వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడం వల్ల సత్పలితాలనిస్తోంది. అదనులో కూలీలు దొరకక ఇబ్బందులు పడిన సందర్భంలో ప్రత్యామ్నాయం వైపు సాగిన లాభమే జరుగుతోంది. ఫలితంగా కూలీల ఖర్చు మిగలడమే గాక పంట కూడా దండిగా పండుతుండడంతో రైతాంగం ఈ సాగు వైపు ఆసక్తి చూపుతోంది. పొలాల్లో నాట్లు వేయడం ఇప్పుడు పాత తరానికి పరిమితమైంది.
ఇప్పుడు ఈ తరం మహిళలెవరూ నాట్లు వేయడం నేర్చుకోవడం లేదు. దీంతో వరి సాగు చేస్తున్న రైతులకు నాటు కూళ్ళు తడిసి మోపెడవుతున్నాయి. ఇదే కాకుండా సకాలంలో నాట్లు పడకపోవడంతో దిగుబడిపై ప్రభావంపడుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో కొన్ని జిల్లాల్లో వెదజల్లే పద్ధతి వెలుగులోకి వచ్చింది. పత్రికలు, సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కావడంతో రైతులు ఈ విధానం పై దృష్టి పెట్టారు.
వెదజల్లే పద్దతిలో ప్రయోగం చేసి వరంగల్ అర్బన్ జిల్లా రైతులిద్దరు సక్సెస్ అయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 600 ఎకరాల్లో సాగవుతున్నప్పటికీ ఈ రైతులు పెద్ద మొత్తంలో సాగు చేయడం మిగతా వారిలో ఆసక్తి రేపింది. రమణారెడ్డి 10 ఎకరాలలో, నరేందర్ రెడ్డి 25 ఎకరాల్లో వడ్లను నేరుగా భూమిలో ఎగజల్లి వరిని పండిస్తున్నారు. రమణారెడ్డి ఆర్ ఎం ఆర్ రకం విత్తనాలను చల్లగా ఇప్పుడు పంట ఏపుగా పెరిగింది. కూలీలు వేసిన నాటు కంటే అద్భుతంగా కనిపిస్తోంది. వరిలో ఒక్కో పాదులో పిలకలు ఎక్కువగా వచ్చాయి. వరి కంకులు కూడా పొడవుగా ఉన్నాయి. ఇలా ఇద్దరి పొలాల్లో ఎకరానికి 50 బస్తాలు తగ్గకుండా దిగుబడి వచ్చే అవకాశముంది. ఈ ఇద్దరు రైతులు 35 ఎకరాల్లో వెదజల్లే పద్దతిలో సాగుచేయడం వల్ల నాటు ఖర్చు రూ. లక్షా 75 వేలు ఆదా అయినట్లేననే మిగతా రైతులు చెబుతున్నారు.
వెదజల్లే పద్ధతిలో వరి సాగు ఎంతో లాభదాయకం..
Leave Your Comments