వర్జీనియా పొగాకు వర్షాధారంగా దక్షిణ తేలిక మరియు నల్ల నేలల్లో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం పొగాకు పంట నారు నాటిన దశ నుండి రెలుపులు దశలో వుంది. ఈ సమయంలో అనేక రకాల చీదపీడలు పొగాకు పంటను ఆశించి నష్ట పరచడం జరుగుతూ వుంది. ప్రస్తుతం పొగాకు పంటలో గమనించిన పురుగులు మరియు తెగుళ్ళ నివారణ మార్గాలను తెలియజేయడం జరిగింది.
పురుగుల యాజమాన్యం:
- పొగాకు లద్దెపురుగు: ఈ పురుగు యొక్క ఆడ రెక్కల పురుగు ఒక్కొక్కటి సుమారు 2000 గ్రుడ్లు ఆకుల అడుగు భాగమున పోగులుగా పెట్టును. ఈ గ్రుడ్లు 2, 3 రోజులు పొదిగిన తరువాత వీటి నుండి లేత ఆకుపచ్చ శరీరము, నల్లని తలతో నులి గొంగళి పురుగులు వందల సంఖ్యలో బయటికి వస్తాయి. ఇవి ఆకులపై పచ్చని పదార్ధము తింటూ బూడిద రంగులోనికి మారును. బాగా పెరిగిన గొంగళి పురుగులనే లద్దె పురుగులు అంటారు. ఈ పురుగుల వల్ల పొగాకు తోటకు 10 నుండి 15 శాతము నష్టము వాటిల్లును. సాధారణముగా పొగ తోట సరిహద్దు రెండు, మూడు వరుసలలోనే ఇది కన్పిస్తుంది. ఈ పురుగు నివారణకు మొక్క నాటిన 20 రోజుల తరువాత హెక్టారుకు 10 లింగాకార్శక బుట్టలు ఏర్పాటు చెయ్యాలి, తోటలోని ఆకులను నిశితంగా పరిశీలించి చిన్న పురుగులు, గ్రుడ్లు కలిగిన ఆకులను త్రుంచివేసి నాశనము చెయ్యాలి, వీటి సమస్య అధికంగా ఉన్నప్పుడు ఆయా ప్రదేశాలలో 0.5 శాతము వేపపప్పు ద్రావణము పిచికారీ చెయ్యాలి లేదా న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరసు యన్.పి.వి. వ్యాధి సోకిన 250 లద్దె పురుగుల నుండి తయారు చేసిన ద్రావణాన్ని హెక్టారుకు 1125 లీటర్ల నీటిలో కలిపి దానికి 250 గ్రా. వరి పిండి గాని గంజి గాని కలిపి సాయంత్రము వేళలలో పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా వుంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి. ని 10 లీటర్ల నీటికి 5 గ్రా . కలిపి గాని లేదా నొవొల్యురాన్ 10 ఇ.సి. 10 లీ . నీటికి 10 మీ లీ కలిపి గాని పిచికారి చేసి లద్దె పురుగులను నివారించవచ్చును.
- కాండం తొలిచే పురుగు: ఇది సూక్ష్మ మైన నులి గొంగళి పురుగు. గ్రుడ్డు నుండి వెలువడిన వెంటనే ఈనెలు, కాండములను దొల్చి అందులోని జీవప దా ర్ధమును తిని, లోపలి భాగాన్ని గుల్లగా చేస్తుంది. ఇది ఉండేచోట కాండము పైన బుడగలా ఉబ్బి ఉంటుంది. ఈ పురుగు ఆశించిన మొక్క పెరుగుదల క్షీణించి వెర్రితలలు వేస్తుంది.ఈ పురుగుల బెడద ఎక్కువగా వున్నప్పుడు ఫ్లూబెండియమైడ్ 48 ఎస్.సి. మందును 10 లీటర్ల నీటికి 2.5 మీ.లీ.లేక క్లోరాంట్రనిలిప్రోల్ 18.5 ఎస్.సి. మందును 10 లీటర్ల నీటికి 3.0 మీ.లీ. కలిపి పిచికారి చెయ్యాలి.
