వార్తలువ్యవసాయ వాణిజ్యం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘‘అగ్రి ఇన్నోవేషన్‌ హబ్‌’’ ప్రారంభోత్సవం

0
Agri Innovation Hub

Agri Innovation Hub: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన ‘‘అగ్రి ఇన్నోవేషన్‌ హబ్‌’’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి(Singireddy Niranjan Reddy) దీన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, మున్సిపల్‌, పరిశ్రమల శాఖా మంత్రి కె. తారక రామారావు(KTR), విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాబార్డు ఛైర్మన్‌ గోవిందరాజులు, చేవెళ్ళ ఎంపి. రంజిత్‌ రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎం.ఎల్‌.ఎ ప్రకాష్‌ గౌడ్‌, ఎల్‌.బి నగర్‌ ఎం.ఎల్‌.ఎ సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎం.ఎల్.ఎ కిషన్ రెడ్డి ,జగిత్యాల ఎం.ఎల్‌.ఎ సంజయ్‌కుమార్‌,రంగారెడ్డి జడ్‌.పి ఛైర్‌పర్సన్‌ అనితాహరినాథరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ళను పరిశీలించిన పిదప ఆ సమావేశంలో పాల్గొన్నారు.యూనివర్సిటీ ఉపకులపతి వి.ప్రవీణ్‌రావు(Praveen Rao) స్వాగతోపన్యాసం చేశారు.

Agri Innovation Hub

నాబార్డు(NABARD) సహకారంతో ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సాయంతో దేశంలో ఏడు ఇన్‌క్యూబేటర్లు ఏర్పాటయ్యాయని నాబార్డ్‌ ఛైర్మన్‌ గోవిందరాజులు చింతల వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు.

రీసెర్చ్‌,టెక్నాలజీలు కలిస్తే రైతాంగానికి మరింత మేలు జరుగుతుందన్నారు.కరోనా మహమ్మారి సమయంలో దేశంలో ఆకలి చావులు లేవని గోవిందరాజులు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లు బాగా మారాయని అందుకు అనుగుణంగా కొత్త వెరైటీలు తీసుకురావాలని ఆయన సూచించారు. అదేవిధంగా సమీకృత వ్మవసాయ పద్ధతులపై యూనివర్సిటీలు పనిచేయాలన్నారు. ప్రస్తుత తరుణంలో వ్యవసాయరంగంలో స్టార్టప్‌లు చాలా అవసరమన్నారు. ఈ అగ్రిహబ్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని గోవిందరాజులు అభిలషించారు.

ప్రపంచం అబ్బురపడే విధంగా స్వల్పకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత కెసిఆర్‌కి దక్కిందన్నారు. మిషన్‌ కాకతీయ, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు వంటి వాటి ద్వారా రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టూ ఒడిసిపట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కెటిఆర్‌ అన్నారు.నేటి తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని స్వయంగా ఎఫ్‌.సి.ఐ ఈ విషయాన్ని ధృవీకరించిదని కెటిఆర్‌ వ్యాఖ్యానించారు.ఈ అగ్రికల్చర్‌ హబ్‌ సామాన్య రైతులకు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని కెటిఆర్‌ సూచించారు.మారుమూల ప్రాంతాల్లో ఉండే రైతులకు, వారి పిల్లలకి కూడా అగ్రిహబ్‌ తలుపులు తెరచి ఉంచాలన్నారు.అదేవిధంగా ఈ పరిజ్ఞానాన్ని తెలుగులో అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగం పంటల వైవిధ్యకత వైపు మళ్ళేలా చర్యలు తీసుకోవాలని ఇంకా విస్తృతంగా పరిశోధనలు చేపట్టాలని కెటిఆర్‌ యూనివర్సిటీకి సూచించారు.

తెలంగాణాలో వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివరించారు.ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్‌ని సైతం అధిగమించిందన్నారు.నూతన ఆవిష్కరణల సాయంతో సమతుల్య,పౌష్టికాహారం అందరికీ అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.తెలంగాణ అన్నింటికీ అనువైన ప్రాంతమని వివరించారు.ప్రభుత్వ పరంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రైతాంగం కూడా సంప్రదాయ పద్ధతుల్నుంచి బయటకొచ్చి నూతన సాంకేతికతల వైపు మారాలని నిరంజన్‌ రెడ్డి సూచించారు.

వ్యవసాయ యాంత్రీకరణ,డ్రోన్ల వినియోగం పై పరిశోధనలపై విస్తృతం కావాలన్నారు. ఉపకులపతి డా॥ వి. ప్రవీణ్‌రావు నేతృత్వంలో యూనివర్సిటీ అధ్బుతంగా పనిచేస్తుందని మంత్రి అభినందించారు.అతి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతులమీదుగా వేరుశనగ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు.గతంలో ఎన్నడూలేని విధంగా పరిశోధనల కోసమే యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఇచ్చామన్నారు.ఆయిల్‌పామ్‌ సాగును పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.  అదేవిధంగా నూనెగింజల ఉత్పత్తి పెంచుకోవలసిన అవసరం ఉందని నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా అగ్రిహబ్‌కి సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు.కొన్ని సంస్థల ఉత్పత్తులను ప్రారంభించారు.కొన్ని సంస్థల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు,యూనివర్సిటీ అధికారులు,శాస్త్రవేత్తలు,అధ్యాపకులు,విద్యార్థినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.అగ్రి హబ్‌ ఎం.డి డా॥కల్పనాశాస్త్రి వందన సమర్పణ చేశారు.

Leave Your Comments

Foxtail Millets: అండుకొర్రల సాగు వర్షాభావ పరిస్థితులకు సరైన సమాధానం

Previous article

వాతావరణ మార్పులతో సహా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరిస్తామంటున్న కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

Next article

You may also like