పంటలను ఆశించు చీడపురుగులను మరియు తెగుళ్ళను అరికట్టుటకు రైతులు క్రిమిసంహారక మందులను విచక్షణారహితంగా వాడుతున్నారు. దీనివలన వాతావరణ కాలుష్యం, మిత్ర పురుగుల నాశనము, కొన్ని పురుగుల నిరోధక శక్తి పెరగటము మరియు పురుగుల పునరుత్థానము (రిసర్జెన్స్) జరుగుతుంది.
పంటలలో కనపడే పురుగులు మరియు తెగుళ్ళ యొక్క లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయలేకపోవటం వాళ్ళ సరైన యాజమాన్య పద్ధతి చేపట్టలేకపోతున్నారు. ఇలాంటి అనేక దుష్ఫలితాలను తగ్గించుటకు మనకు అందుబాటులో ఉన్న మొబైల్ యప్ప్స్ రైతులకు, వ్యవసాయ అధికారులకు, పురుగు మందుల వ్యాపారులకు ఉపయోగపడతాయి. మొబైల్ అనువర్తనాలను అనుసరించడం వలన సమస్యను సులభంగా గుర్తించడానికి తోడ్పడ్తుంది.
మొబైల్ రైస్ ఐ.పి.యం యాప్ (Rice IPM app):
మన రాష్ట్రంలో వరి ప్రధానమైన ఆహార పంట. వరిని రైతులు ఖరీఫ్ మరియు రబీ పంట కాలాలలో, వివిధ వాతావరణ పరిస్థితులలో సాగు చేస్తున్నారు. నారుమడి నుండి కోత దశ వరకు వరి పంటను అనేక రకాలైన చీడ పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మొక్కలు ఆశించి 20-60% వరకు దిగుబడిని తగ్గిస్తున్నాయి.
రైతులకు వరిని ఆశించు ప్రధానమైన చీడపురుగులు, తెగుళ్ళు, కలుపుమొక్కల గురించి తెలియజేయుటకు మరియు యాజమాన్య పద్థతుల గురించి విశదీకరించుటకు వరి పరిశోధన సంస్థ శాస్త్రజ్ఞుల అనుభవాల నుండి ఈ యాప్ తయారుచేయబడినది. దీనిని సులభముగా మొబైల్ లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మరియు ఎప్పుడు మనతో పాటు ఉండి సులభమైన సమగ్ర సస్యరక్షణ పద్థతులను సూచించు మార్గదర్శి మరియు రైతు సోదరులకు ఎంతో ఉపయోగకరం.
Android Mobile Link: https://play.google.com/store/apps/details?id=org.iirr.varipirusasyarakshana&hl=en
సి.ఐ.సి.ఆర్ పత్తి యాప్ (CICR Cotton app)
నాగ్‌పూర్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ (సి.ఐ.సి.ఆర్) రైతుల కోసం ఆండ్రాయిడ్ ఆధారిత యాప్‌ను ‘సిఐసిఆర్ కాటన్ యాప్’ అని అభివృద్ధి చేసింది. పురుగులను నియంత్రించడానికి, రసాయన మందులు విచక్షణా రహితంగా ఉపయోగించడం వలన పంట దిగుబడి తక్కువ కావడమే కాకుండా, పురుగు ఉధృతి ప్రారంభంలో తగ్గిన తర్వాత ఉధృతి రెట్టింపు అవుతుంది. దీనివలన పంట అధిక నష్టానికి గురి అవుతుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రత్తిలో వచ్చే చీడపీడలు, పంట నష్టం కలుగజేసే విధానం మరియు వీటిని గుర్తుపట్టేందుకు చిత్రాలతో పాటు వివిధ యాజమాన్య పద్దతుల గురించి శాస్త్రవేత్తలు ఈ యాప్ లో పొందుపరిచారు. అంతే కాకుండా ఇందులో పత్తి విత్తనాలు, రకాలు, సంకరజాతులు, సాగు విధానం మరియు ఉత్పత్తి పద్ధతుల గురించి కూడా సమాచారం ఉంది. మార్కెట్ ధరలు మరియు సాగు పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి కూడా రైతులు ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు.
