ఆంధ్రా వ్యవసాయంమత్స్య పరిశ్రమమన వ్యవసాయం

పోర్టబుల్‌ కంటైనర్‌లో అజోల్లా పెంపకం యొక్క ప్రయోజనాలు  

0
azolla
       azolla అజోల్లా నీటిలో తేలియాడే నాచు మొక్క. దీనిలో ఉండే అధిక మాంస కృతులు (25-35%) వల్ల దీనిని దాణాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చును. అజోల్లానూ తక్కువ పెట్టుబడితో, తక్కువ విస్తీర్ణంలో, తక్కువ కాలంలో సాగు చేసుకోవచ్చును. రెండు కిలోల అజోల్లా, ఒక కిలో దాణాతో సమానం, అజోల్లాను ఇంతకుముందు తొట్టిలో సాగు చేసే వాళ్ళు, కానీ ఈ సాగు పద్ధతిలో తొట్టి నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది మరియు ఇవి ఒకే దగ్గర స్థిరంగా ఉంటాయి. కాబట్టి వాతావరణ ప్రతికూల పరిస్థితులలో వీటిని ఒక చోట నుండి మరోచోటకు మార్చలేము. దీనివలన ప్రతికూల కాలంలో అజోల్లా పెరుగుదల ఆశించినంత రాదు, అంతేకాక నిర్మాణం శ్రమతో కూడుకున్నది. ఈ నష్టాలను పోర్టబుల్‌ కంటైనర్లను వాడటం వల్ల కొంతవరకు అధిగమించవచ్చును.
పోర్టబుల్‌ కంటైనర్‌లో అజోల్లా పెంచే విధానం :
. ఈ హెడ్‌ డి పి ఈ ప్లాస్టిక్‌ కంటైనర్లు వివిధ పరిమాణాల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
. ఈ కంటైనర్లను మొదటగా అమర్చుకోవాలి అనుకున్న స్థలంలో నేలను      సమాంతరంగా చదునుచేసుకోవాలి.
. కంటైనర్లను దిగువ భాగం/ క్రింది భాగం దెబ్బతినకుండా వాడేసిన గోనె   బస్తాలను లేదా ప్లాస్టిక్‌ సంచులను నేల మీద పరచుకోవాలి. తర్వాత దాని   మీద ఈ కంటైనర్లను అమర్చుకోవాలి.
. కంటైనర్‌ షీట్‌ సైజును బట్టి, దాని పైన 30 నుండి 35 కిలోల సారవంతమైన మట్టిని సమానంగా చల్లుకోవాలి.
. తరువాత 20 లీటర్ల నీటిలో నాలుగు కిలోల ఆవు పేడను, 30 గ్రాముల సూపర్‌ఫాస్ఫేట్‌ను కలిపి ఈ మిశ్రమాన్ని మట్టిపై చల్లాలి. తర్వాత తగినంత నీటితో నింపాలి.
. తదనంతరం ఒక కిలో అజోల్లా కల్చర్ను కంటైనర్‌లో వేయాలి. ఈ కల్చర్‌ సమానంగా చల్లాలి.
. నీటి యొక్క లోతు 15 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి.
. అజోల్లా సూర్యరశ్మి నేరుగా తగలకుండా నీడ కోసం మరియు చెత్త, ఇతర ఆకులు పడకుండా కంటైనర్‌ పైన మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో వలను ఈ ఫోటోలో చూపిన విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
. ఒక వారం తర్వాత అజోల్లా తొట్టి మొత్తం అభివృద్ధి చెందుతుంది.
. అజోల్లా పూర్తిగా పెరిగాక ప్లాస్టిక్‌ జల్లెడతో దానిని కంటైనర్‌ నుండి తీసుకోవచ్చు.
. కంటైనర్‌లో ఏమైనా పొడి ఆకులు లేదా చెత్త కనిపించినట్లయితే వెంటనే తీసివేయాలి. లేనియెడల, అవి అజోల్లా పెరుగుదలను నిరోధించడమే  కాకుండా కుళ్ళిపోయేలా చేస్తుంది.
. అనుకూల వాతావరణంలో రోజుకు 1.5 కిలోల అజోల్లాను 12I4I1 అడుగుల పరమాణం ఉన్న కంటైనర్‌ నుండి పొందవచ్చును. ఈ అజోల్లాను తీసిన తర్వాత మంచినీటిలో పేడ వాసన పోయేవరకు కడగాలి.
. దీనిని/ఈ అజోల్లాను నేరుగా లేదా ఎండబెట్టిన తర్వాత కానీ పశువులకు అందించవచ్చు.
. ఈ అజోల్లాను వాసన కారణంగా మొదట్లో పశువులు సరిగా తినవు, కావున అవి దీని రుచికి అలవాటు అయ్యే వరకు దాణాలో కలిపి వేయాలి.
. ఒకవేళ అజోల్లా ఎక్కువ మోతాదులో లభించినట్లయితే దానిని నీడపట్టున ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు.
పోర్టబుల్‌ కంటైనర్లో అజోల్లా పెంపకం వలన లాభాలు/ ప్రయోజనాలు :
. ఈ కంటైనర్లను రైతుల అవసరాలకు అనుగుణంగా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి సులభంగా తరలించవచ్చు.
. వీటిని ఎటువంటి శ్రమ లేకుండా సులువుగా అమర్చుకోవచ్చు.
. వేసవికాలంలో వీటిని నీడ ఉన్న ప్రదేశాలకు మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటు బయట నిర్మించిన తొట్టిల విషయంలో సాధ్యం కాదు.
. ఈ కంటైనర్లు అధిక సాంద్రత కలిగిన హెచ్‌ డి పి (HDPE) ఈ ప్లాస్టిక్‌తో చేయడంవల్ల అవి 5 సంవత్సరాలు వరకు మన్నికగా ఉంటాయి.
. ఈ అజోల్లాను దాణాతో పాటు కలిపి ఇవ్వడం వల్ల, దాణా ఖర్చు తగ్గడమే కాకుండా పశువు యొక్క ఆరోగ్య ప్రమాణాలు మరియు పాల దిగుబడి కూడా పెరుగుతుంది.
డా॥ బి. విద్య మరియు డా॥ ఆర్‌. ఎం. వి. ప్రసాద్‌ పశుగుణ క్షేత్ర సముదాయము,
పశు వైద్య కళాశాల, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.
Leave Your Comments

పత్తిలో సాంప్రదాయక మరియు ఆధునిక అంతరకృషి ఎరువుల యాజమాన్యం

Previous article

పి జె టి ఎస్ ఏ యు (PJTSAU) తో ఆసియన్ రూరల్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్  (AARDO) ఒప్పందం

Next article

You may also like