తెలంగాణవ్యవసాయ పంటలు

నిల్వ చేసే ధాన్యంలో జరిగే నష్టాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
రైతులు ఎంతో కష్టపడి, చెమటోడ్చి పంటను పండించడం జరుగు తుంది. కానీ ధాన్యాన్ని నిల్వ చేసా కరకరకాల పరిస్థితుల వలన, ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైన కారణాలు…
చీడపీడలు, ఎలుకలు, పక్షులు, నల్లులు మరియు తేమశాతం. నిల్వ చేసిన ధాన్యంలో అనేక మైన చీడ పీడలు ఆశించి నష్ట పరుస్తాయి. ఈ నష్టం ధాన్యాన్ని నాణ్యత పరంగా తగ్గించడం లేక ధాన్యాన్ని తినడం వలన పరిమాణం మార్పుకలిగించడం ముఖ్యమైనవి. అదే విధంగా ధాన్యాన్ని విత్తనం కోసం నిల్వ చేసినప్పుడు, విత్తనం యొక్క నాణ్యత తగ్గిపోయి, మొలక శాతం తగ్గే అవకాశం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. ధాన్యాన్నిఆశించిన పురుగులు, ధాన్యంతో పాటు నిల్వ చేసిన డబ్బాలను, బస్తాలను చెక్క వస్తువులను కూడా నాశనం చేస్తాయి.
భారత దేశంలో ఒక అంచన ప్రకారం వివిధ పంటలలో, పంట కోసిన తర్వాత జరిగే నష్టాల నేది 10 శాతంగా అంచన వేయడం జరిగింది. ఇందులో, పండ్లు మరియు కూరగాయలలో జరిగేనష్టం 20 – 40 శాతం, పప్పు దినుసులు, నూనె గింజలు మరియు ఆహార ధాన్యాలలో   10 – 30 శాతం వరకు ఉంటుంది . పంట కోసిన తర్వాత జరిగే 10 శాతం నష్టాలలో సుమారుగా 6.58 శాతం నష్టాల నిల్వ చేసినప్పుడు జరిగింది. నిల్వ చేసినప్పుడు 6.58 శాతం జరిగే నష్టాలలో చీడ పీడల వలన 0.85 శాతం, తేమ వలన 0.68 శాతం ధాన్యం నిల్వ చేసి నప్పుడు ఈ కారణాల వలన నష్టం జరుగుతుందని . డాక్టర్.  జి. పాన్స్ కమిటీ  నిర్దారణ చేయడం జరిగింది . ఈ సమస్యల దృష్ట్యా,  ధాన్యాన్ని సరైన పద్దతిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఆహార ధాన్యాన్ని ఎలాంటి నష్టాలు లేకుండా కాపాడుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
ముందుజాగ్రత్తచర్యలు :-
• కోత సమయంలో ధాన్యంలో తేమ శాతం సుమారుగా 24 % వరకు ఉంటుంది .    అందువలన ధాన్యం నిల్వ చేసే ముందు 10-12 %  ఉండేటట్లు ఎండలో ఆరబెట్టాలి.
• గింజల్లో 7-8 శాతం ఉంటె పురుగు పట్టకుండా సురక్షితంగా ధాన్యాన్ని నిల్వ ఉంచవచ్చు .
• తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే బూజు తెగుళ్లు సోకి గింజలు నష్టపోతాయి.
• నిల్వ ఉన్న పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలుపరాదు.
• వీలై నంత వరకు క్రొత్త సంచులలో ధాన్యం నిలువ చేయాలి. ఎందుకంటే పాత సంచులలో అప్పటికే  పురుగు ఆశించి ఉంటే, నిల్వలో సులువుగా వ్యాపించి నష్టంచేస్తాయి. కావున పురుగు ఉధృతిని ఎప్పటి కప్పుడు గమనిస్తు ఉంటూ, జాగ్రత్తలు తీసుకోవాలి.
• పాత సంచులను వాడేటప్పుడు పాత ధాన్యం క్రిమి కీటకాలు లేకుండా వాటిని శుభ్రపరచి ఎండబెట్టాలి.
