ఆహారశుద్దివార్తలు

 వర్షధార వ్యవసాయలలో నూనెగింజల సాగు – ప్రాముఖ్యత

0

                oilseeds crop                         వ్యవసాయ ప్రధానమైన మన భారతదేశంలో  ఆర్ధిక వ్యవస్థలో ఆహారపంటల తరువాత ముఖ్యమైనవి నూనెగింజల పంట. ఈ నూనెగింజల పంటలు మానవాళికి ఆరోగ్య విషయంలో అత్యవసరము. మానవ శరీరంలో చెడుకొవ్వును నియంత్రించడంలో ఇవి దోహదపడుతాయి. ఆహారంతో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా సబ్బులు, కొవ్వొత్తులు, పర్ఫ్యూమ్ మరియు ఇతర సౌందర్య సాధనాల తయారీలో వీటికి వాడుతున్నారు.నూనెగింజలు అధిక శాతం వర్షాధారంగా పండించబడుతున్నాయి. అందులో ముఖ్యంగా వేరుశనగ, సోయాచిక్కుడు, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు మరియు ఆముదం మొదలగునవి సాగు చేయబడుతుంది. కానీ ఈ నూనెగింజలు భారతదేశంలో 7% మాత్రమే సాగు చేయబడుతున్నాయి. ఇందుకు గల కారణాలు అధిక శాతం వర్షాధారంగా సాగుచేయడం, చీడపీడలకు తట్టుకొనే రకాల లభ్యత లేకపోవడం, సాగుకు అనుకూల రకాలు లేకపోవడం, ఎర్ర నేలలు మరియు తక్కువ భూసారం కలిగి నేలలో సాగు చేయడం, నిల్వచేయడంలో నష్టాలు మొదలగునవి ఎదుర్కొనుటకు వానకాలంలో మంచి దిగుబడిని ఇచ్చే, తగినరకాలను, సరియగు సమయంలో విత్తుకొని మరియు విత్తనశుద్ధి వంటి యాజమాన్య పద్ధతులను పాటించి రైతు సోదరులు లాభాలను గడించవచ్చు. కావున క్రింద యాజమాన్య పద్ధతులు పేర్కొనబడ్డాయి..

వేరుశనగ రకాలు: -> కదిరి-6(k-6), కదిరి(k-9), TAG-24, కదిరిహరితాంధ్ర, ధరణి

విత్తనశుద్ధి -> కిలో విత్తనానికి 1 గ్రా టెబ్యూకొనజోల్ లరదా 3 గ్రా మాంకొజెబ్ పొడి మందును పట్టించి విత్తుకోవాలి. కాండంకుళ్ళు ఆశించే ప్రాంతాలలో 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్(600 ఎఫ్. ఎస్)ని 7 మి.లీ నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో 6.5 మి.లీ క్లోరిపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేయాలి. వరి మాగణుల్లో లేదా కొత్తగా సాగు చేస్తే ప్రాంతాలలో ఎకరానికి సరిపడే విత్తనానికి 200 గ్రా రైజోబియం కల్చర్ ని పట్టించాలి. వేరుకుళ్ళు, కాండంకుళ్ళు, మొదళకుళ్ళు తెగుళు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 10 గ్రా ట్రైకోడెర్మా విరిడిని పట్టించాలి.

విత్తేసమయం -> వానకాలంలో జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. 

విత్తన మోతాదు -> ఎకరాకు 50-60 కిలోల విత్తనం అవసరమగును. 

విత్తే దూరం -> వర్షాధారంగా సాగుచేసినచో 30 సెం.మి దూరం పాలుకి పాలుకి మధ్య 10 సెం.మి మొక్కకి మొక్కకి మధ్య ఉండేలా విత్తుకోవాలి.

సోయాచిక్కుడు 

రకాలు -> జె.యస్-335, భాసర్(ఎ.ఎస్.బి-22), జే.యస్-93-05, బీమ్(ఎల్.ఎస్.బి-18)

విత్తన శుద్ధి -> కిలో విత్తనానికి 1 గ్రా కార్బండిజమ్ లేదా 3 గ్రా ధైరమ్ లేదా కాప్టాన్ మందులో తడపాలి . 1.5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్(48%)తో విత్తనశుద్ధి చేసుకోవాలి. అనంతరం ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రా రైజోబియం కల్చర్ ను తగినంత నీటితో కొంత జిగురును కలిపి విత్తనానికి పట్టించి, అరబెట్టి అరగంట తరువాత విత్తుకోవాలి. 

విత్తే సమయం -> జూన్ 15 నుండి జులై 10 లోపు విత్తుకుంటే గణనీయమైన దిగుబడులు సాధించవచ్చు.

విత్తేదూరం -> నల్లరేగడి భూముల్లో  45 సెం.మి సాలుకి సాలుకి మధ్య 5 సెం.మి మొక్కకి మొక్కకి మధ్య దూరం ఉండేలా విత్తుకోవాలి. మధ్యస్థ భూముల్లో  సాలుకి సాలుకి మధ్య 30 సెం.మి మొక్కకి మొక్కకి మధ్య దూరం 7.5 సెం.మి దూరంలో విత్తుకోవాలి.