- తెల్ల దోమ: ఈ తెల్లదోమలు ఆకు ముడత తెగులును వ్యాపింపచేస్తాయి. ఈ తెల్లదోమ సోకిన మొక్కల ఆకులు వంకరలు తిరిగి ముడతలు పడిపోతాయి. ఈనెల మందము పెరిగి ఆకులు విపరీత రూపు సంతరించుకుంటాయి. మొక్క పెరుగుదల క్షీణించి పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఆకుముడత సోకిన మొక్కలను నాటుటకు ఉపయోగించరాదు. ఈ తెల్లదోమ నాశించు పొగాకేతర మొక్కలు దగ్గర లేకుండా పూర్తిగా పీకి నాశనము చెయ్యాలి. పొగాకు తోటల చుట్టు ప్రక్కల వంగ లేక ప్రొద్దుతిరుగుడు పంట వేయకూడదు. తోటలు వేసిన నెల రోజుల లోపల ఆకుముడత సోకిన మొక్కలు 2 శాతము కన్నా తక్కువగా నున్నచో వాటిని పీకి నాశనము చేయాలి. హెక్టారుకు 12 చొప్పున ఆముదము పూసిన పసుపు రంగు రేకులను అమర్చి తెల్లదోమ ఉధృతిని పరిశీలిస్తూ ఉండాలి. తెల్లదోమ ఉధృతి ట్రాప్ కు 100కు మించినచో క్రిమిసంహారక మందులను పిచికారి చెయ్యవలెను. థయోమిథాక్సామ్ 25 డబ్ల్యు.జి. 2 గ్రా. లేదా పైమెట్రోజిన్ 25 డబ్ల్యు.జి. 4 గ్రా. లేదా ఫ్లోనికామిడ్ 50 ఎస్.జి. 4 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 ఎస్.ఎల్. 2.5 మి.లీ. చొప్పున 10లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్ళయాజమాన్యం:
నల్లకాడ/ మానుమచ్చ/ మాను కుళ్ళు తెగులు: ఈ తెగులు లక్షణాలు భూమి దగ్గరగా ఉన్న కాండంపై నీటి తడి మచ్చలుగా మొదలవుతాయి. క్రమేపి ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులోనికి మారి కాండం మొదలు భాగం కమిలి నల్లబడి వేర్లు కూడా నల్లబడి కుల్లిపోవును. ఇటువంటి కాండాన్ని చీల్చినప్పుడు లోపలి కణజాలం క్రుసించుకుపోయి పళ్ళాలుగా కనబడుతుంది. దీని వలన నీరు వ్రేల్లనుండి పైకు ప్రసరించక మొక్కలలో ఆకులు పసుపు రంగుకి మారి, వాలిపోయి కాండానికి సమాంతరముగా ఉండటం గమనించవచ్చు. కొద్ది రోజులలోనే ఆకులు వాడిపోయి మొక్కలు చనిపోతాయి. భూమిలో తేమ అధికంగా ఉనప్పుడు, ఎక్కువగా వర్షాలు పడి పొలములో నీరు నిలబడినప్పుడు ఈ తెగులు లక్షణాలు నారుమళ్ళు మరియు తోటలకు సోకుతుంది. నివారణకు తరుచూ తెగులు ఆశించే తోటల్లో పంట మార్పిడి పాటించాలి. ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్ర నాశినిని 2 కిలోలు + 90 కిలోల చివికిన పేడ ఎరువు + 120 కిలోల వేప పిండి తో కలిపి ఎకరా పొలంలో తేమ వున్నపుడు ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. ప్రతి మొక్కకు 75-100 మి.లీ. బోర్డో మిశ్రమము (10 లీ. నీటిలో 40 గ్రా. కాపర్ సల్ఫేట్ + 40 గ్రా. సున్నం) పాదులో పోయాలి. ఎకరాకు 0.2 శాతం కాపర్ ఆక్సీక్లోరైడ్ ను 400 గ్రా. లేక ఫినామిడాన్ + మాంకోజెబ్ 60 డబ్యు.జి. 600 గ్రా. పిచికారి చేయాలి. లేదా 0.2 శాతం మెటలాక్సిల్ + మాంకోజెబ్ 72 డబ్ల్యు. పి. ని 400 గ్రా. పిచికారి చేయవచ్చును. దీని వాడకాన్ని రెండు సార్లకు పరిమితం చేయాలి.