• నిల్వ చేసే ముందు గొనె సంచులలో 10 శాతం వేప ద్రావణం పిచికారీ చేసి వాడు కోవాలి లేదా 5 శాతం వేప గింజల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడాలి లేదా సంచుల పై మలాథియాన్ 10 మి .లీ . లేదా డెల్టామెత్రిన్  2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి, ఆర బెట్టి తరువాత నిల్వ చేసుకోవాలి.
• గోదాములలో మలాథియాన్  50  శాతం (1:100 నిష్పత్తిలో) నీటిలో కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు మూడు లీటర్ల ద్రావణం గాలిలో పిచికారీ చేయాలి.
• నింపిన బస్తాలను తేమ లేకుండా బస్తాల క్రింద చెక్కలు లేదా మంద పాటి ఈత చాపలు లేదా వరి గడ్డి పరచి దానిపై సంచులు అమర్చాలి. ప్రక్కగోడలకుకూడాసంచులుతాకకుండాచెక్కలులేదాచాపలుపెట్టాలి.
• అపరాలు వంటివి గృహ అవసరాలకై కొద్దీ మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వేప నూనె లేదా ఆముదం నూనె ప్రతి కిలో గింజలకు 5 మి.లీ. చొప్పున కలిపి నిల్వ చేసుకోవాలి. దీని వలన నిల్వలో పురుగుల వలన జరిగే నష్టం తగ్గించుకోవచ్చు అదే విధంగా పురుగుల యొక్క గ్రుడ్లు పొదగకుండా, లార్వాల గింజలలోకి చొరబడకుండా చనిపోయే అవకాశం ఉంది.
• విత్తనాలను నింపే సంచుల్లో వేప ఆకులను అడుగున వేసి సంచినింపిన తర్వాత మరల ఒక పొర వే పఆకులు వేయాలి.
• 100 కేజీల ధాన్యాన్ని 2 కేజీల వేప గింజల పొడిని కలిపితే పురుగుల యొక్క నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
• సిఫారసు చేసిన రసాయనాలను మోతాదుకి మించి ఉపయోగించినప్పుడు పేరుకుపోయిన మందుల అవశేషాలు  ధాన్యంలోనే ఉండి కొన్ని జీవ రసాయన మార్పులు ఏర్పడి నాణ్యత దెబ్బతింటుంది.
• నిల్వ చేసే గోదాములను శుభ్రంగా ఉంచుకోవాలి, గోదాములలో పగుళ్లు లేకుండా చూడాలి.
• తలుపులకి ఖాళీలు, రంధ్రాలు లేకుండా చూడాలి.
• ఆపరాలను చిక్కగా చేసిన జనపనార సంచులలో గాని లేదా పాలిథిన్   అమర్చిన సంచులలో గాని, నైలాన్  సంచులలో నిల్వ చేసుకోవాలి.
విషవాయువులను ఉపయోగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :-
• విషవాయువుతో గోదాములను నింపి పురుగు నివారణచర్యలు తీసుకోవాలి.
• గోదాములలో వివిధ కీటకాలను అరికట్టుటకు ఒకటన్ను ధాన్యానికి 3 గ్రా. అల్యూమినియం ఫాస్పైడ్ బిళ్లలను 1 లేదా 2 వేసుకొని గోదామను వారం రోజులు మూసి ఉంచితే బిళ్ళల నుండి వెలువడే ఫాస్పెన్ విష వాయువు కీటకాలను అరికడుతుంది.
• విషవాయువులను నూనె గింజల రక్షణకు ఉపయోగించరాదు.
• విషవాయువులను నింపడానికి ముందుగా నల్లటి పాలిథిన్ పేపర్ బస్తాల మీద పరచడానికి అనువుగా ఉంచుకోవాలి.
• బిళ్లలను వీలైనంత త్వరగా బస్తాల మధ్య అమర్చి వెంటనే నల్లని పాలిథిన్ పేపర్ కప్పాలి. దాని అంచుల వెంటఇ సుక గాని, మట్టి గాని పోసి విష వాయువు లోపల నుండి వెలు పలికి రాకుండా చేయాలి.
• గోదాములను విషవాయువు ప్రయోగించే ముందుగా కిటికీలను, వెంటిలేటర్లను మూసిపేపర్అంటించిగాలివెలుపులికిపోకుండాచేయాలి.