Android Mobile Link: https://play.google.com/store/apps/details?id=cicr.com.cicr.cicrcottonapp&hl=en_IN
కంది ఐ.పి.యం యాప్ (Pigeonpea – IPM)
కంది పంటను ఆశించే పురుగులు, తెగుళ్ళు మరియు నష్టపరిచిన చిత్రాలు కంది ఐ.పి.యం యాప్ సమాచారం అందిస్తుంది. చీడపీడల ఉధృతిని నమూనా వేసే పద్ధతి, పంట దశ (పంట క్యాలెండర్ ఆధారిత) ఆధారంగా యాజమాన్య పద్దతులను ఎంపిక చేసుకోవచ్చు.
పురుగు మరియు శిలీంద్ర మందు కాలిక్యులేటర్‌కు లింక్‌ను కలిగి ఉంటాయి, దీని ద్వార పురుగు మరియు తెగుళ్ల మందులకు సిఫార్సు చేసిన మోతాదు, వాడే పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొందుపరచడం జరిగింది.
Android Mobile Link: https://play.google.com/store/apps/details?id=nic.pigeonpea_ipm&hl=en_IN
వేరుశనగ ఐ.పీ.ఎం మొబైల్ యాప్ (Groundnut IPM app)
నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, న్యూఢిల్లీ వారు అభివృద్ధి చేసిన వేరుశనగ ఏపీఎం మొబైల్ యాప్ వ్యవసాయ అధికారులకు, పురుగు మందుల వ్యాపారులకు మరియు రైతులకు వేరుశనగ లో వచ్చే చీడపీడలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్ లో చీడపీడలు మరియు తెగుళ్ళకు సంబంధించిన చిత్రాలు అందుబాటులో ఉంటాయి. పంట యొక్క ఎదుగుదల దశను బట్టి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు మరియు పురుగు తెగుళ్ళకు సంబంధించిన మందులు ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలుసుకోవచ్చు.
Android Mobile Link: https://play.google.com/store/apps/details?id=nic.groundnut_ipm&hl=en_IN
కత్తెర పురుగు ఐ.పి.యం యాప్ (Faw_IPM)
కత్తెర పురుగు యొక్క జీవిత చక్రం, వివిధ దశల చిత్రాలు మరియు నష్టపరిచే విధానం, లింగాకర్షక బుట్టల ద్వార పురుగు స్థాయి ని నిఘా చేసుకునే పద్ధతి దీనిలో పొందుపరిచారు. పురుగు నష్ట పరిమితి స్థాయిని ఆంచనా వేసుకునే విధానం మరియు పురుగు యొక్క వివిధ దశలను బట్టి చేపట్టాల్సిన సేద్య పద్ధతులు, జీవనియంత్రణ, భౌతిక మరియు రసాయన పద్ధతులు క్లుప్తంగా ఇవ్వటం జరిగినది. జీవరసాయనలు మరియు పురుగు మందుల వాడకం, సిఫార్సు చేయబడిన మోతాదులు దీంట్లో అమర్చారు. ఈ యాప్ మొక్కజొన్న పండించే రైతులకు, విస్తరణ అధికారులకు, పురుగు మందుల డీలర్లకు మరియు కృషి విజ్ఞాన కేంద్ర విషయ నిపుణులకు ఉపయోగపడుతుంది.
