మామిడి:
కాయ కోతలు పూర్తయిన తోటల్లో నీరు పెట్టాలి. తరువాత చెట్లకు విశ్రాంతిని ఇవ్వాలి. విశ్రాంతి అనంతరం చెట్లలో మిగిలిపోయిన పూత కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, గొడుగు కొమ్మలను తీసివేయాలి. కత్తిరింపులు చేశాక వెంటనే కోసిన భాగాలకు బోర్డో పేస్టు లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ పేస్టు పూయాలి. తొలకరి లో ఎకరానికి 10 కిలోలు జీలుగ లేదా 25 కిలోలు జనుము విత్తనాలను మామిడి చెట్ల మధ్య చల్లి 45 – 50 రోజులు తరువాత భూమిలో కలియ దున్నాలి. తరువాత బాగా క్రుళ్ళిన పశువులు ఎరువు. (సుమారు 50 కిలోలు) లేదా 10 కిలోల వర్మీకంపోస్టు ప్రతి చెట్టుకు వేసుకోవాలి. ఎరువులను చెట్టు ప్రధాన కాండం నుండి 1.5 – 2.0 దూరంలో పాదుల్లో వేసుకోవాలి.
అరటి:
పిలకలు నాటడానికి ఎంపిక చేసుకొనే రకాన్ని బట్టి అవసరమైన దూరంలో 45*45*45 సెం.మీ. పొడవు, వెడల్పు మరియు లోతు కలిగిన గుంతలు తీయాలి. వైరస్ తెగుళ్లు సోకని ఆరోగ్యవంతమైన మొక్క తోటల నుండి సూది మొన వంటి ఆకులు కలిగిన పిలకలను ఎంచుకోవాలి. పిలకలు నాటడానికి గుంత నుండి త్రవ్విన మట్టికి 300 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్ఫెట్ మరియు 5 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు చేర్చి బాగా కలపాలి లేదా వర్మీకంపోస్ట్ 2 – 3 కిలోలు కూడా వాడవచ్చు. శుద్ధి చేసిన విత్తనపు పిలకలను చుదును చేసిన నేలలో 5.0 – 7.0 సెం. మీ. లోతు నాటుకోవాలి. పిలకలు నాటిన తరువాత మొదటి దఫా నీటిని కడవలతో పోయాలి. పిలకలు నాటి తడిపిన రెండు లేక మూడు రోజుల తరువాత పిలకలు చుట్టూ గాలి చొరబడకుండ గట్టిగా తొక్కాలి.
జామ:
సిఫార్సు చేసిన ఎరువులను రెండు దఫాలుగా జూన్ మరియు సెప్టెంబర్ మాసాలలో వేయాలి. సిఫార్సు చేసిన ఎరువులలో 50 శాతం యూరియా, 100 శాతం భాస్వరం, 50 శాతం పొటాష్ ఎరువులను జూన్ లో వేయాలి. మిగిలిన 50 శాతం యూరియా, 50 శాతం పొటాష్ ఎరువులను సెప్టెంబర్ లో వేయాలి. రసాయనిక ఎరువులతో పాటు ఒక్కో చెట్టుకు 50 కిలోలు పశువులు ఎరువు లేదా 1.2 కిలోలు వానపాముల ఎరువును వేసుకోవాలి.
చీని, నిమ్మ:
తొలకరి వర్షాలకు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదును చెట్ల పాదుల్లో వేసుకోవాలి. జనుము లేదా పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలకు (6 -8 కిలోల విత్తనము/ ఎకరానికి) చెట్ల మధ్య విత్తుకొని 40 రోజుల తరువాత నేలలో కలియదున్నాలి. ఆకు తినే గొంగళి పురుగు నివారణకు బాసిల్లస్ తురంజెనిసిస్ అనే ఎంటమోపాథోజన్ బాక్టీరియాను ఒక లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి కొనసాగితే ప్రొపెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గజ్జి తెగులు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 300 గ్రా. + స్ట్రెప్టోసైక్లిన్ 60గ్రా. 100 లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
దానిమ్మ:
మొక్కలకు విశ్రాంతి నివ్వాలి. కత్తిరింపులు, ఎరువులు వేయడం పాదులు తొవ్వకం వంటివి చేయరాదు. బాక్టీరియా తెగులు నివారణకు 1 శాతం బోర్డో మిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో 2 – 3 సార్లు పిచికారీ చేయాలి.
