రైతు పంట కోసిన తర్వాత లభించే సేంద్రియ వ్యర్థ పదార్ధాలను, పశువుల ఎరువును, కూరగాయల వ్యర్థ పదార్థాలను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా లభించే వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి వర్మి కంపోస్టును తయారు చేసుకోవాలి. ఈ వర్మి కంపోస్ట్ తయారీ కోసం రైతులు తమకు అందుబాటులో గల వానపాములను ఉపయోగించి అధిక పోషక విలువలు గల వర్మి కంపోస్ట్‌ను పొందవచ్చు. ఈ వర్మి కంపోస్ట్ వాడకం వల్ల వాతావరణ మరియు నీటి కాలుష్యాన్ని తగ్గించి భూమిలో ఉన్న ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకోవచ్చు.
వానపాములు సేంద్రియ నిల్వలు ఎక్కువగా ఉన్న నేలల్లో బొరియలు చేసి నేలను గుల్లపరుస్తుంటాయి. అందువల్ల వీటిని రైతు మిత్రులుగా గుర్తించారు. వీటిని వివిధ రకాల సేంద్రియ వ్యర్ధాల మీద వేసినప్పుడు, వ్యర్ధాలను ఆహారంగా తీసుకొని విసర్జన చేస్తుంటాయి. ఈ విసర్జన పదార్థాన్నే ‘‘వర్మి కంపోస్ట్’’ అంటారు. ఈ వర్మి కంపోస్ట్‌లో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మపోషకాలు పశువుల ఎరువుల కన్నా దాదాపు 50 శాతం అధికంగా ఉంటాయి.
వర్మి కంపోస్ట్‌కు అనువైన వానపాము రకాలు :
భూమిపై పొరల్లో ఉంటూ బొరియలు చేయని వానపాములు సేంద్రియ వ్యర్థ పదార్ధాల నుండి కంపోస్ట్ చేయడానికి పనికివస్తాయి. ఈ బొరియలు చేయని మరియు వర్మి కంపోస్ట్‌ను తయారుచేయడానికి అనువైన వానపాము రకాలు పెరియోనిక్స్, ఎక్స్‌కవేటస్, యూడ్ల్రిస్ యూజని, ఐసీనియా ఫోటిడా, లాంపిటో మారుతి.
వీటిలో ఐసీనియా ఫోటిడా, పెరియోనిక్స్ ఎక్స్‌కవేటస్ మన వాతావరణానికి అనువైనవి మరియు ఎక్కువ వ్యర్థ పదార్థాలను తింటూ తక్కువ కాలంలో కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు.
వర్మి కంపోస్ట్ తయారికి కావాల్సిన వస్తువు :
- వానపాము: వర్మికంపోస్ట్ తయారీకై వర్మిబెడ్‌లను వేయాల్సి ఉంటుంది. ఒక చదరపు మీటరు విస్తీర్ణం కల కొరకు 1.0 నుండి 1.5 గ్రా.ల బరువుకల చిన్న, మధ్యస్థ మరియు పెద్ద వానపాము అసరం.
- సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు: రైతు అనంతరం మిగిలిన ఆకు,కాండాలు, చెఱకు పిప్పి, వరిగడ్డి, కంకులు, కాయగూరల వ్యర్ధాలు, చెత్త, కలుపు మొక్కులు, పేడ, పండ్ల తొక్క మరియు పాడైన పూలు పాక్షికంగా కుళ్ళిన స్థితిలో ఉన్నవైతే వర్మి కంపోస్ట్‌కు బాగా ఉపయోగపడతాయి. ఒక టన్ను వర్మి కంపోస్ట్ట్ తయారికి 2 నుండి 2.5 టన్ను వ్యర్థ పదార్థాలు అవసరం.