Android Mobile Link: https://play.google.com/store/apps/details?id=com.FawIPM.Faw_IPM&hl=en_IN
టమాటా ఐ.పి.యం యాప్ (Tomato IPM app):
ఐ.సి.ఎ.ఆర్, నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, న్యూఢిల్లీ (యన్. సి. ఐ.పీ. ఎం) వారు టమాటా పంటకు సంబంధించిన ఐ.పి.యం మొబైల్ యాప్ లని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా టమాటా పంటలో వివిధ దశల్లో వచ్చే పురుగులు, తెగుళ్ళు మరియు వాటిని అరికట్టడానికి తిసుకోవల్సాసిన జాగ్రతల గురించి పొందుపరిచారు. ఈ మొబైల్ యాప్ రైతులకు, వ్యవసాయ అధికారులకు మరియు పురుగుమందుల డీలర్లకు ఉపయోగపడుతుంది. టమాట పంటను ఆశించే కీటకాల దశలు, వాటిని గుర్తుపట్టే విధానం, తెగుళ్ళు లక్షణాల యొక్క చిత్రలను అందిస్తుంది. వాటి ఉధృతిని అంచనా వేసే పద్దతి. పంట దశ (పంట క్యాలెండర్ ఆధారిత) ఆధారంగా యాజమాన్య పద్ధతులను అందిస్తుంది. పురుగుమందు మరియు శిలీంధ్ర నాశిని మోతాదు కాలిక్యులేటర్‌కు లింక్‌ను కలిగి ఉంటాయి
Android Mobile Link: https://play.google.com/store/apps/details?id=nic.tomato_ipm&hl=en
ప్లాంటిక్స్ ( Plantix)
మొక్కలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు నిర్ధారణ మరియు పర్యవేక్షణ కోసం ప్లాంటిక్స్ అనే మొబైల్ యాప్ అభివృద్ధి చేయడం జరిగింది ఈ యాప్ మొక్కలకు సంబంధించిన చీడపీడలు వ్యాధులు మరియు పోషక లోపాలను గుర్తించి వాటిని నివారించడానికి తీసుకోవలసిన చర్యలను సూచిస్తుంది ముందుగా వ్యాధిగ్రస్తమైన మొక్క భాగాన్ని ప్లాంటిక్స్ యాప్ కెమెరాను ఉపయోగించి ఫోటో తీసినప్పుడు వ్యాధి లక్షణాలు గుర్తించి దానికి సంబంధించిన సమాచారం మరియు నివారణ చర్యలను అందిస్తుంది అంతేకాకుండా ఈ అప్ లో వివిధ పంటలకు సంబంధించిన యాజమాన్య పద్ధతులు మరియు సంబంధిత సమాచారం కూడా అందుబాటులో ఉన్నాయి.
Android Mobile Link: https://play.google.com/store/apps/details?id=com.peat.GartenBank&hl=en_IN
పురుగు మరియు తెగుళ్ల మందుల కాలిక్యులేటర్లు (Insecticide Fungicide Calculator)
ఐ.సి.ఎ.ఆర్, నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, న్యూఢిల్లీ (యన్. సి.ఐ. పీ. ఎం) వారు 12 ప్రధాన పంటలైన వరి, ప్రత్తి, కంది, వేరుశనగ, టమాటా,చిక్కుడు, మిరప, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు వివిధ నివారణకు ఉపయోగించే పురుగు మరియు తెగుళ్ల మందులకు సిఫార్సు చేసిన మోతాదు, వాడే పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొందుపరచడం జరిగింది.
పెస్ట్ ప్రేడిక్ట్ ఆప్ (Pest Predict)
ఐ.సి.ఎ.ఆర్, నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, న్యూఢిల్లీ (యన్. సి.ఐ. పీ. ఎం) వారు అభివృద్ధి చేసిన పెస్ట్ ప్రేడిక్ట్ ఆప్ శాస్త్రవేత్తలకు విస్తరణ అధికారులకు మరియు రైతులకు నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన చీడపీడలు గురించి ముందస్తు హెచ్చరికలు అందించడంలో తోడ్పడుతుంది. వాతావరణ హెచ్చరికలను ఆధారంగా చేసుకొని సమగ్ర సస్యరక్షణ పద్ధతుల పాటించడం ద్వారా చీడపీడలు మరియు తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టవచ్చు.
ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన వాతావరణ వివరాలను యాప్ లో నమోదు చేయడం ద్వారా ఆ ప్రాంతాలలో వచ్చే చీడపీడలు మరియు తెగుళ్ల యొక్క ముందస్తు సమాచారాన్ని అంచనా వేయవచ్చు, దీనిద్వారా సమయానుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టి వ్యాప్తిని అరికట్టవచ్చు.
Android Mobile Link: https://play.google.com/store/apps/details?id=nic.pestpredict_rbsvol2&hl=en_US
డా. ఎ. రమాదేవి, డా. యం. సునీల్ కుమార్ , డా. జి. శివ చరణ్,
డా. యం. రఘు వీర్, డా. వై. ప్రవీణ్ కుమార్ మరియు కె. మమత
కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్.