చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

మొక్కజొన్న కత్తెరపురుగు – సమగ్ర సస్యరక్షణ

0

corn          మొక్కజొన్నలో  ప్రొటీన్లు,ఎమినో ఆమ్లాలు కలిగి ఉండే చక్కని ధాన్యపు పంట,రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న సుమారు 90 వేల హెక్టార్లలో సాగవుతున్నది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్‌ పంటగా సుమారు 10,000 హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతుంది. రాజం, రణస్థలం, లావేరు, జి. సిగడం, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగులో ఉంది. మొక్కజొన్న పంటకు ప్రమాదకారి అయిన ‘‘కత్తెర పురుగు’’ ప్రస్తుతం తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు మొక్కజొన్నను ఆశించే మొవ్వు పురుగుకన్నా భిన్నంగా ఉంటుందని, రైతులు గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్ట్టాలని లేకపోతే దీని ఉధృతి మిగతా పంటల మీద కూడా పడుతుందని భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

కత్తెరపురుగు :-
ఫాల్‌ ఆర్మీవార్మ్‌గా పిలవబడే ఈ పురుగు శాస్త్రీయనామం, స్పోడోప్టిర ప్రుగిపెరాడ. ఇది లేపిడాప్టిరా జాతికి చెందిన పురుగు. మొక్కజొన్నను ఎక్కువగా పండిచే అమెరికా, ఆఫ్రికా దేశాలలో ఈ పురుగు ఉధృతి ఎక్కువ. 2018 నుండి ఈ పురుగు ఉధృతిని మన జిల్లాలో కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురుగు ఎక్కువగా మొక్కజొన్న మీది ఆశించి నష్టపరుస్తుంది. మొక్కజొన్న లేనప్పుడు ఇతర పంటలను ఆహారంగా తీసుకుంటుంది. వరి, పత్తి, అపరాలు, సోయా, జొన్న, కూరగాయలు పంటలు వంటి 80 రకాల మొక్కలపై ఈ పురుగు నష్టం చేస్తుంది.

నష్టపరిచే విధానం :
. ఈ పురుగు యొక్క రెక్కల పురుగు గుడ్లు పెట్టడం వల్ల, గుడ్లు పగిలి పిల్లలుగా మారిన లద్దెపురుగులు గుంపులుగా ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తింటాయి.
. రెండవ దశలో ఈ పురుగులు కాండం మొవ్వులో చేరి లోపల కండాన్ని తినివేస్తాయి. ఆకుల మీద పెద్దపెద్ద రంధ్రాలు ఏర్పడతాయి.

. శాఖీయ దశలో ఆశించినప్పుడు మొవ్వును పూర్తిగా తినివేయడం వల్ల మొవ్వు చనిపోయే ప్రమాదముంది. పురుగు తిని విసర్జించిన మల పదార్ధంతో మొవ్వతా నిండి ఉంటుంది.
. పూత మొదలయ్యే సమయంలో ఆశిస్తే మొవ్వులోపల ఉన్న పూతను కూడా రంధ్రాలు చేసి నష్టపరుస్తాయి. పూత చనిపోయి కంకి తయారవ్వదు.

. కంకి తయారయ్యే సమయంలో కూడా ఈ పురుగు ఆశించి కంకులను తిని నష్టపరుస్తాయి.
. ఈ పురుగు ఎక్కవగా మొక్కజొన్న పంటను అశిస్తుంది. పంట లేనప్పుడు వరి, జొన్న, చెరుకు, ప్రత్తి, కూరగాయలు వంటి ఇతర 80 రకాల పంటల మీద తిని బ్రతుకుతుంది.

నివారణ :
సమగ్ర సస్య రక్షణ విధానం ద్వారా ఈ పురుగును నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది:
. ఆలస్యంగా విత్తుకునే పంటలో ఈ పురుగు ఉధృతి ఎక్కువ కనుక మొక్కజొన్న సాగుచేసే రైతులు సకాలంలో ఖరీఫ్‌లో జూన్‌ /జులై నెలలో మొదటి వారం, రబీ కాలంలో నవంబర్‌లో విత్తుకుంటే మంచిది.
. మొక్కజొన్నలో అంతర పంటగా లేదా చుట్టూ కంచెపంటగా నాపియర్‌ గడ్డిని/జొన్న/కంది వేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది.
. సాయంత్రనిలిప్రోల్‌ 19.8%G ధయోమితోక్సం 19.8% మిశ్రమంతో కిలో విత్తనానికి 4 మి.లీ చొప్పున పట్టించి విత్తుకోవాలి.
. తొలిదశలో పురుగు ఆశించి గుడ్లు పెట్టకుండా ఉండేందుకు, విత్తిన వారం రోజులకు వేప నూనె(1500 పి. పి. ఎం) 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
. మొక్కజొన్న విత్తిన తరువాత 3-4 రోజులకు ఎకరా పొలంలో 4-8 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతి గమనిస్తూ ఉండాలి.
. ప్రతి రెండు మూడు రోజులకు పొలాన్ని పరిశీలించి పురుగు గుడ్లు, లేదా పిల్ల పురుగుల సమూహాలు కనిపిస్తే ఏరి నాశనం చేయాలి.
. టైకోగ్రామా గుడ్లు పరాన్న జీవులను ఎకరానికి 50,000 గుడ్లు చొప్పున టైకోకార్డులు ద్వారా రెండు సార్లు పొలంలో వదలాలి.
. పక్షి స్థావరాలు ఎకరాకు 10 చొప్పున అమర్చుకోవాలి.
. బి. టి. ఫార్ములేషన్‌ లీటరు నీటికి 2 గ్రా. చొప్పున కలిపి పురుగు ఉధృతి గమనించిన వెంటనే పిచికారీ చేయాలి. మేటరైజియం వంటి శిలీంద్రజాతికి చెందిన జీవరసాయినం లీటరు నీటికి 5 గ్రా. చొప్పునవాడి కూడా పురుగును అదుపు చేయవచ్చు.
. తొలిదశలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే, నివారణకు ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5% 80 గ్రా. ఎకరానికి 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే, నివారణకు ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5 % ఎస్‌జి మందు 80 గ్రా. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 18.5% ఎస్‌సి 80 మి.లీ ఎకరానికి 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
. పంట విత్తిన 40-45 రోజుల దశలో లద్దె పురుగు నివారణకు, స్పైనిటోరం 18.5% ఎస్‌సి 100 మి.లీ లేదా ధయోమితోక్సం 12.6% G లామ్దా సైహలోత్రిన్‌ 9.5% మందు 100 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
. మూడవదశ లద్దె పురుగులను ఆకర్షించడానికి విషపు ఎరలను సాయంత్రం వేళలో పొలంలో ఉంచాలి. విషపు ఎర తయారీకి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం కలిపి ఒక రాత్రంతా పులియబెట్టి, దానికి 200 గ్రా. ధయోడికార్బ మందును కలిపి ఉండలుగా చేసి పొలంలో ఉంచాలి.
. మందు పిచికారీ చేసేటప్పుడు మొవ్వు సుడులలో పడే విధంగా పిచికారీ చేస్తే పురుగు నివారణ సాధ్యమవుతుంది.

డా.జి. చిట్టిబాబు, శాస్త్రవేత్త(సస్యరక్షణ), కృషివిజ్ఞాన కేంద్రం,ఆమదాలవలస

Leave Your Comments

 వర్షధార వ్యవసాయలలో నూనెగింజల సాగు – ప్రాముఖ్యత

Previous article

చామంతి సాగు – యాజమాన్య పద్దతులు

Next article

You may also like