ఉసిరి:
తోటల్లో కలుపు లేకుండా అంతర కృషి చేసుకోవాలి. చెట్ల పాదుల్లో కలుపు లేకుండా శుభ్రం చేసి సిఫార్సు చేసిన ఎరువులను వేసి నీరు పెట్టాలి. దశలో ఒక్కొక్క చెట్టుకు 5 కిలోలు పశువుల ఎరువు, 100గ్రా. నత్రజని, 50 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాష్ ను ఇచ్చే ఎరువులు వేసుకోవాలి.
బొప్పాయి:
రసం పీల్చు పురుగులు నివారణ చర్యలు చేపట్టాలి. పిండినల్లి ఉనికిని గమనిస్తే డైమిథోయేట్ 2 మి. లీ. + జిగురు పదార్థం 0.5 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రేగు:
తోటల్లో కలుపు లేకుండా అంతర కృషి చేయాలి. ఏడాది వయస్సు ఉన్న చెట్లకు 10 కిలోలు పశువుల ఎరువుతో పాటు 100 గ్రా. నత్రజని, 50 గ్రా. భాస్వరం, 50 గ్రా. పొటాష్ ఎరువులను ఐదేళ్లు ఆపైన వయస్సు చెట్లకు 60 కిలోల పశువుల ఎరువుతో పాటు 750 గ్రా. నత్రజని 300 గ్రా. భాస్వరం, 300 గ్రా. పొటాష్ ఎరువులను వేసుకోవాలి. పశువుల ఎరువుతో పాటు ఒక్కో మొక్కకు అజటోబాక్టర్ 50 గ్రా. + ఫాస్ఫో బాక్టీరియా 100 గ్రా. వేయాలి. అంతర పంటలుగా వేరుశనగ, పెసర, అలసంద, గోరుచిక్కుడు వంటివి సాగు చేయాలి.
కూరగాయ పంటలు:
వంకాయ:
వంగలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం కాయలను ఇష్టపడతారు ఆయా ప్రాంత మార్కెట్ కు అనుకూలమైన రకాలను ఎంచుకొని సాగు చేయాలి. వంగలో శ్యామల, భాగ్యమతి, గులాబీ, అర్క షీల్, అర్క ఆనంద్ వంటి రకాలు, ఉత్కర్ష, కల్పతరు, పర్పుల్, యు. ఎస్ 172 వంటి హైబ్రిడ్ రకాలు ప్రాచుర్యంలో ఉన్నది.
టమాట:
అర్క వికాస్, పి. కె. ఎం. 1, మారుతం, అర్క అభయ రకాలు
హైబ్రిడ్: అర్క సామ్రాట్, ఆర్క అభేద్, యు.ఎస్. 440, అభిలాష్ అను రకాలు ప్రాచుర్యం లో ఉన్నది.
పచ్చిమిరప:
LCA – 334, LCA – 620, LCA – 625 మరియు ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నవి.
టమాటా, వంగ, మిరప పంటలలో మీ ప్రాంతానికి అనువైన రకాలను ఎంచుకొని పంటల నారును ఎతైన నారుమడి లేదా ప్రో ట్రేలలో పెంచుకోవాలి. కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 8 గ్రా. ట్రైకోడెర్మా విరిడిలో విత్తన శుద్ధి చేయాలి. నారు కుళ్ళు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటికి కలిపి నారుమళ్ళను ముంపుగా తడపాలి. నారమళ్ళలో రసం పీల్చే పురుగుల నివారణకు సెంటు నారుమడికి 100 గ్రా. చొప్పున కార్బో ప్యురాన్ 3 జి గుళికలు వేయాలి.
