ఉద్యానశోభ

వేసవిలో పంట పొలాల యాజమాన్యం..

0

మంచి దిగుబడులు సాధించాలoటే అందుకు కీలకపాత్ర పోషించేది పంట రకాలు, పంట యాజమాన్యం, అనుకూల వాతావరణ స్థితితో పాటు నేలలోని సారం కాగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాలలో వివిధ పంటల నుంచి అధిక దిగుబడులు సాధించే లక్ష్యముతో రైతులు విరివిగా రసాయన ఎరువులను వాడుట వలన పంటపొలాల సహజస్థితి కోల్పోయి క్రమేణా నిస్సారముగా మారడంతో పాటుగా నేలలోని సేంద్రియ కర్బనo తగ్గుట, ఆమ్ల లేదా క్షార నేలలుగా మారుట, నేలలోని ఉపయోగకరమయిన సూక్ష్మజీవులు తగ్గుట వంటి సమస్యలకు దారి తీస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించుటకు రైతులు వేసవిలో పంట పొలాలలో కొన్ని యాజమాన్య చర్యలు పాటించాలి.
1.పంట అవశేషాలు మరియు వ్యర్ధాల యాజమాన్యo
రబీ పంట కాలములో వేసిన పంట లేదా క్రితపు పంట అవశేషాలను పొలములో వదిలేయుట వలన ఆయా పంటలలో ఆశించిన పురుగుల కోశస్థ దశలు(ఉదాహరణకు గులాబీ రంగు పురుగు) తెగుళ్ళను వ్యాప్తి చేయు శిలీంధ్రాలు పంట అవశేషాలపై వుండి తరువాతి పంటలకు వ్యాప్తి అగుటకు అవకాశం ఉంటుంది కావున పంట కోతల అనంతరం అవశేషాలను రోటవేటర్ లేదా ష్రడ్డర్ సాయముతో నేలలో కలియదున్నడం, పంట పొలాల నుంచి తొలగించి కుళ్ళ బెట్టుకొని సేంద్రియ ఎరువులుగా మార్చుకొనుట వంటి చర్యలను చెప్పట్టాలి.
వరి పంట అవశేషాలను నేలలో కలియదున్నడం వలన దీర్ఘకాలములో నేల సేంద్రియ కర్భనం 14-27 శాతం పెరిగే అవకాశం ఉన్నది మరియు జింక్ , కాపర్ , ఇనుము, మాoగనీస్ వంటి సుక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది.
ప్రత్తి పంట అవశేషాలను నేలలో కలియదున్నడం వలన సేంద్రియ కర్భనం పెరుగుటతో పాటుగా మేలు చేసే సూక్ష్మజీవుల క్రియాశీలత పెరుగుతున్నది, తేమను నిలుపుకునే సామర్ధ్యం మెరుగవుతుంది, బెట్ట పరిస్థితిని సైతం పైరు తట్టుకోగలుగుతుంది, సూక్ష్మపోషక లోపాలు తగ్గుతాయి.
ఎట్టి పరిస్థితిలో కూడా పంట అవశేషాలను పంట పొలాలలో తగలబెట్టుట వంటివి చేయరాదు, ఈ విధముగా చేయుటవలన నేలపై పొరలు దెబ్బతినుట, నేలలోని సారము తగ్గిపోవడముతో పాటుగా నేలలు నిస్సారంగా మారుటకు అవకాశముంది.
2.వేసవి లోతుదుక్కులు చేపట్టుట
