హెచ్ పి సి ఎల్ ,బీ పీ సి ఎల్ పెట్రోల్ బంకుల్లో ఈ విక్రయ స్థలాలను కేటాయించాలని అగ్రోస్ లేఖ రాసింది. ఈ సంస్థలకు కూడా అగ్రోస్ లేఖ రాసింది. ఈ ఉత్పతులపై తయారీదారులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్ మొదటివారంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించనుంది.
Leave Your Comments