అల్లం సాగును వాణిజ్య పంటల తరహాలోనే ప్రోత్సహించడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా సుస్థిర వృద్ధి సాధిస్తారన్న నమ్మకంతో ఐటీడీఏ యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రూ. 4.5 కోట్లతో ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో వెయ్యి ఎకరాల్లో అల్లం సాగు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు.
మన్యంలో ప్రకృతి, సేంద్రియ విధానాల్లో సాగయ్యే వాణిజ్య పంటలకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే కాఫీ, మిరియాలు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. ఐటీడీఏ పరిధిలో కాఫీ, మిరియాలు, పసుపు సాగు విస్తారంగా జరుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సహంతో కాఫీ 1.5 లక్షల ఎకరాలకు విస్తరించగా మిరియాలు 60 వేల ఎకరాలు, పసుపు 15 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. వాణిజ్య పంటల సాగు ద్వారా సగటున ఒక్కో రైతు ఏడాదికి రూ. 60 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం గడిస్తున్నారు. ఇదే తరహాలో అల్లం సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తే వారికి అదనపు ఆదాయం సమకూరుతుందని ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు.
ఏజెన్సీలో పదకొండు మండలాలు ఉండగా తొలుత పాడేరు, హుకుంపేట, జి. మాడుగుల మండలాల్లో అల్లం సాగును వెయ్యి ఎకరాలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాలుగేళ్ళ కాలపరిమితితో రూపొందించిన ఈ ప్రాజెక్టు లో ఏటా 500 ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించారు. విత్తనాలు, యంత్ర పరికరాలను సమకూర్చుకునేందుకు రూ. 4.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. విదేశాల్లో డిమాండ్ ఉన్న వరద్, మహిమ రకం అల్లం సాగుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక్కడి రైతులు పండించిన అల్లానికి ఆర్గానిక్ ధ్రువపత్రం అందించి యూరప్ దేశాలకు ఎగుమతి చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు విశాఖకు చెందిన ఓ కార్పొరేట్ సంస్థతో ఇప్పటికే చర్చలు జరిపారు.
మన్యంలో అల్లం సాగు..
Leave Your Comments