ఆంధ్రా వ్యవసాయంమన వ్యవసాయం

ప్రోట్రేలలో మిరప నారు పెంచడంలో మెళకువలు

0

chilliseeds మిరప ఒక ముఖ్యమైన వాణిజ్య పంట.మిరపలో విత్తన పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవడం చాలా కష్టం. ముందుగా నారును పెంచుకొని తరువాత మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నారును పెంచడం వల్ల నారుమడిలో నీరు ఎక్కువైనప్పుడు వేరుకుళ్ళు లాంటి తెగుళ్లు రావడం మరియు రసం పీల్చే పురుగులు ఆశించడం వల్ల అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల నారు ఆరోగ్యవంతంగా పెరగదు.ఇలాంటి పరిస్థితులు అధిగమించడానికి నీటివసతి ఉండి నారుమడి తయారీకి సరైన నేల లేనప్పుడు ప్రోట్రేలలో ఆరోగ్యవంతమైన నారును పెంచుకోవచ్చు. మిరపలో అధిక దిగుబడిని సాధించాలంటే నారుమడి యాజమాన్యం చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో ప్రోట్రేలలో మిరపనారును పెంచడానికి చాలా మంది రైతులు మక్కువ చూపిస్తున్నారు. ఈ విధంగా పెంచిన ఆరోగ్యవంతమైన నారును ప్రధానపొలంలో నాటినప్పుడు మొలక చనిపోయు శాతం తగ్గి నారు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. వేరు వ్యవస్థ బలంగా భూమిలోకి పెరిగి నీటిని మరియు ఇచ్చిన స్థూల మరియు సూక్ష్మపోషకాలను బాగా వినియోగించుకొని చీడపీడలను తట్టుకొని కలుపు బెడద కూడా తగ్గి అధిక దిగుబడిని పొందవచ్చు.
ఆసక్తి ఉన్న గ్రామీణ, యువకులు ప్రోట్రేల పద్ధతిలో నారును పెంచడం ఒక ఉపాధిగా కూడా ఎంచుకొని గ్రామంలో ఉన్న ఇతర రైతులకు నారును సరఫరా చేయవచ్చు. ప్రోట్రేలలో మిరప నారును పెంచినప్పుడు ఆరోగ్యవంతమైన నారును పొందడానికి కొన్ని మెళకువలు పాటించాలి.

ప్రోట్రేల ఎంపిక :
54 సెం.మీ. పొడవు మరియు 28 సెం.మీ.వెడల్పు, 98 గుంతలు కలిగిన ట్రేలను మిరపనారును పెంచడానికి ఉపయోగించాలి. ప్రతి గుంత కింది భాగంలో రెండు చిన్న రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. ప్రోట్రేలను వాడుకునే ముందు కాప్టాన్‌ లేదా మాంకోజెబ్‌ శిలీంద్రనాశక మందులను 3 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి ఈ నీటిలో ప్రోట్రేలను ముంచి ఆరబెట్టాలి. ఇలా శుభ్రపరచిన 120 ట్రేలు ఒక ఎకరం నారు పెంచడానికి సరిపోతాయి.

వృద్ధి మిశ్రమం తయారీ :
ప్రోట్రేలలో వాడే వృద్ధిమిశ్రమాల్లో కోకోపీట్‌ ముఖ్యమైనది. బాగా చివికిన కోకోపీట్‌ మాత్రమే ఉపయోగించాలి. ఒక టన్ను కోకోపీట్‌ మిశ్రమానికి 100 కిలోల వేపపిండి, 1 కిలో ట్రైకోడెర్మా విరిడి కలిపినట్లయితే తెగుళ్ళ బారి నుండి నారు మొక్కలను కాపాడుకోవచ్చు. కోకోపీట్‌తో పాటు వర్మి కంపోస్టును వాడితే వాటిని సమపాళ్ళలో వాడాలి. ఒక ప్రోట్రేను నింపడానికి 1 – 1.25 కిలోల కోకోపీట్‌ అవసరం అవుతుంది.