- షెడ్ : వానపాములు వాతావరణ తీవ్రతలను తట్టుకోలేవు. కాబట్టి వాటి రక్షణ కొరకు తగిన నీడను కల్పించాలి. ఇందుకు గాను రైతు తమ స్థోమతను బట్టి మరియు వనరును బట్టి షెడ్స్ వేసుకోవాలి. ఇందుకుగాను రైతు తమకు అందుబాటులో ఉన్న వరిగడ్డిని గాని, తాటి ఆకులను గాని,పాత గోనె గాని, పాలిథీన్ సంచులను గాని లేదా రేకు షెడ్డును వేయడానికి వినియోగించుకోవచ్చు.
- శాశ్వత షెడ్ : వ్యాపార సరళిలో వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి శాశ్వత షెడ్ ఉపయోగపడతాయి. ఈ షెడ్డును భూమిపై ఒక అడుగు ఎత్తులో చదును చేసి చుట్టూ ఇనుప రాడ్లు వేసి 8 నుండి 9 అడుగు ఎత్తులో ఏటవాలుగా జింకు షీట్సుతో గాని లేక జి.ఐ రేకుతో వేసుకోవాలి.
దీనిలో ఒక మీటరుకు ఫాగర్స్ మరియు రెండు మీటర్లకు స్ప్రింక్లర్స్‌ను బిగించుకొనవలయును. ఫాగర్స్‌ను ఎండవేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించి వేడిని తగ్గించుకోవచ్చును. స్ప్రింక్లర్స్‌ను బెడ్లను తడపడానికి ఉపయోగించుకోవచ్చును లేదా పాత గోనె సంచులను తడిపి లేదా ఎండిన గడ్డిని బెడ్‌పై వేసి రోజు నీరు పెట్టి నిరంతరం తేమ ఆవిరి కాకుండా చూడవచ్చు. షెడ్ వేయడం వల్ల వానసాముకు నీడనివ్వడమేకాక ఎరువుల నుంచి తేమ త్వరగా ఆవిరైపోకుండా వర్షపు నీరు నేరుగా ఎరువు మీద పడి పోషకాలు నష్టపోకుండా రక్షించుకోవచ్చు.
వర్మి కంపోస్ట్ బెడ్‌ను తయారు చేసే విధానం :
- భూమిని సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేలా వీలైనంత పొడవు, ఒకటిన్నర అడుగుల ఎత్తులో వర్మి కంపోస్ట్ బెడ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ల అడుగు భాగము గుళ్ళగా లేకుండా గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని బండలతో గాని, పేడతో గాని గట్టి పరచవచ్చు.
- ఇలా ఏర్పాటు చేసిన బెడ్‌లపై సుమారుగా 45 సెం.మీ ఎత్తు వరకు పాక్షికంగా కుళ్ళిన మరియు కుళ్ళే స్వభావం గల వ్యర్థ పదార్థాలు వేయాలి. ఈ వ్యర్థ పదార్థాల పైన 5 సెం.మీ మందం వరకు పేడను నీటితో కలిపి చల్లాలి.
- వారం రోజు రోజ్‌క్యాన్ లేదా పైపు ద్వారా బెడ్‌లపై నీటిని చల్లుతూ ఉండాలి.
- వారం రోజు తర్వాత వానపాములను వదలాలి. వానపాములు వదిలేటప్పుడు వర్మిబెడ్‌ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెదుక్కుంటూ లోపలికి వెళతాయి. ప్రతి చ. మీ. 1.0`1.5 కిలోల వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది.
- వానపాములను వదలిన వర్మి బెడ్‌లపై ప్రతి రోజు పలుచగా నీరు చల్లాలి. ఈ విధంగా చేస్తే 2 నుండి 3 నెల్లో వర్మి కంపోస్ట్ తయారవుతుంది.
- ప్రతి పది రోజులకు ఒకసారి పేడ నీళ్ళు 5 నుండి 10 లీటర్లు వర్మీ బెడ్‌లపైచల్లాలి.
