ఆంధ్రప్రదేశ్నేలల పరిరక్షణవ్యవసాయ పంటలు

సమస్యాత్మక  పాలచౌడు నేలలు మరియు నల్లచౌడు నేలల సవరణ  యాజమాన్యం

0

సమస్యాత్మక నేలలు అనగా నేలలలో వున్న కొన్ని అవలక్షణాల వల్ల పంటలు పండించడానికి అనుకూలమైనది కాకుండా ఉంటే అటువంటి నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. భారత దేశం మొత్తం మీద ఇటువంటి సమస్యాత్మక నేలలు 10 మిలియన్ హెక్టారులు ఆక్రమించి ఉన్నాయి. అందులో 7.2 మిలియన్ హెక్టారులు పాలచౌడు  నేలలు కాక మిగతా  2.8 మిలియన్ హెక్టారులు నల్ల చౌడు  లేదా కారు చౌడు  నేలలుగా చెప్పవచ్చు. ఈ నేలలో  సారం ఉన్నప్పటికీ  కొన్ని అవలక్షణాల వల్ల వాటి యొక్క ఉత్పాదకత తక్కువ ఉండును. కావున ఈ సమస్యాత్మక నేలలు తగు యాజమాన్య పద్దతులు పాటించటం ద్వారా వాటి లోపాలను సవరించి ఫలవంతమైన నేలలుగా మార్చవచ్చు.

పాల చౌడు నేలలు అనేవి కాల్షియం మరియు మెగ్నీషియం సల్పేట్ మరియు క్లోరైడ్ లవణాలు నేలలో పేరుకుపోవడం వల్ల నేల పైన తెల్లని పొర ఏర్పడును దీనిని సేలనైజేషన్ అందురు. అంతే కాకుండా భూగర్భ జలాలలో ఎక్కువ గల లవణాలు కేశనాళిక ప్రక్రియ ద్వారా నేల పై భాగంలోకి చేరుకొని తెల్లని తెట్టును ఏర్పరచటం వల్ల దీనిని తెల్ల చౌడు నేలలు (సెలైన్ సాయిల్) అందురు.

బహ్యస్వరూపంగా మరియు భౌతికంగా పాల చౌడు నేలలను గుర్తించే లక్షణాలు :

నేల మంచి ఆకృతిని కలిగి నీరు ఇంకిపోయే గుణం కలిగి ఉండి వేసవిలో తెల్లగా కనబడును.

రసాయనికంగా పాల చౌడు నేలలను గుర్తించే లక్షణాలు :

  • తెల్ల చౌడు నేలల యొక్క ఉదజని సూచిక 8.5 గా ఉండును.
  • లవణ సాంద్రత 4 కన్నా ఎక్కువగా ఉండును
  • వినిమయ సోడియం శాతం 15 కన్నా తక్కువ ఉండుట

పాల చౌడు  నేలలకు  గల ఏర్పాటు గల కారణాలు :

  • శూష్క మరియు అర్దశూష్క వాతావరణ పరిస్థితులు మరియు ఎక్కువ లవణాలు గల భూగర్భ నీటి వసతి
  • క్షార స్వభావం గల మాతృ శిలల వలన
  • తక్కువ భౌగోళిక స్థితి మరియు లోతట్టు నేలలు
  • సరియైన వడపు, మురుగు నీరు పోవు (డ్రైనేజి) సదుపాయం లేకపోవుట
  • సముద్ర తీరం నుంచి లవణాలు కొట్టుకువచ్చి పేరుకు పోవటం వలన
  • ఎక్కువ లవణ సాంద్రత గల నీరు వాడుట
  • క్షార స్వభావం గల రసాయనాలు ఎక్కువగా వాడుట
  • మోతాదును మించి ఎరువులను వేయడం
  • ఎక్కువ ఉష్ణోగ్రతలు మరియు తక్కువ వర్షపాతానికి గురికావడం వల్ల ఎక్కువ ద్రవాబిసరణ పీడనం వల్ల నేల పైకి ఎక్కువ లవణాలు చేరటం

తెల్ల చౌడు నేలలు సవరణ :

  • తెల్ల చౌడు నేలలను చిన్న చిన్న మడులుగా చేసి నీటిని పెట్టి బాగా దున్నుట వల్ల లవణాల నేల అడుగు భాగానికి ఇంకిపోయేలా చేయుట .
  • నేలలలో నీటిని ఇంకే పక్రియ తరువాత మిగిలిన లవణాల తెట్టును మురుగు నీరు ద్వారా బయటకు విడిచిపెట్టాలి
  • తెల్ల చౌడు నేలలకి లవణాలు తక్కువ వున్న నీటిని అందించుట వలన
  • పచ్చిరొట్ట ఎరువలు వాడుట సాగు చేసి నేలల కలియదున్నుట ద్వారా
  • తెల్ల నేలల పునరుద్దరణ తరువాత వరి పంట వేయటం వల్ల
  • తెల్ల చౌడు తట్టుకునే పైరులను పండించుట

