ఉద్యానశోభ

అశ్వగంధ సాగు విధానం..

0

అశ్వగంధ పెన్నేరు గడ్డలు, డొమ్మడోలు అని అంటారు. అశ్వగంధ నిటారుగా పెరిగే మొక్క. ఆకులు అండాకారంగా, పువ్వులు తెల్లగా ఉంటాయి. పండ్లు గుండ్రంగా ఉండి పండినప్పుడు ఎరుపు రంగుకు మారతాయి. వేర్లు 10 సెం. మీ. నుండి 15 సెం.మీ. పొడవు మరియు 0.5 – 1.5 సెం.మీ. , మందం కలిగి ఉంటాయి. వేర్లు పసుపుతో కూడిన తెలుపు రంగుతో ఉండి కొంచెం చేదుగా ఉంటాయి. వేర్లు, ఆకులు, పండ్లు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
ఔషధ గుణాలు:
వేర్లు బలానికి, వాపులకు, కీళ్ల నొప్పులకు, అల్సర్స్, అజీర్తి లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారు. ఆకులను జ్వరాలు, ఊబకాయం చికిత్సలో వాడుతున్నారు. కాయలను పశువులలో పుండ్ల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అశ్వగంధ వేర్లలో ఆల్కలాయిడ్స్ మరియు విధానియోల్స్ ఉంటాయి. ఆల్కలాయిడ్స్ లో విధానైన్ మరియు సోమ్నిఫెరిన్ ముఖ్యమైనవి. అశ్వగంధ ఆకులలో లనాఫెలిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అశ్వగంధ వేర్లను ఉపయోగించి చాలా ఔషధాలు తయారుచేస్తారు.
పంట సాగు:
నేలలు: ఇసుక గరప నేలలు లేదా తేలికపాటి ఎర్రనేలలు అనుకూలం. ఉదజని సూచిక 6.5 – 7.5 ఉండాలి.
వాతావరణం:
అశ్వగంధ సాగుకు 28 oC – 38 oC ఉష్ణోగ్రత అవసరం. 10 రకాలు:
oC కన్నా తక్కువ ఉష్ణోగ్రతలను ఈ పంట తట్టుకోలేదు. పొడి వాతావరణం అనుకూలం.
రకాలు:
జవహర్ అశ్వగంధ – 20 అనే రకం మొక్కలు తక్కువ ఎత్తును కలిగి అధిక సాంద్రతలో సాగును చేపట్టుటకు అనుకూలం. ఈ రకం 180 రోజుల పంట. అశ్వగంధ రక్షిత, పోషిత అనే రకాలు కూడా సాగులో ఉన్నాయి.
పంటకాలం:
జులై రెండవ వారంలో విత్తుకోవాలి. అక్టోబర్, నవంబర్ లో నీటి పారుదల క్రింద విత్తనం కొరకు రెండవ పంటగా వేసుకోవచ్చు,
విత్తనమోతాదు :
ఎకరాకు 7 – 8 కిలోల విత్తనాన్ని 5 రేట్లు ఇసుకతో కలిపి వెదజల్లాలి. నారు పెంచి నాటుకుంటే 2 కిలోల విత్తనం సరిపోతుంది.
నాటే దూరం:
మొక్కకు మొక్కకు మధ్య 7 – 10 సెం. మీ. వరుసకు వరుసకు మధ్య 25 – 30 సెం. మీ. దూరంలో నాటుకోవచ్చు.
ఎరువులు:
ఎకరాకు 4 – 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
అంతరకృషి :
నేరుగా విత్తినప్పుడు 20 – 25 రోజుల తరువాత మొక్కలు పలుచన చేయాలి. మరియు నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు కలుపు తీయాలి.
సస్య రక్షణ:
అశ్వగంధ విత్తనపు కుళ్ళు, మొక్క మరియు ఆకు ఎండు తెగుళ్లు రాకుండా కాప్టాన్ లేదా డైథెన్ ఎమ్- 45 తో విత్తన శుద్ధి చేయాలి.
కోత మరియు దిగుబడి:
జనవరి నుండి మార్చి వరకు కోతకు వస్తుంది. వేర్లలో పీచు తయారు కాక ముందే సేకరించుకోవాలి. వేర్లను త్రవ్వి, మట్టిని శుభ్రం చేసి 7 – 10 సెం. మీ. పొడవు ఉండేలా కత్తిరించి ఎండలో ఆరబెట్టాలి. ఎకరాకు 250 – 300 కిలోల ఎండు వేర్లు, 30 కిలోల విత్తనం వస్తుంది. కోత అనంతరం వేరు ముక్కలను కత్తిరించి కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎండిన తరువాత ప్రక్కన ఉన్న పిల్ల వేర్లను మరియు వేరుపై భాగాన ఉన్న కాండపు మొదలును కత్తిరించాలి. బాగా ఎండిన వేరు ముక్కలను వాటి మందం అనుసరించి గ్రేడింగ్ చేసిన తరువాత గోనె సంచులలో గాని అల్లిన సంచులలో గాని ప్యాక్ చేసి నిలువచేయాలి.

డా. ఎ. నిర్మల,  డా. ఎమ్. వెంకటేశ్వరరెడ్డి,  డా. ఎమ్. విజయలక్ష్మీ ,  కె. చైతన్య

ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్.

Leave Your Comments

పాల జ్వరం / మిల్క్ ఫీవర్/ పాక్షిక లేదా అసంపూర్ణ ప్రసవ పక్షవాతం..

Previous article

సేంద్రియ ఎరువుల వినియోగంపెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like