• తేమ నేల నుండి బస్తాలను సోకకుండా ఉండడానికి బస్తాలను దీర్ఘ చతురస్రాకారపు చెక్కల పైన ఉంచాలి.
పక్షుల నష్టాన్ని తగ్గించుకోవడం :-
• రకరకాల పక్షులు పంట సమయంలో మరియు పంట తీసిన తర్వాత నష్టం చేస్తాయి. వీటిలో ముఖ్యంగా రామచిలుకలు, కాకులు, పావురాలు ,పిచ్చుకలు పంట పైనే ధాన్యాన్ని తింటూ, అలాగే కుప్ప పోసిన, ఎండలో వేసి నగింజలను తింటూ రెట్టలు వేసిపాడుచేస్తాయి.
• వెంటి లేటర్లలో వైర్ మెష్ లను ఏర్పాటు చేయడం, తలుపులకి తెర వాడటం, గోడౌన్ దగ్గర ఉన్న పక్షి గూళ్ళు తీసివేయడం, కొట్టి బెదిరించడం మొదలైన భౌతిక మైన పద్ధతులను ఉపయోగించి నష్టాన్ని అరికట్టవచ్చు.
ఎలుకలనష్టాన్నితగ్గించుకోవడం :-
• ఎలుకల వల్ల నిల్వ ఉంచిన ధాన్యానికి నష్టం కలుగుతుంది. ధాన్యాన్ని తినడమే కాక వాటి వెంట్రుకలు, విసర్జన ద్వారా ధాన్యం నాణ్యత తగ్గి, అధిక నష్టం కలుగుతుంది. ఇలా విసర్జించిన ధాన్యం ఆహారానికి కూడా పనికిరావు. అలాగే ఎలుకలు నిల్వ ఉంచిన గోనె సంచులను, గాదెలను కొరకడం వలన నష్టం వాటిల్లుతుంది.
• వీటి నివారణకు గోదాములో రంద్రాలు, పగుళ్లు లేకుండా మూసివేయాలి. త్వరగా విష ప్రభావం చూపించే జింక్ పాస్పైడ్, నిదానంగా పని చేసే బ్రోమోడయోలిన్ లను ఉపయోగించి ఎలుకలను 40 – 60 శాతం వరకు మూడు నుండి నాలుగు రోజుల్లో అరికట్టవచ్చు.
బస్తాలనుఅమర్చేపద్ధతులు :-
1. సాధారణపద్ధతి : –
• ఈ పద్ధతిలో బస్తాలను పొడవుగా ఒక దానికొకటి ఉంచి అదే విధంగా పై వరుసలలో కూడా అమర్చవలెను.
• ఈ పద్ధతిని వడ్లకు గాని జొన్నలకు గాని ఉపయోగిస్తారు దీనిలో 14 వరసల కన్నా ఎక్కువ ఉంచుటకు వీలు కాదు.
2. వంకరటింకర పద్ధతి :-
• ఈ పద్ధతిలో బస్తాలను ఒక పద్ధతి ప్రకారం ఒక వరుసలో పొడువు వైపు, రెండవ వరుసలో వెడల్పు వైపు, మూడవ వరుసలో తిరిగి పొడుగు వైపు, 4వ వరుసలో వెడల్పు వైపు ఆమార్చ వలెను.
• బస్తాలు పడకుండా ఇది మంచి పద్ధతి.
3. బ్లాక్పద్ధతి :-
• ఈ పద్ధతిలో ప్రతి వరుసలో ఒక బస్తా పొడవు వైపు రెండవ బస్తా వెడల్పు వైపు అమర్చాలి. ప్రతి భాగంలో ఒక బస్తా పొడవు వైపురెండవ బస్తా వెడల్పు వైపు ఉండును.
• ఈ పద్ధతిలో బస్తాలు లెక్కించుటకు సులభం.
పైన సూచించిన అంశాలు  గమనించి, తగిన జాగ్రత్తలు చేపడితే నిల్వలో ధాన్యం నష్టంపోకుండా, నాణ్యతను కాపాడుకొని అధిక మార్కెట్  ధరను పొందవచ్చును.
డా. కె. రవికుమార్, డా. వి. చైతన్య, డా. జెస్సీ . సునీత, శ్రీమతి పి.ఎస్.ఎం ఫణి , శ్రీ కృషి విజ్ఞాన కేందం, వైరా.
Leave Your Comments

శుభ్రపరుస్తు గ్రేడింగ్  చేసే యంత్రం(నిమ్మ, బత్తాయి, టమాటో రైతులకు సులభంగా గ్రేడింగ్  చేసుకోడానికి తయారు చేసే యంత్రం)

Previous article

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతవారణ ఆధారిత వ్యవసాయ సలహాలు 03.05.2025 నుండి 07.05.2025

Next article

You may also like