నల్ల చౌడు నేలల గుర్తించుట :

నల్ల చౌడు నేలలు అనునవి నేలలలో అధికంగా సోడియం మరియు సోడియం కార్బనేట్ , సోడియం బై కార్బొనేట్ పేరుకు పోవటం వలన ఎర్పడును. అంతే కాకుండా సోడియం ఎక్కువ పేరుకుపోవటం వల్ల నేలలోని సేంద్రియ పదార్ధంలోని హ్యూమస్ తో కరిగి నల్లని తేట్టులాగా మారి నేల ఆకృతి పోయి నేల అంత నల్లగా కనబడును కావున వీటీని నల్ల చౌడు నేలలు లేదా కారు చౌడు నేలలు అందురు. నల్ల చౌడు నేలలో ఎక్కువ సోడియం ఉండుట వలన మట్టి కణాల మధ్య బలాలు విచ్చిన్నం అయ్యి నేల ఆకృతిని కోల్పోవును. దిని వలన ఈ నేలలలో వాయు ప్రసరణ మరియు నీరు ఇంకే గుణం, నీటిని ప్రసరణ  సామర్ధ్యం  తగ్గి కింది నేల చాలా గట్టిగా మారి ఎటువంటి భౌతిక రసాయన లేకుండా పనికి రాకుండా చేయును.

బహ్య స్వరూపంగా మరియు భౌతికంగా నల్ల చౌడు నేలలను గుర్తించే లక్షణాలు 

నల్ల చౌడు నేలలు భౌతికంగా వాటి స్థితులైనా వాయు ప్రసరణ మరియు నీరు ఇంకే గుణం, నీటిని ప్రసరణ  సామర్ధ్యం  క్షీణించడంతో పాటు నేల ఆకృతి పోయి నల్లగా మారుతుంది.

రసాయనికంగా నల్ల చౌడు నేలలను గుర్తించే లక్షణాలు :

  • తెల్ల చౌడు నేలల యొక్క ఉదజని సూచిక 8.5 కన్నా ఎక్కువగా ఉండును.
  • లవణ సాంద్రత 4 కన్నా తక్కువగా ఉండును.
  • వినిమయ సోడియం శాతం 15 కన్నా ఎక్కువగా ఉండును.

నల్ల చౌడూ నేలలను  ఏర్పాటు గల కారణాలు:

  • నేలలో అధికంగా వినిమయ సోడియం ఉండును.
  • సోడియం ఎక్కువ గల నీటిని సాగుకు వాడుట

నల్ల చౌడు నేలలు సవరణ :

  • నల్ల చౌడు నేలలకు జిప్సం వేయడం ద్వారా బాగు చేయవచ్చు.
  • నల్ల చౌడును తట్టుకునే పచ్చి రొట్ట ఎరువులు జీలగ మరియు సీమ జీలుగ పంటలు వేయటం.
  • నల్ల చౌడును తట్టుకునే పంటలు వేయటం .
  • నల్ల చౌడు నేలలను పునరుద్దరించిన తరువాత వరి పంటను వేయటం.

పైన పేర్కొన్న విధంగా తెల్లచౌడు  మరియు నల్లచౌడు నేలల సవరణకు తగు యాజమాన్య పద్దతులు పాటించటం ద్వారా సమస్యాత్మక నేలలను మంచి నేలలుగా మార్పు చేయడంతో పాటుగా ఈ నేలలను సాగులోకి  తీసుకువచ్చి పంట సాగు విస్తీర్ణం పెంచటంలో మరియు నేల సారం మరియు ఉత్పాదకతను పెంచటంలో ఎంతగానో దోహదపడును.

టి. రాజశేఖర్, సి.హెచ్. సీతారామలక్ష్మి,ఎ. శీరిష ,  ఎమ్.చారుమతి,  టి.శ్రీలత,ఎమ్. రవిబాబు,  సిహెచ్. ముకుంద రావు,వ్యవసాయ పాలిటెక్నిక్,ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, అనకాపల్లి.

Leave Your Comments

పూల పంటలకు బెడదగా మారుతున్న మొగ్గ ఈగ  (Blossom midge) కాంటారినియా మాకులిపెన్నిస్

Previous article

భారతదేశంలో తొలిసారిగా రెండు కొత్త వరి రకాలు విడుదల

Next article

You may also like