తెలంగాణ రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. సుమారు 1.11 హెక్టర్లలక్షల విస్తీర్ణంలో సాగు చేస్తూ, సుమారు 5.73 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని రైతులు సాధించడం జరుగుతుంది. పండించిన పంటను రైతులు దగ్గర్లోని మార్కెట్ లో లేదా వేరే దేశాలకు ఎగుమతిని చేయటం జరుగుతుంది. దేశీయ మార్కెట్లో మరియు ఎగుమతి చేసిన పంటకి మంచి ధర పలకడంలో రైతులు పాటించిన నాణ్యత ప్రమాణాలు అనేవి కీలకంగా మారుతాయి. నాణ్యమైన పంటకి మంచి ధర రావటం అనేది ఎప్పుడు కూడా కొలమానంగా మారుతుంది. ఈ తరుణంలో రైతులు, మిరప కోత మరియు కోతానంతరం సమయంలో నాణ్యత పెంచటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతం మిరప రైతులు ఒకటి, రెండు కోతలు పూర్తిచేసుకున్నారు కావున, సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మిరప నాణ్యతను పెంచటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మొక్కల మీద మిరప కాయలను ఎక్కువగా పండనీయరాదు. ఎక్కువ పండితే మిరప నాణ్యత తగ్గుతుంది.
- చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసి, పట్టాలపై కాని, సిమెంట్ కల్లాల పైన గాని ఆరబెట్టడం శ్రేయస్కరం.
- వర్షాధార కింద పండించిన పంటలో 3-4 కోతలు, నీటి వసతి కింద పండించిన పంటలో 6-8 కోతలు కోయాలి.
- కాయలు కోసే ముందు సస్యరక్షణ మందులు పిచికారీ చేయరాదు. ఒకవేళ పిచికారి చేసిన ఎడల మిరప కాయల మీద అవశేషాలుంటే ప్రమాదముంటుంది కనుక ఒక వారం – పది రోజులు ఆగి కోయాలి.
- మిరపలో 10 శాతానికి మించి తేమ ఎక్కువగా ఉండకుండా ఎండబెట్టాలి.
- ఎండబెట్టేటప్పుడు దుమ్ము, ధూళి, చెత్త చెదారం లేకుండా కాయలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.
- కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఎలుకలు మరియు పంది కొక్కులు రాకుండా చూసుకోవాలి.
- తాలు కాయలను, మచ్చ కాయలను గ్రేడింగ్ చేసి వేరు చేయాలి.
- నిల్వ చేయటానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనె సంచుల్లో కాయలు నింపాలి.
- తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్కబల్లాల మీద గోడలకు 50-60 సెం.మీ. దూరంలో నిల్వ ఉంచాలి.
- అవకాశం ఉన్నచోట శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తే రంగు, నాణ్యత తగ్గిపోకుండా ఉంటుంది.
- కాయలు నిగనిగలాడుతూ మంచి రంగు రావాలని ఏ విధమైన రసాయనాలను, రంగులను వాడకూడదు. అవి ప్రమాదకరమైవే కాకుండా, నిషేధింపబడ్డాయి కనుక కాయలు నాణ్యత మీద ప్రభావం ఉంటుంది.
- అకాల వర్షాలకు గురికాకుండా, మంచు బారిన పడకుండా, రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో గాని లేదా పొగాకు బారెన్ లలో ఎండబెట్టి మిరప కాయలను పొందవచ్చు. మిరపను వేరే దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు, సస్యరక్షణ మందుల అవశేషాల పరిమితి (యంఆర్ఎల్) లను పాటించాలి. నిర్దేశించిన పరిశుభ్రత ప్రమాణాలు లేకపోయిన మోతాదుకి మించి సస్యరక్షణ మందుల అవశేషాలు ఉన్న, మన పంటను ఆ దేశాలు దిగుమతి చేసుకోకుండా తిరస్కరించబడతాయి.
మిరప నాణ్యతలో అప్లాటాక్సిన్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మిరప కోతకు ముందు, తర్వాత ఆశించే ఆస్పిర్జిల్లస్ లాంటి శీలింధ్రాల వల్ల ఈ ఆఫ్లోటాక్సిన్స్ ఉత్పత్తవుతాయి. మిరపను మార్కెట్ కి లేదా ఎగుమతి చేసేటప్పుడు ” అఫ్లోటాక్సిన్లు” లేని నాణ్యమైన ఉత్పత్తులు తరలించినట్లయితే, దేశీయంగా మరియు అంతర్జాతీయ విపణిలో మంచి ధర పలికే అవకాశం అవకాశం ఉంది.