విత్తన మోతాదు :
సూటిరకాలకు 650 గ్రా. మరియు హైబ్రిడ్‌ రకాలకు 75 – 100 గ్రా. విత్తనం సరిపోతుంది. ప్రోట్రేలలో విత్తనశుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే విత్తాలి.

విత్తన శుద్ధి :
శిలీంధ్ర లేదా కీటక నాశిని పేరు : ఇమిడాక్రోప్రిడ్‌
మోతాదు : ముందుగా విత్తనానికి తుమ్మ జిగురు పట్టించి తరువాత 8 గ్రా. పొడిని కిలో విత్తనానికి కలిపి 15 ని॥ నీడలో ఆరనివ్వాలి.
నివారించబడే చీడపీడలు : రసంపీల్చే పురుగులు
శిలీంధ్ర లేదా కీటక నాశిని పేరు : కాప్టాన్‌/మాంకోజెబ్‌
మోతాదు : 3 గ్రా. / కిలో విత్తనానికి
నివారించబడే చీడపీడలు : విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు
శిలీంధ్ర లేదా కీటక నాశిని పేరు : ట్రైకోడెర్మా విరిడి (జీవశిలీంధ్ర నాశకం)
మోతాదు : 5`10 గ్రా. కిలో విత్తనాన్ని 20 ని॥ల పాటు నానబెట్టి తరువాత మంచి నీటిలో కడిగి నీడలో ఆరబెట్టాలి.
నివారించబడే చీడపీడలు : వైరస్‌ తెగుళ్ళు
ప్రోట్రేలలో నారును పెంచేవిధానం :
ప్రోట్రేలలో ముందుగా వృద్ధి మిశ్రమాన్ని నింపుకోవాలి. తరువాత గుంట మధ్య భాగంలో వేలితే 0.5 సెం.మీ. లోతును చేసుకోవాలి. ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క విత్తనాన్ని వేసి వృద్ధి మిశ్రమంతో కప్పివేయాలి. విత్తిన తరువాత వృద్ధిమిశ్రమాన్ని రోజ్‌క్యాన్‌తో జాగ్రత్తగా నీటిని అందించాలి. ప్రోట్రేలలో విత్తనం నాటిన తరువాత 8 – 10 ట్రేలను ఒకదానిపై ఒకటి అమర్చి 3 – 6 రోజుల వరకు పాలిథీన్‌ కవరుతో కప్పాలి లేదా వాటిని లోటన్నెల్స్‌లో కూడా ఉంచవచ్చు.దీనివల్ల తేమ బయటకుపోకుండా విత్తనం త్వరగా మొలకెత్తుతుంది. మిరప 6 – 7 రోజుల్లో మొలకెత్తుతుంది. విత్తనం మొలకెత్తిన ప్రోట్రేలను ఆరుబయట నీడలో లేదా సురక్షిత కట్టడాల లోపల ఉంచాలి. మొలకెత్తిన నాటి నుండి రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా నీరు చల్లాలి.

