ఈ నెల పంట

రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం.. పచ్చిరొట్ట పైర్లు

0

అధిక దిగుబడులు సాధించాలన్న ఆత్రుత రైతులను రసాయన ఎరువులపైపు అడుగులేయిస్తున్నది. ఫలితంగా ఆహార పంటలు కలుషితం అవుతున్నాయి. భూసారం దెబ్బతింటున్నది. క్రమంగా పంటల్లో సూక్ష్మ, స్థూల పోషకాలు లోపిస్తున్నాయి. చీడపీడల ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులకు పచ్చిరొట్ట ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.
రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన పచ్చిరొట్ట ఎరువులపై దృష్టిపెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పచ్చిరొట్టతో పంటలకు అవసరమయ్యే ఎన్ పీకే ఎరువు సహజంగా దొరుకుతుంది. వరితోపాటు ఏ ఇతర పంటలు సాగు చేసినా ఎక్కువగా యూరియా, ఎన్ పీకే ఎరువులనే ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో పచ్చిరొట్టను సాగు చేయడం వల్ల పొలాల్లో సహజంగానే ఈ ఎరువులు ఉత్పత్తి అవుతాయి. భూసారం పెరగడంతోపాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. దిగుబడి కూడా అధికం అవుతుంది. పదహారు రకాల పచ్చిరొట్ట ఎరువులను వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జీలుగ, అవిసె, జనుము, వెంపల్లి, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, గోరు చిక్కుడు, అజొల్లా, కానుగ, వేప, గ్లైరిసిడియా, జిల్లేడు, నేతల తంగేడు, కొండ మిరప మొక్కల ఆకులు సహజ సిద్దమైన ఎరువులుగా ఉపయోగపడనున్నాయి.
జీలుగ:
ఈ రకం పచ్చిరొట్ట మొక్కలను చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో వేసుకోవచ్చు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. మొక్కలు పెరిగి, పూత దశకు వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని అదే పొలంలో కలియదున్ని, మురుగ పెట్టినట్లయితే 30 నుంచి 32 కిలోల యూరియా లభిస్తుంది. ఈ మొక్కలు పెంచడం వల్ల పొలంలో వేయాల్సిన యూరియా కన్నా 30 నుంచి 32 కిలోలు తక్కువగా వేసినా సరిపోతుంది. వీటి ద్వారా 3.5 శాతం నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్ లభిస్తుంది.
జనుము:
ఎకరానికి 9 నుంచి 14 కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది. దీని ద్వారా ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని పొలంలోనే కలియదున్నితే 24 కేజీల యూరియా అందుతుంది. ఇందులోనూ 2.3 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 1.8 శాతం పొటాష్ ఉంటాయి.
పెసర, మినుము:
పెసర, మినుముల పచ్చిరొట్టతో ఎకరానికి 15 నుంచి 20 కిలోల యూరియా అందిస్తుంది. వరి సాగు చేసే పొలాల్లో వీటిని వేసుకోవడం వల్ల అధిక లాభం ఉంటుంది.
అవిసె: అవిసె పంటకు ఎకరానికి 16 కేజీల విత్తనాలు అవసరం అవుతాయి. దీని ద్వారా సుమారు 40 కేజీల నత్రజని ఉత్పత్తి కావడం విశేషం. అదే విధంగా సెస్బానియాను వేయాలనుకుంటే ఎకరానికి 16 కేజీల విత్తనాలు వేసుకోవాలి. దీని ద్వారా ఎకరం పొలానికి 70 కేజీల దాకా నత్రజని లభిస్తుంది. ఇక  అలసంద: అలసంద విషయానికి వస్తే, ఎకరానికి 15 కేజీల విత్తనాలు అవసరం ఉంటుంది. ఈ మొక్కలను పొలంలోనే కలియదున్నితే 60 కేజీల వరకు నత్రజని ఉత్పత్తి అవుతుంది. పిల్లి పెసర ను సాగు చేయాలనుకుంటే ఎకరానికి కేవలం ఆరు కేజీల విత్తనాలు సరిపోతాయి. అయితే దీనిద్వారా ఏకంగా 40 కేజీల నత్రజనిని పొలంలో ఉత్పత్తి చేసుకోవచ్చు.
రెండు రకాలుగా వీటిని సాగు చేస్తారు. ఒకటి జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, పెసర, అలసంద వంటి పైర్ల విత్తనాలను దుక్కిలో వెదజల్లాలి. అవి పెరిగిన తర్వాత 50 శాతం పూత దశలో పొలంలో కలియదున్ని కుళ్ళిన తర్వాత పంటను వేసుకోవాలి. రెండోది వేప, తంగేడు, కానుగ, గ్లైరిసిడియాకు సంబంధించిన మొక్కల ఆకులను, కొమ్మలను సేకరించాలి. వాటిని పొలంలో వేసి కలియదున్ని, మురగనివ్వాలి. ఆ తర్వాత ప్రధాన పంటను వేసుకోవాలి.
సాగు విధానం:
వేసవిలో పంటలు కోయగానే దుక్కి దున్నకోవాలి. తొలకరి వర్షాలు పడగానే పచ్చిరొట్ట విత్తనాలను వేసుకోవాలి. నీటి వసతి ఉంటే వేసవిలోనే సాగు చేయడం లాభదాయకం.
పసుపు, కంది, చెరుకు, వంటి పంటల మధ్య పచ్చిరొట్ట పైర్లను పూత దశలోనే కలియదున్నుకోవాలి.
పచ్చిరొట్ట పైర్లను సాగు చేసేందుకు ఎక్కువ విత్తనాలను చల్లుకోవాలి. ఎందుకంటే తక్కువ విత్తనాలు చల్లితే మొక్కలు పెరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.
ప్రయోజనాలు:
పచ్చిరొట్ట పైర్లను పొలంలోనే కలియదున్నడం వల్ల సూక్ష్మ జీవులు అధికంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా భూసారం పెరుగుతుంది. భూమిని గుల్ల పరిచి నీటి నిల్వ సామర్థ్యం అధికమవుతుంది.
నేలలో లభ్యంకాని రూపంలో ఉండే అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి.
పచ్చిరొట్ట పైర్లు పువ్వు జాతి మొక్కలకు చెందినవి. కాబట్టి గాలిలోని నత్రజనిని పీల్చుకొని స్థిరీకరిస్తాయి. రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని వేళ్ల బొడిపెలలో నిల్వచేసి, ఎకరానికి 25 నుంచి 50 కేజీల నత్రజనిని అందిస్తాయి.
చౌడు భూముల పునరుద్ధరణకు జీలుగ, సీమ జీలుగ మొక్కలు ఎంతో ఉపయోగపడుతాయి.
పచ్చిరొట్టతో భాస్వరం, గంధకం లభ్యత చాలా పెరుగుతుంది.

Leave Your Comments

ఆ కాకరకాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

పండ్లను మగ్గబెట్టేందుకు అందుబాటులోకి.. ఎన్ రైప్ పౌడర్

Next article

You may also like