అఫ్లోటాక్సిన్ సోకటానికి కారణాలు:
- అఫ్లోటాక్సిన్లు రావటానికి తేమ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- నిల్వ చేసే సమయంలో కాయలలో తేమశాతం 11 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు శిలింధ్రం పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. 14 శాతం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అఫ్లోటాక్సిన్లు ఉత్పత్తవుతాయి.
- కోతకు ముందు మిరప పంట వర్షాభావ పరిస్థితులను గురైనప్పుడు.
- మిరప కాయలు సాగు నీటిలో తడిసినప్పుడు
- సరైన సమయంలో కాయలను కోత కోయనప్పుడు
- మిరప కాయలను నేలపై ఎండబెట్టినప్పుడు
- కోత తర్వాత తెగుళ్ళు, పురుగులు ఆశించిన కాయలను, విరిగిన కాయలను తొలగించనప్పుడు
- కళ్ళాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మరియు కాయలు కళ్ళాల్లో ఉన్న సమయంలో రాత్రులందు మంచు పడినప్పుడు
- కాయలు కళ్ళాలలో ఎండుతున్నప్పుడు అకాల వర్షాలు పడినప్పుడు
- కాయలు సరిగ్గా ఎండకుండా, తేమశాతం ఎక్కువగా ఉండి బూజు పట్టినప్పుడు
- నిల్వ సమయంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు
పైన పేర్కొన్న అన్ని పరిస్థితులలో, సరైన చర్యలు చేపట్టినప్పుడు అఫ్లోటాక్సిన్ సోకె అవకాశముంది.
అఫ్లోటాక్సిన్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మిరప నాణ్యత ప్రమాణాలు పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాయలు కోసినప్పుడు 75-80 శాతం తేమ ఉంటుంది. దీనిని 10 నుండి 11 శాతం వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ కాయల్లో ఎక్కువగా ఉంటే అఫ్లోటాక్సిన్లు వృద్ధి చెందే ఆస్కారం ఉంది. తేమ ఎక్కువగా ఉంటే మిరప రంగు కోల్పోవటమే కాకుండా ప్యాకింగ్ లో మిరప కాయలు విరిగిపోతాయి.
- పలచని గుజ్జ, ఎక్కువ ఘన పదార్థం ఉన్న మిరప రకాలను సాగు చేసినట్లయితే, ఆరుదల త్వరగా అవ్వటమే కాకుండా కాయల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
- కాయలను నేల మీద ఆరబెట్టకూడదు. మిరప కాయలను టార్పాలిన్ పట్టాలు లేదా సిమెంట్ ఫ్లోర్ మీద ఆరబెట్టాలి.
- రాత్రులందు మిరప కాయలను మంచుబారిన పడకుండా టార్పాలిన్ పట్టాలతో కప్పాలి.
- మిరప కాయలను ఆరబెట్టడానికి ఆధునిక డ్రయ్యర్లను వినియోగించాలి. దీని వలన కాయలు అకాల వర్షాలకు గురికాకుండా, మంచు బారిన పడకుండా, దుమ్ము, ధూళి లేకుండా, రంగు నాణ్యత కోల్పోకుండా తక్కువ సమయంలో శాస్త్రీయంగా ఆరబెట్టవచ్చు.
- ఎండిన కాయలను వెంటనే గ్రేడ్ చేసి తెల్ల కాయలు, చీడపీడలు ఆశించిన కాయలను వేరు చేయాలి. గ్రేడింగ్ సరిగా చేయకపోతే తాలుకాయల నుండి అఫ్లోటాక్సిన్లు మంచి కాయలకు సోకె ప్రమాదం ఉంది.
- ఏ కోతకి ఆ కోత కాయలను వేరు చేసి నిల్వ చేసుకోవాలి. బస్తాల్లో నింపే మందు కాయలపై నీటిని చిలకరించకూడదు.
- కాయలకు గాలి సోకకుండా బస్తాలలో ప్యాకింగ్ చేసి, చల్లని, చీకటి ప్రదేశాలలో నిల్వ చేయాలి.
మిరప సాగు చేసే రైతులు అధిక దిగుబడి సాధించే లక్ష్యంతో పాటు పైన సూచించిన మంచి నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే, మంచి ధర మరియు ఆదాయం పొందే అవకాశముంది.
డా. కె. రవి కుమార్, డా. వి. చైతన్య, డా. జెస్సీ సునీత, శ్రీమతి పి.ఎస్.ఎం ఫణిశ్రీ, కృషి విజ్ఞాన కేందం, వైరా