బెండ, గోరు చిక్కుడు, పొద చిక్కుడు, తీగ చిక్కుడు, బొబ్బర్లు, కాకర, బీర, దోస, పొట్ల, సొర, గుమ్మడి, బూడిద గుమ్మడి పంటలను నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవాలి.
బెండ:
అర్క అనామిక, అర్క నిఖిత, పుసా సవాని
హైబ్రిడ్ రకాలు: వర్ష, రాధికా, ఎం, హెచ్ – 10, 55, సామ్రాట్.
గోరు చిక్కుడు:
పుసా నవబాహర్, పుసా సదాబహర్, గౌరి.
బీర:
అర్క సుజాత, అర్క సుమీత్, అర్క హసన్
హైబ్రిడ్ రకాలు: నాగ, ఆర్తి, మల్లిక, ఎన్. ఎస్ 403
కాకర: పుసా డామౌసామి, కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్
హైబ్రిడ్ రకాలు: అభిషేక్, ఎన్. ఎస్. ఎం -1, ఆర్. ఎన్. ఎన్. ఎం – 3
సొర: అర్క బహర్, పుసా నవీన్
హైబ్రిడ్ రకాలు: వరద్, కావేరి, స్వాతి, రంజా, ప్రతీక్.
గుమ్మడి: అర్క చందన్ , అర్క సూర్యముఖి.
పొట్ల: శ్వేత, పి. కె. ఎం – 1
బూడిద గుమ్మడి: శక్తి
ఏక వార్షిక మునగ: మునగ విత్తనాలను పాలిథీన్ సంచులలో పెంచుకోవాలి. వర్షాకాలంలో మురుగు నీరు సౌకర్యం లేని నేలల్లో వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా పంటను ఆశించి నష్టం కలుగజేస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి చెట్టు విరిగి పడిపోతుంది. వేర్లు కూడా కుళ్ళి చెట్టు చనిపోతుంది. నివారణకు మొక్కల మొదలు దగ్గర 1గ్రా. కార్బడిజం లీటరు నీటికి కలిపిన ద్రావణం లేదా 1 శాతం బోర్డో మిశ్రమంతో ముంపు గా తడపాలి. మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి చెట్టు మొదలులో ట్రైకో డెర్మా విరిడి (2 కిలోలు/ ఎకరానికి) కలిపినా పశువుల ఎరువును 5 కిలోలు చొప్పున వేయాలి.
ఉల్లి: ఉల్లి పంటను నారుపోసి నాటుకోవాలి. బళ్ళారి రెడ్, అరిఫాడ్, డార్క్ రెడ్, అర్క నికేతన్, అర్క ప్రగతి రకాలు అధిక దిగుబడిని ఇస్తాయి. ఉల్లి సాగు చేసే పొలంలో ఆఖరు దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 250 కిలోలు వేపపిండి, 20 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 12 కిలోలు పొటాష్ ఇచ్చే ఎరువులు వేయాలి.
కనకాంబరం: కనకాంబరంలో ఆరెంజ్ రకం మంచి దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 800 – 1000 గ్రా. విత్తనంలో నారు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు + 45 కిలోలు నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోలు పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి.
బంతిపూలు: బంతిలో పుసా నారంగి గైండా పుసా బసంతి, ఎం, డి. యు – 1 రకాలు ప్రాచుర్యంలో ఉన్నవి. ఎకరానికి 400 – 500 గ్రా. విత్తనంతో నారు వేసుకోవాలి.ఆఖరి దుక్కిలో ఎకరానికి 15 టన్నులు పశువుల ఎరువు, 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 24 కిలోలు పొటాష్ ఎరువులను వేయాలి.
డా॥ ఎమ్.వెంకటేశ్వర రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హర్టీకల్చర్,
డా॥ ఎ.నిర్మల అసిస్టెంట్ ప్రొఫెసర్
కె. చైతన్య అసిస్టెంట్ ప్రొఫెసర్
డా॥ ఎ.మనోహర్ రావు సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెడ్,
రాజేంద్రనగర్, హైదరాబాద్, Phone: 9491151524