తొలకరి వర్షాలకు సాలు దుక్కులు, ఇరువాలు దుక్కులు చేయుట సాధారణం కాని ఈ పరిస్థితికి భిన్నముగా ఏప్రిల్- మే నెలలలో డిస్క్ లేదా మౌల్డ్ బోర్డ్ నాగలి ఉపయోగించి, వాలుకి అడ్డుగా 30 -40 సెo.మీ ల లోతుగా ఒకటి లేదా రెండు సార్లు 15-20 రోజుల వ్యవధిలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేపట్టుటవలన వివిధ లాభాలు చేకూరుతాయి.
నేలల పైన తాత్కాలికముగా ఏర్పడిన గట్టి పొరలు తొలగిపోతాయి.
భూమిలోనికి నీరు ఇంకు సామర్ధ్యం, నీటిని నిలుపుకునే సామర్ధ్యం పెరుగుతుంది.
నేలలు గుల్లబారి, భూసారo పెంపొందుతుంది.
పొలములో ఉన్న కలుపు మొక్కల విత్తనాలు, దుంపలు వేసవి అధిక వేడికి చనిపోతాయి.
నిద్రావస్థలో ఉన్న పురుగుల కోశస్థ దశలు తొలిగిపోతాయి, చీడపీడల సమస్య తగ్గుతుంది.
పంట పొలాలలోని సేంద్రియ కర్బనశాతం పెంపొందుతుంది.
3.భూసార పరీక్షలు చేపట్టుట
ఫైరుకు కావలసిన పోషకాలు కొంతమేర నేలలు సహజంగా కలిగి ఉంటాయి, ఆయా ఎరువులు ఎంత మోతాదులో పంటలకు అదే స్థితిలో ఉన్నాయి అనే విషయాన్ని నిర్ధారణ చేసుకొనుటకు, రాబోవు పంట కాలాలలో సమతుల్య ఎరువుల యాజమాన్యం చేపట్టుటకు భూసార పరిక్షలు చేయుట విధి. వేసవిలో పంట కోతల అనంతరం భూసార పరీక్షలు చేపట్టుటకు అనువైన సమయం.
భూసార పరీక్షలకు మట్టినమునాల సేకరణ:
ఒక ఎకరా పొలములో 8-10 చోట్ల మట్టినమునా సేకరించాలి, V ఆకారములో 15 సెo.మీ లోతుగా గుంటనుతీసి, అందులో పైపొర నుంచి కింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి.
సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్లు, మొదళ్ళు, లేనట్లుగా చూసుకొని, నీడలో ఆరనివ్వాలి, ఆరిన తర్వాత మట్టిని బాగా కలిపి, 4 బాగాలుగా చేసి, ఎదుటి బాగాలను తీసుకొని, మిగతా భాగాలను తీసివేయాలి, ఈ విధముగా మట్టి అరకిలో వచ్చే వరకు చేయాలి.
పండ్ల తోటలకు అనువయిన నేలను ఎంపిక చేసుకొనుటకు పరీక్ష చేయదలచినట్లయితే, పంటను బట్టి 3-6 అడుగుల లోతు గుంటను త్రవ్వి ప్రతి అడుగుకు మట్టినమునా సేకరించి పరీక్షకు పంపాలి.
పంట పొలాల గట్లవద్ద, చెట్ల నీడలో, కాలి బాటలలో, ఎరువు కుప్పల వద్ద, తడినేల ఉన్నప్పుడు లేదా పల్లంగా వుండి నీరు నిలబడే ప్రాంతములో మట్టి నమునాలను సేకరించరాదు.
చవుడు భూములు ఉన్న ప్రాంతాలలో వేరుగా మట్టి నమునాలను సేకరించి, చవుడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి.