- బెడ్‌నుండి వర్మి కంపోస్ట్ తీయుటకు 10 రోజు ముందు నీరు చ్లటం ఆపివేయాలి. ఇలా చేయటంవల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్ళి అడుగు భాగానికి చేరుతాయి. బెడ్‌పైన కప్పిన గోనె సంచులను గాని, ఎండుగడ్డిని గాని తీసివేసి ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా పోగు చేసి అలాగే 2 నుండి 3 గంటు వర్మి బెడ్‌ల్లోనే ఉంచితే మిగతా వానపాములు కూడా తేమను వెతుక్కుంటూ కుప్పల అడుగు భాగానికి చేరుతాయి.
- వానపాములు లేని ఎరువును 2 నుండి 3 మి.మీ జల్లెడ పట్టి వేరుచేసి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
- ఎరువును తొగించిన వర్మి బెడ్లపై మళ్ళీ వ్యర్థ పదార్థాలను 45 సెం.మీ ఎత్తువరకు పరిచి పైవిధంగా కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చును. ఇలా సంవత్సరానికి 4`6 సార్లు వర్మి కంపోస్ట్‌ను తయారు చేసే మీలుంది. వర్షాకాలంలో వర్మి కంపోస్ట్ తయారీకి పట్టే వ్యవధి కొద్ది మేర పెరగవచ్చును.
- పూర్తిగా తయారైన మంచి వర్మి కంపోస్ట్ రంగు నల్లగా కాఫీ పొడిలా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది, వాసన ఉండదు, కంపోస్ట్ట్ ఉదజని సూచిక దాదాపు 7.0 ఉంటుంది.
వర్మి కంపోస్ట్ తయారీలో తీసుకోవసిన జాగ్రత్తు :
- వర్మి బెడ్‌లో ప్లాస్టిక్ పదార్థాలను గాని, పగిలిన గాజు ముక్కలు గాని, కోడిగుడ్డు పెంకులు గాని, రాళ్ళుగాని లేకుండా చూడాలి.
- బెడ్‌ను పక్షులు, ఉడతలు, తొండలు, కొంగలు, కప్పలు, పాములు, పందులు, ఎలుకలు ఆశించి వానపాములను తినకుండా షెడ్ చుట్టు వలను కట్టుకోవాలి.
- పది రోజుకోసారి పేడ నీళ్ళను చల్లాలి.
- బెడ్లలో నీరు నిల్వ ఉండకుండా 50 శాతం తేమ ఉండేటట్లు చూసుకోవాలి.
వర్మి కంపోస్ట్‌లో పోషక విలువలు:
వర్మి కంపోస్టులో నత్రజని 1.5 నుండి 1.8 శాతం, భాస్వరం 0.8 నుండి 1.0 శాతం, పొటాషియం 1.0 నుండి 1.2 శాతం, కాల్షియం 3049 పి.పి.యం, మెగ్నీషియం 4080 పి.పి.యం, మాంగనీస్ 1296 పి.పి.యం, ఇనుము 1125.8 పి.పి.యం, జింక్ 139.8 పి.పి.యం, కాపర్ 16.5 పిపియమ్ ఉంటుంది. ఇవియే కాకుండా మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్టినోమైసిటీస్ మరియు వివిధ రకాలైన ఎంజైములు, హార్మోనులు, విటమిన్లు, భాస్వరాన్ని కరిగించే సూడోమోనాస్ బ్యాక్టీరియా మొదలగునవి లభిస్తాయి.
వర్మి కంపోస్ట్ వాడకం :
వానపాములు ఎరువును అన్ని పంటలకు వేయవచ్చు. పూల కుండీల్లో అయితే కుండీకి 200 గ్రా. చొప్పున వేయాలి. 5 సంవత్సరాలు ఉన్న జామ, మామిడి, బత్తాయి, సపోట, కొబ్బరి తోటలకు ప్రతి మొక్కకు 5 నుండి 8 కిలో చొప్పున రెండు, మూడు దఫాల్లో ప్రతిసారి వేయ్యచ్చు. వరి, మొక్కజొన్న పంటలకైతే ప్రతి ఎకరాకు 1 టన్ను చొప్పున నాటిన తర్వాత, పొద్దుతిరుగుడు, పత్తి పంటలకు ఎకరాకు 1.5 టన్నులు దుక్కిలో వేయవచ్చును.