గోధుమ మచ్చ తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కల క్రింది ఆకులపైన గోధుమ రంగు గుండ్రటి మచ్చలు ఏర్పడి క్రమముగా ¼ నుండి 1 ¼ అంగుళముల వ్యాసము వరకు అభివృద్ధి చెందును. ఈ మచ్చలు వలయాకారములో కేంద్రీకృతమై ఉండును. ఈ మచ్చలు క్రమేపి పై ఆకులకు, ఆకు తొడిమలకు మరియు కాండానికి వ్యాపిస్తాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండి, తక్కువ ఉష్ణోగ్రత కలిగిన వాతావరణంలో ఈ తెగులు త్వరగా అభివృద్ధి చెంది వ్యాపించును. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో మచ్చలు ఒక దానితో ఒకటి కలిసి ఆకులు ఎండిపోతాయి.నివారణకు సిఫారసు చేసిన మోతాదులో మొక్కలకు పొటాష్ ఎరువులను అందించాలి. సిఫారసుకు మించి నత్రజని ఎరువులు వాడరాదు.మాంకోజెబ్ 2 గ్రా.లు లేదా ప్రోపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకు ఉపరితలం పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.
పక్షవాతం తెగులు: ఈ తెగులు భూమిలో ఉండే శిలీంద్రం ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోయి ఈనెల మద్య పసుపు రంగుగా మారి ఆకుల క్రింద నుండి పైకి ఎండిపోతాయి. తెగులు సోకిన మొక్కలలో కాండాన్ని చీల్చి చూస్తే లోపల కణజాలం నల్లగా కనిపిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలలో వ్రేళ్ళు నల్లగా మారి కుళ్ళిపోతాయి. నివారణకువేసవిలో లోతు దుక్కులు చేయాలి.భూమిలో సేంద్రియ పదార్ధం సమంగా ఉంటే ఈ తెగులు దరిచేరదు. జొన్న లేదా మొక్కజొన్న పంటతో కనీసం రెండు సంవత్సరాల పాటు పంటమార్పిడి చేయాలి. ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్ర నాశినిని 2 కిలోలు + 90 కిలోల చివికిన పేడ ఎరువు + 10 కిలోల వేప పిండి తో కలిపి ఎకరా పొలంలో తేమ వున్నపుడు ఆఖరు దుక్కిలో వేసుకోవాలి.
మల్లె లేక బోడు: మల్లె వేరు పరాన్నజీవి. పొగాకు మొక్క వెర్లనుండి నీటికి, ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొగాకు మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపించి దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు వేసవిలో రెండు మూడు పర్యాయములులో దుక్కి చేసుకుంటే మల్లె ఆశించడం తగ్గుతుంది. నూనె తీయ్యని వేపపిట్టును ఏకరాకు 100 కిలోలు వేయాలి. మల్లెను పుష్పించకుముందే తీసివేయాలి. ఈ వ్యాధి సోకిన నెలలలో వంగ, టొమాటో వంటి పంటలు వెయ్యరాదు. మల్లె ఉధృతంగా వచ్చిన పొలములో రెండు మూడు సంవత్సరాలు పొగాకు సాగు నిలిపివేయాలి.నువ్వులు, జొన్న, కంది, మినుము, పెసర, మిర్చి పంటలను ఖరీఫ్ లో వేసినట్లైతే అవి మల్లె విత్తనాలను మొలకెత్తెటట్లు చేస్తాయి కాని మల్లెను పెరగనివ్వవు.
డా.జి.ప్రసాద్ బాబు,సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, డా.ఐ.వెంకటేష్, సస్యరక్షణ శాస్త్రవేత్త, డా.జె.జ్యోతి, సస్య ఉత్పత్తి శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, కందుకూరు, డా.యం.శేషుమాధవ్, సంచాలకులు,జాతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ.