వార్తలు

డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు..

0

మంచి పోషకాలు ఉన్న పండు డ్రాగన్ ఫ్రూట్. గిరాకీ కూడా ఎక్కువే. ఈ ఫల సేద్యం కృష్ణా జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు అక్కడక్కడా సాగు చేస్తున్నారు. దీనిని గుర్తించిన ఆంధ్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సహం అందించేందుకు సిద్ధమైంది.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉపాధి హామీ పీడీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మామిడి, నిమ్మ, జామ, సపోట తదితర పండ్లతోటలకు సర్కారు ప్రోత్సహకాలు అందిస్తోంది. ఇక నుంచి డ్రాగన్ ఫ్రూట్ నూ ఈ జాబితాలో చేర్చింది. ఆసక్తికల రైతులు ఉపాధి హామీ పథకం ఏపీఓలను సంప్రదించి డ్రాగన్ సాగు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టేందుకు రాష్ట్రంలో పలు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో కృష్ణా జిల్లా కూడా ఉంది. పథకం అమలుకు మార్గదర్శకాలు రైతుకు అర ఎకరా విస్తీర్ణంలో సాగుకు అనుమతిస్తారు. దీనికి ముందుకు వస్తే రైతుకు రూ. 1.86 లక్షలను ఇస్తారు. మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులనూ చెల్లిస్తారు. మొక్కల ఖరీదులోనూ సగం రైతులు పెట్టుకుంటే మిగిలిన సగం ప్రభుత్వం భరిస్తుంది. అర ఎకరాకు దాదాపు 350 మొక్కలు అవసరమవుతాయి.
మంచి పోషకాలు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ కు మార్కెట్ లోనూ డిమాండ్ బాగా ఉంది. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్ ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్ మాల్స్లో వీటికి విపరీత గిరాకీ లభిస్తోంది. ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ ధర రూ. 100 పలుకుతోంది. ఈ ఫలంలో రెండు రకాలు ఉన్నాయి. ఎరుపు రంగులో ఉన్న ఫలానికే డిమాండ్ ఎక్కువ. వీటిల్లో విటమిన్ – సి, విటమిన్ బి3 తోపాటు ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధి నియంత్రణకు దోహదపడుతుంది.
మొక్కలు నాటిన తరువాత ఏడాది కల్లా కాపు వస్తుంది. 30 ఏళ్ళు ఆదాయం పొందవచ్చు. ఏడాదికి మూడు కాపులు వస్తాయి. ప్రారంభంలో ఒక్కొక్క చెట్టుకు పది కాయలు కాస్తాయి. రానురాను దిగుబడి మరింత పెరుగుతుంది. డ్రాగన్ ఎడారి మొక్కైన నాగజెముడు, బ్రహ్మజెముడులాగా నీరు తక్కువగా ఉన్నా బతుకుతుంది. చౌడు భూములు మినహా మిగిలిన నేలల్లో దీనిని సాగు చేసుకోవచ్చు.

Leave Your Comments

పశుగ్రాస పంటల సాగులో పాటించవలసిన జాగ్రత్తలు..

Previous article

బిందుసేద్యంతో కూరగాయ పంటల సాగు….లాభాల బాట

Next article

You may also like