వర్మి వాష్ :
సాధారణంగా రైతులు పంటలపై ద్రవరూపంలో ఉన్న ఎరువులను పిచికారీ చేస్తూ వుంటారు. వీటి కొనుగోలుకై అధికమైన ఖర్చు చేస్తు ఉంటారు. కాబట్టి వర్మి కంపోస్ట్ తయారు చేసుకొనే రైతు కొద్దిపాటి యాజమాన్యంతో ఎంతో విలువలైన పోషకాలను, మొక్క పంటల ఎదుగుదలకు తోడ్పడే వర్మివాష్‌ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకొనే అవకాశం వుంది.
వర్మివాష్ తయారీ :
వర్మివాష్ తయారీకి గాను 200 లీటర్ల పరిమాణం గల ప్లాస్టిక్ డ్రమ్‌ను తీసుకొని అందులో మొదటి పావు వంతు భాగాన్ని నిమ్మ కాయ సైజులో క రాళ్ళతో నింపాలి. తర్వాత పావు వంతు భాగాన్ని ఇటుక ముక్కలతో నింపాలి. ఆ పిదప పావు వంతు భాగాన్ని ఇసుకతో నింపాలి. చివరి లేదా పై పావు వంతు భాగాన్ని నాణ్యత గల వర్మికంపోస్ట్ మరియు 0.518 పరిమాణం గల వానపాములు వదలాలి. ఈ విధంగా నింపబడిన డ్రమ్ పై భాగాన అధిక భాగంలో మూడు చిల్లులు గల 5 లీటర్ల పరిమాణంలో ఉన్న మట్టికుండను చూరు నుండి వ్రేలాడ దీయాలి. ఈ చిల్లులకు పత్తి వత్తులు కూడా అమర్చాలి. ఈ కుండలో నీళ్ళు నింపాలి. అప్పుడు ప్రతిరోజు దాదాపుగా 500 నుండి 750 మి.లీ నీరు పత్తి వత్తు ద్వారా చుక్క చుక్కలుగా జారి కింద ఉన్న డ్రమ్‌లో పడతాయి. ఇది మెల్ల మెల్లగా డ్రమ్‌లోని వివిధ పొర ద్వారా ఇంకుతూ అడుగున చేరి అక్కడ డ్రమ్‌కు గ కొళాయి ద్వారా రోజుకు 250 నుండి 300 మి.లీ వర్మి వాష్ అనగా వానపాము శరీర స్రావము మరియు వర్మీ కంపోస్ట్ ఎరువు సారం కలగలిసి బయటకి వస్తుంది. దీన్ని సేకరించి జాగ్రత్త పరచుకోవాలి.
వర్మి వాష్ వాడే విధానం :
సాధారణంగా అన్ని పంటలకు అన్ని దశల్లో పిచికారీగా దీన్ని 10 శాతం ఉపయోగించుకోవచ్చు. మరి ముఖ్యంగా పంట వాతావరణం కలిగి పలురకాల ఎద్దడి సమయాల్లో లేదా నాణ్యతా ప్రమాణాల పెంపుదలకై పూలు, కాయగూరులు, నర్సరీ బెడ్ లాంటివి వాడుకొని చక్కని ఫలితం పొందవచ్చును.
రైతు తమకు అవసరమైన వానపాములను తోటి రైతు నుంచి గాని, వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి గాని, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి గాని కొనుగోు చేయవచ్చు కాబట్టి రైతులు స్వయంగా వర్మి కంపోస్ట్‌ను మరియు వర్మి వాష్‌ను తయారు చేసుకొని రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి రాబోయే కాలంలో సేంద్రియ సాగును ముందుకు తీసుకెళ్ళడానికి వర్మి కంపోస్ట్ ఎంతగానో దోహదపడుతుంది.
Leave Your Comments