తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో ప్రధానమైన వాణిజ్య పంట. ప్రతి సంవత్సరం ప్రత్తి పంటను అనేక రకాల చీడపీడల వలన దిగుబడులు తగ్గుతున్నాయి. కాని గత 3 సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు ఉధృతి, పంట నష్టం రోజు రోజుకు పెరుగుతుంది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ప్రత్తి సాగు చేస్తున్నారు. గులాబీ రంగు పురుగు తాకిడి వచ్చే పంట కాలంలో తగ్గించడానికి పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
1. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, మార్కెట్ యార్డ్, రైతుల ఇళ్ల వద్ద నిల్వ ఉంచకూడదు. నిలువ చేయటం వల్ల తరువాత పంట కాలంలో దీని ఉధృతి ఎక్కువ అవుతుంది.
2. ప్రత్తి తీసిన తర్వాత ఎండిన మోళ్ళను, విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రత్తి కట్టెను కల్చరాదు.
3. జిన్నింగ్ మిల్లులందు లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగుల ఉధృతిని తగ్గించుకోవాలి.
4. ప్రత్తి కట్టెను రోటవేటర్ లేదా మొబైల్ కాటన్ శ్రేడ్డర్ తో భూమిలో కలియదున్నాలి, తద్వారా నేలకు పోషకాలు అందటమే కాక పురుగు యొక్క కోశస్థదశలను నాశనం చేయవచ్చును. ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకొనుట ద్వారా పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు.
6. రైతులు తమ ప్రాంతానికి అనువైన దీర్ఘ కాలిక సంకర జాతి రకాల గురించి చర్చింకుని ఎంపిక చేసుకోవాలి. దీని వలన పురుగుకు నిరంతర ఆశ్రయం దొరకదు. ప్రాంతమంతా సామూహికంగా విత్తేటట్లు చూసుకోవాలి. వివిధ సమయాల్లో పుష్పించే హైబ్రిడ్లను విత్తుకోకూడదు.
7. ప్రత్తి పంట ప్రక్కన బెండ, తుత్తురు బెండ పంటలు, కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
8. బిటి ప్రత్తిని విత్తేటప్పుడు నాన్ బిటి ప్రత్తిని తప్పని సరిగా వేసుకోవాలి. దీని వలన పురుగు నిరోధక శక్తిని తొందరగా పెంపొందించకుండా నివారిస్తుంది.
9. పంట యొక్క ప్రారంభ దశలో 3 -4 సార్లు మోనోక్రోటోఫాస్ + ఎసిఫేట్ పిచికారీ చేయడం వలన తాజా ఆకు పచ్చ ఆకులు ఎక్కువయ్యి, పంట యొక్క పూత దశ ఆలస్యం అవుతుంది. పూత, కాత ఒకే సమయంలో రాకపోవటం వల్ల పురుగుకి నిరంతర ఆశ్రయం ఉండి పురుగు ఉధృతి పెరుగుతుంది.
ఈ విధంగా ప్రత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణకు ముందస్తు యాజమాన్య పద్ధతులను పాటించటం ద్వారా పురుగు ఉధృతిని సకాలంలో తగ్గించుకోవచ్చు.
ఎ. రమాదేవి, ఎమ్. సునీల్ కుమార్, ఎమ్. రఘువీర్, జి. శివచరణ్, వై.ప్రవీణ్ కుమార్
కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ – 504002