సేకరించిన మట్టిని శుభ్రమయిన పాలిథీన్ సంచిలోవేసి, రైతులు వివరాలు (రైతు పేరు, గ్రామం, మండలము, గత 2-3 సంవత్సరములు వేసిన పంట వివరాలు, రాబోవు పంట కాలానికి వేయదలచిన పంటలు) తో పాటుగా కావలసిన పరీక్ష (భూసార/ చవుడు/పండ్ల తోట ఎంపిక) జోడించి, భూసార పరీక్ష కేంద్రాలకు పరీక్షకు పంపవచ్చు.
4.సమస్యాత్మక భూముల యాజమాన్యo
నేలలోని సహజ మార్పులతో పాటుగా మోతాదుకు మించిన రసాయన ఎరువులు వాడుట, సరిగా దుక్కి చేయకపోవుట, పంటమార్పిడి నేలలోని లవణాలు అసమతుల్యతకు గురి అయ్యి ఉదజని సూచికలో అసమతుల్యత, మార్పిడిచెంది సోడియం శాతంలో వ్యత్యాసం మరియు నేలలోని లవణాల శాతములో హెచ్చు తగ్గులు ఏర్పడి నేలలు ఆమ్ల, క్షార చౌడు, పాల చౌడు నేలలుగా ఏర్పడుతుంటాయి.
ముఖ్యంగా గమనించినట్లయితే వేసవిలో నేలలోని తేమ ఆవిరి అగుట వలన లవణాలు బయటికివచ్చి పొరల ఏర్పడుతుంటాయి
ఈ సమస్యల నుంచి నేలలోని పై పొరలను తొలగించుట, పంట పొలాలను చిన్న భాగాలుగా విభజించి 1-2 రోజులు నీటిని నిలకట్టి బయటికి తీసివేయాలి, ఈ ప్రక్రియను రెండు లేదా మూడు సార్లు చేయటవలన నేలలోని లవణాల శాతము తగ్గుతుంది.
మే నెలలోని వర్షాలను పచ్చిరొట్ట పంటలసాగు (క్రింద తెలుపబడినది) వలన నేలలోని సేంద్రియ కర్భనం పెరుగుతుంది.
5. సేంద్రియ ఎరువులు వేయుట
మే మాసములో ఒక-రెండు వేసవి జల్లులు వర్షము కురిసిన అనంతరం బాగా చివికిన పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, వర్మి కoపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను పొలములో వేసి దుక్కి చేయుట వలన నేలలలో సేంద్రియ కర్భనం పెరుగుతుంది.
కొన్ని ప్రాంతాలలో పశువులు (గొర్రెలు, మేకలు, ఆవులు) లతో మంద కట్టించుట వలన వాటి వ్యర్ధాలు పంట పొలానికి చేరి అవి చివికిన తరువాత పొలానికి కొంతమేరకు సేంద్రియ పదార్ధం అందుతుంది.
6.పచ్చిరొట్ట పైరుల సాగు
నేటి వ్యవసాయ విధానములో సేంద్రియ లేదా పశువుల ఎరువుల వాడకము అనేది కష్టతమయిన చర్య కావున రైతులు నేల ఫలతను పెంచి భూసారమును పెంపొందించే చర్యగా పచ్చి రొట్ట పంటలను సాగుచేసి భూమిలో కలియ దున్నాలి.
జనుము, జీలుగ, పిల్లిపెసర, పెసర మరియు అలసంద వంటి పంటలను వేసవిలో పండించి భూమిలో కలియదున్నుట వలన భూసారం పెరుగుటతో పాటుగా సేంద్రియ కార్బన శాతం పెరుగుతుంది, నేలల భౌతిక స్వరూపం మారుతుంది, భూమి గుల్లబారుతుంది, కలుపు సమస్య తగ్గుతుంది, భూమి కోతకు గురికాకుండా కాపాడుతాయి.
పంటల వారీగా పచ్చిరొట్టలో లభించు పోషకాల వివరములు