పోట్రేలను పెట్టే సురక్షిత కట్టడాలు :
మిరప నారును పాలిహౌస్‌, షేడ్‌నెట్‌, నెట్‌హౌస్‌ మరియు లోటవుల్స్‌లో పెంచుకోవచ్చు.
పాలీహౌస్‌ :
దీని నిర్మాణానికి 6 – 8 అడుగుల ఎత్తుగల స్టీలుపైపులు వెదురు కట్టెలు, సరుగుడు కలపను గాని వాడవచ్చు. పైకప్పుగా పాలిథీన్‌షీటును ఉపయోగించాలి. దీనికి పక్కభాగాలకు 40/50 మెష్‌నైలాన్‌ నెట్‌ను కట్టాలి. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి చేసే రసంపీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. పాలిహౌస్‌ కప్పు కింద సూర్యరశ్మి తీవ్రత, ఉష్ణోగ్రతను తగ్గించడానికి షేడ్‌నెట్‌ని ఏర్పరుచుకోవాలి.
షేడ్‌నెట్‌ హౌస్‌ :
షేడ్‌నెట్‌కు స్టీలుపోల్సు లేదా రాతి స్థంబాలతో సపోర్టు ఇచ్చి అన్నివైపులా 50 శాతం నీడనిచ్చే షేడ్‌నెట్‌తో కప్పుకోవాలి. దీనిలోపల కీటకనిరోధక నెట్‌ను కప్పితే రసంపీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది.
పాలిటెన్నెల్స్‌ :
వర్షాకాలంలో ప్రోట్రేలలో పెంచిన నారు వర్షాల బారిన పడకుండా ఉండడానికి ఒక మీటరు వెడల్పు మరియు ఒక మీటరు ఎత్తులో 3/4 హెచ్‌.డి.పి.ఇ పైపులతో ఆర్చు ఆకారంలో నిర్మించిన వాటిపైన పాలిథీన్‌ పొరను కప్పుకోవాలి.
కీటక నిరోధక నెట్‌ హౌస్‌ :
తామర పురుగులు, తెల్లదోమ బారి నుండి త్వరగా వైరస్‌ నుండి నారును కాపాడడానికి 20I10I8 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు 40/50 మెష్‌నైలాన్‌ నెట్‌తో నారును పెంచుకోవాలి.

నీటి యాజమాన్యం :
విత్తనం నాటిన నాటి నుండి నారును ప్రధాన పొలంలో నాటే వరకు క్రమం తప్పకుండా నీటిని అందించాలి. వాతవరణ పరిస్ధితులను బట్టి ప్రతిరోజు రోజ్‌క్యాన్‌ ద్వారా కానీ లేదా మైక్రోజెట్‌ ద్వారా గానీ నీరు అందించాలి.

ఎరువుల యాజమాన్యం :
మిరప నారు రెండు సార్లు అంటే విత్తనం నాటిన రెండు మరియు మూడు వారాలకు 3 గ్రా. పాలిథీన్‌ ఒక లీటరు నీటికి కలిపి ప్రోట్రేలలో ఉన్న నారును బాగా తడపాలి.

నారు మొక్కల సస్యరక్షణ :
చీడపీడలు మందు పేరు మోతాదు ఉపయోగించే
విధానం.
నారుకుళ్ళు కాపర్‌ 3 గ్రా./ ప్రోట్రే
ఆక్సీక్లోరైడ్‌ లీ.నీటికి గుంతలను
తడపాలి లేదా
కార్బెండిజమ్‌ 1 గ్రా./లీ.నీటికి
వైరస్‌ రోగాలను ఇమిడాక్లోప్రిడ్‌ 0.2 మి.లీ. పిచికారి
వ్యాప్తి చేసే / లీ. నీటికి చేయాలి

నారు మొక్కలను ధృవపరచడం :
మిరపనారు 35 – 40 రోజులకు నాటడానికి సిద్ధమవుతుంది. ప్రధాన పొలంలో నాటడానికి వారం రోజుల ముందు ప్రోట్రేలలో నీరివ్వడం తగ్గించాలి. దీనివల్ల నారు బాగా ధృడపడి ప్రధాన పొలంలో బాగా నాటుకుంటుంది. తద్వారా రైతుసోదరులు మిరపను ప్రోట్రేలలో సమగ్ర నారు యాజమాన్యం చేపట్టినట్లయితే ఆరోగ్యవంతమైన నారుతో అధిక దిగుబడులు పొందవచ్చు.

ఎమ్‌.ఆర్‌.భానుశ్రీ, డాడా. ఎస్‌.మాలతి, డా. పి.జగన్‌ మోహనరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,వరంగల్‌

Leave Your Comments

చామంతి సాగు – యాజమాన్య పద్దతులు

Previous article

ఆగస్టు మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు

Next article

You may also like