విత్తన మోతాదు -> ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. 

నువ్వులు 

రకాలు -> శ్వేతతిల్. జె.సి.యస్-9426(హెమ), చందన 

విత్తన శుద్ధి -> కిలో విత్తనానికి 3 గ్రా మాంకొజెబ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడటానికి ఇమిడాక్లోప్రిడ్ 2 మి.లీ కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. 

విత్తే సమయం -> వానకాలంలో రెండవ వర్షంలోపు ఆలస్యంగా విత్తుకునేప్పుడు ఆగఘ్ట రెండవ పక్షంలో విత్తుకోవాలి. 

విత్తే దూరం -> సాలుకి సాలుకి మధ్య దూరం 30 సెం.మి, మొక్కకి మొక్కకి మధ్య 15 సెం.మి దూరం ఉండేలా విత్తుకోవాలి. 

విత్తన మోతాదు -> ఒక ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది.

ప్రొద్దుతిరుగుడు 

రకాలు -> కె.బి.ఎస్.హెచ్-1, ఎన్.డి.ఎస్.హెచ్-1, డి.ఆర్.ఎస్.హెచ్-1 

విత్తన శుద్ధి -> నెక్రొసిన్ వైరస్ తెగులు సమస్య ఉన్నప్పుడు ధయోమిక్సామ్ 3 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మి.లీ. ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆల్టరేరియా ఆకు మచ్చ తెగుళు నివారణకు ఇప్రొడియాన్ 25% మరియు కార్బండిజమ్ 25% మందును 2 గ్రా కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. 

విత్తే సమయం -> వానకాలంలో తేలిక పాటి నేలల్లో జూన్ రెండవ పక్షం నుంచి జులై రెండవ పక్షం వరకు బరువైన నేలల్లో ఆగష్ట రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.   

విత్తే దూరం -> తేలిక నేలల్లో సాలుకి సాలుకి మధ్య దూరం 4-5 సెం.మి, మొక్కకి మొక్కకి మధ్య 20-25 సెం.మి ఉండేలా విత్తుకోవాలి, నల్లరేగడి నేలలో సాలుకి సాలుకి మధ్య 60 సెం.మి మొక్కకి మొక్కకి మధ్య 30 సెం.మి దూరంలో విత్తుకోవాలి.   

విత్తన మోతాదు -> ఎకరాకు 2.5 -3 కిలోల విత్తనం సరిపోతుంది. 

ఆముదం 

రకాలు -> పి.సి.హెచ్-111, పి.పి.ఎస్-124(హరిత), పి.సి.యస్-262(ప్రగతి), డి.సి.హెచ్-177, డి.సి.హెచ్-519  

విత్తన శుద్ధి -> కిలో విత్తనానికి 3 గ్రా ధైరమ్ లేదా కాప్టన్ కలిపి విత్తన శుద్ధి చేయడం వలన మొలక కుళ్ళు తెగుళు అరికట్టవచ్చు. వడలు తెగులు ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 3 గ్రా కార్బండిజమ్ లేదా 10 గ్రా ట్రైకొడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి. 

విత్తే సమయం -> వానకాలంలో జూన్ రెండవ పక్షం నుండి జులై రెండవ పక్షం విత్తుకోవచ్చు.

విత్తన మోతాదు -> సంకర రకాలు వాడితే ఎకరాకు 2-2.5 కిలోల విత్తనం సరిపోతుంది, సూటి రకాల అయితే 3.5-4.0 కిలోల విత్తనం అవసరమగును. 

విత్తే దూరం -> బరువైన నల్లరేగడి నేలల్లో సంకరకాల విత్తనం సాలుకి సాలుకి మధ్య దూరం 90 సెం.మి లేదా 120 సెం.మి మొక్కకి మొక్కకి మధ్య దూరం 60 సెం.మి లేదా 45 సెం.మి ఉండేలా విత్తుకోవాలి. తేలికపాటి ఎర్ర చెలో నేలల్లో సూటి రకాలు వాడితే సాలుకి సాలుకి మధ్య 90 సెం.మి మొక్కకి మొక్కకి మధ్య 45 సెం.మి ఉండేలా చూసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటించడం సరైన కలుపు మరియు తెగుళ్ళు యాజమాన్య పద్ధతులు చెరపడితే వర్షాధార రైతులు గణనీయమైన, దిగుబడులను సాధించవచ్చు.

డి.స్రవంతి, డా.కె.గోపాలకృష్ణమూర్తి, పి.లక్ష్మణ్ రావు, డా.వి.వెంకన్న, డా.యం. మధు సుధాన్ రెడ్డి, డా.కె.నాగంజలి, డా.జి.ప్రియధర్శిని  వ్యవసాయ కళాశాల, అశ్వరావు పేట.     

Leave Your Comments

తొలకరి నువ్వుల సాగు – యాజమాన్యము

Previous article

మొక్కజొన్న కత్తెరపురుగు – సమగ్ర సస్యరక్షణ

Next article

You may also like