పంటల వారీగా పచ్చి రొట్టలో లభించు పోషకాల వివరములు
క్రమ

సంఖ్య

పంట ఒక ఎకరాకు లభించు

పచ్చిరొట్ట  (టన్నులు)

ఒక టన్ను పచ్చి రొట్ట పంటలో లభించు పోషకాలు (కిలోలు)
నత్రజని భాస్వరం పోటాష్
1. జీలుగ 6-8 6-6.5 1.5 2.0
2. జనుము 5-6 7.5 1.0 5.5
3. పిల్లిపెసర 2-3 15-18 2-3 10-15
4. మినుము / పెసర 3-4 7-7.5 2.0 5.0
5. అలసంద 5-6 42.0 9.0 30.0

ఎకరాకు 10-12 కిలోల పచ్చి రొట్ట పంట విత్తనాలను, వీటిని దుక్కి చేసుకొని పొలములో చల్లుకోవాలి, వేసవిలో లేదా తొలకరి వర్షాలకు అందే తేమ వలన మొక్కలు ఏపుగా పెరుగుతాయి, లేదా నీటి వసతి కింద ఉన్నచొ 1 లేదా 2 సార్లు తేలికపాటి తడులు ఇవ్వాలి.
దాదాపుగా 45 రోజుల పంటలను నేలలోనికి కలియదున్నాలి లేదంటే కాండం గట్టిపడి పంట త్వరగా నేలలో కలవదు. దున్నే సమయములో ఎకరాకు 50 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసుకొనుట వలన పచ్చి రొట్ట త్వరగా కుళ్ళుతుంది, పంటకు కావలసిన పోషకాలు త్వరగా అందుతాయి.
నేలలో పచ్చిరొట్ట మురిగడానికి సరిపడా తేమ ఉండాలి లేదంటే నీటి తడిని ఇవ్వాలి.
పచ్చి రొట్ట పంటలను నేలలోనికి కలియదున్నిన వెంటనే రైతులు ఖరీఫ్ పంటలను విత్తుతారు, ఇది మంచి పద్ధతి కాదు, కనీసం 7-10 రోజులు పచ్చిరొట్ట మురిగిన తరువాత మాత్రమే పంటలను విత్తాలి.
6.పంట పొలాలు చదునుచేయుట, గట్లు మరియు నీటికాలువలు శుభ్రపరుచుట
ప్రస్తుత వ్యవసాయములో గట్ల వెంట కలుపు, ఇతర మొక్కలు పెరుగుట వలన వానిపై వివిధ రకాల చీడ పీడలు చేరి వాటి సంతతిని ఉత్పత్తి చేసుకొని, తరువాతి పంట కాలములో పొలములో వేసిన పంటలను నష్టపరుచుటకు అవకాశం ఉన్నది కావున రైతులు పొలం గట్లను శుభ్రపరుచుకోవాలి.
ఎలుకల బెడద అనేది నేటి కాలములో అధికముగా కనిపిస్తున్న సమస్య, ఎలుకల పొలం గట్ల వెంబడి బొరియలు చేసుకొని వానిలో నివసిస్తుoటాయి, వేసవి యాజమాన్యముగా ఎలుకల కలుగులను గుర్తించి ధ్వంసం చేసుకోవాలి.
పంట పొలాలలో నీటి యాజమాన్యం ప్రధానమైన అంశము, వేసవి యాజమాన్యముగా నీటి కాలువల వెంబడి ఉన్న కలుపు మొక్కలు, కాలువలలో పూడిక తీసివేసి పంట పొలాల చుట్టూ పటిష్టమైన గట్లుతో పాటుగా వసతిగా నీటికాలువలు ఏర్పాటు చేసుకొనవలెను
కావున రైతులు వారి పొలాలను సజీవముగా ఉంచుతూ, అధిక దిగుబడులను సాధించుటకు పైన తెలిపిన మేలైన వేసవి యాజమాన్యo చర్యలు చేపట్టాలి.
                                                                                 డా.పి.వెంకట రావు, ప్రధాన శాస్త్రవేత్త,
                                                                               ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,
                                       ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాo, గుంటూరు.

Leave Your Comments

కోట్లు ఇస్తామన్నా వద్దని విమానాశ్రయం దగ్గర వ్యవసాయం చేస్తున్న జపాన్ రైతు..

Previous article

కృత్రిమ కాంతితో అన్ సీజన్ లో చామంతి పూల సాగు..

Next article

You may also like