ఆంధ్రప్రదేశ్తెలంగాణవ్యవసాయ పంటలు

వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు

0

తెలంగాణలో ప్రస్తుతం నీటి వసతి సౌకర్యం పెరగడం వల్ల రైతులు వానాకాలం మరియు యాసంగి రెండు కాలాల్లోను వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వరుసగా వరి సాగు చేయడం వలను చౌడు నేలలు, మురుగు నీటి సమస్య పురుగులు మరియు తెగుళ్ల ఉదృతి తదితర సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితులలో పంట వైవిధ్యీకరణ చేపట్టడం అవసరం వానాకాలం వరి సాగు అనంతరం యాసంగి ఆరుతడి పంటలు పండించిన యెడల నేలలో భూసారం పెరుగుతుంది. ఎరువుల వినియోగం, చీదపీడల ఉదృతి మరియు సాగు ఖర్చు తగ్గుతుంది. వంటల దిగుబడులు పెరిగి అధిక ఆదాయం పొందవచ్చు. పంట వైవిధ్యీకరణలో భాగంగా యాసంగిలో వరికి బదులుగా, వరి మాగాణుల్లో మరియు ఆరు తడి పంటగా ప్రొద్దుతిరుగుడు లాభదాయక ప్రత్యామ్నాయ పంట తక్కువ కాల పరిమితి కలిగి త్వరగా పెరిగే గుణం ఉండి. ఏ కాలంలోనైన పండించుటకు అనువైన వంట ప్రాదుతిరుగుడు. వానాకాలంలో వరి పంటను కోసిన తర్వాత లేదా జీరో టిల్లేజ్ పద్దతిలో ప్రొద్దుతిరుగుడును నవంబర్ మరియు డిసెంబర్ నెలలో విత్తుకోవచ్చు. వరికోతలు ఆలస్యమైన ప్రాంతాలలో మరియు వేసవిలో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. జీరో టిల్లేజ్ పద్ధతిలో ప్రొద్దుతిరుగుడు సాగులో క్రింద పేర్కొన్న యాజమాన్య పద్దతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చు.

నేల తయారీ: జీరో టిల్లేజ్ పద్ధతిలో వరికొయ్యకాలు ప్రధాన సమస్య. దీని నివారణకు పారాక్వాట్ అనే కలుపు మందును 5 మి.లీ. చొప్పున వరికొయ్యకాలు పైన పిచికారి చేయాలి.

విత్తే సమయం: వరికోతల తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్ మరియు డిసెంబర్ నెలలో విత్తుకోవచ్చు. వరికోతలు అలస్యమైన ప్రాంతాలలో మరియు వేసవిలో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.

రకాలు: ప్రొద్దుతిరుగుడులో సూటి రకాల కంటే సంకర రకాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల సంకర రకాలైన విలన్ టెక్-ఎస్.యు.యెస్.హెచ్-1, ఎన్.డి.ఎస్.హెచ్ -1012, కె.బి. ఎస్ హెచ్-44, డి.ఆర్.ఎస్.హెచ్-1 మరియు  వివిధ ప్రైవేటు కంపెనీలకి చెందిన మంచి సంకర రకాలు  మార్కెట్ లో అందుబాటులో కలవు

విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి: సాధారణంగా ఒక ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం సరిపోతుంది. పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా అవలంభించాలి. ప్రొద్దుతిరుగుడులో నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0  మి.లీ. కలిపి శుద్ధి చేయాలి. అదేవిధంగా ఇప్రొడియన్ 25% కార్బండాజిమ్ 25% మందును 2 గ్రా. ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి ద్వారా అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులును నివారించుకోవచ్చు.

విత్తే పద్దతి మరియు దూరం: సాధారణంగా జీరో టిల్లేజ్ పద్ధతిలో 40 సెం.మీ. × 20-25

సెం. మీ దూరం ఉండేలా 5 సెం. మీ. లోతులో చిన్న రంధ్రం చేసి విత్తనం విత్తుకోవడం వలన అధిక దిగుబడులను సాధించవచ్చు. విత్తిన 15 రోజులు కుదురుకు మొక్క ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి.

కలుపు నివారణ: ప్రొద్దుతిరుగుడు సాగు జీరో టిల్లేజ్ పద్ధతిలో కలుపు నివారణ ముఖ్యం

ప్రొద్దుతిరుగుడులో మొదటి 20 25 రోజులు కీలక దశ పరికొయ్యకాలులో ప్రొద్దుతిరుగుడు విత్తిన రోజు ముందుగా పారాక్వాట్ అనే కలుపు మందును 5 మి.లీ. లీటరు నీటికి చొప్పున పిచికారి వేయాలి. విత్తిన 24-48 గంటలలోపు లేమ గల నేలపై పెండిమిథలిన్ అనే కలువు మందును 5 మి.లీ. లీటరు నీటికి చొప్పున పిచికారి చేయాలి. వంట 25-30 రోజుల దశలో క్విజాలోఫాప్ ఇథైల్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

ఎరువుల యాజమాన్యం: భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫారసు చేయబడిన

మోతాదులో పోషకాలు వాడాలి. ఎకరాకు 50 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం ఎరుపులు వేయాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు. మిగతా సగం దఫాలుగా 30 రోజులు మరియు 55 రోజులకు వేయాలి. బోరాన్ పూత దశలో కీలక పాత్రను పోషించి పంట ఎదుగుదలలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. బోరాన్ లోపించిన యెడల మొక్కలు లేత మరియు మధ్య ఆకులలో లలో చివర్లు గుండ్రంగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఆకర్షక పత్రాలు వికసించు దశలో 2గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఒక ఎకరానికి 56 కిలోల జిప్సమ్ ని వేయడం వలన నూనె శాతం పెరుగుతుంది.

నీటి యాజమాన్యం: ప్రొద్దుతిరుగుడులో మొగ్గ తొడుగు దశ, పువ్పు వికసించు దశ మరియు గింజ కట్టే దశ కీలకం. ఈ పంట దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నేల రకము మరియు వాతావరణ పరిస్థితులను బట్టి ఎర్ర నేలల్లో 8-10 రోజుల్లో, నల్ల రేగడి నేలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి.

సస్య రక్షణ: ప్రొద్దుతిరుగుడులో ముఖ్యంగా చీడ పీడల్లో రసం పీల్చే పురుగులు (తెల్లదోమ మరియు తామర పురుగులు) పొగాకు లద్దె పురుగు, అల్డర్నేరియా ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు, నెక్రోసిస్ తెగులు ఎక్కువగా ఆశిస్తాయి.

తెల్లదోమ: ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వలన మొక్కలు గిడసబారిపోతాయి. నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు: ఈ పురుగులు ఆకులు మరియు పువ్వుల నుండి రసాన్ని పిలుస్తాయి.
సైకోసిస్ వైరస్ తెగులును పరోక్షంగా వ్యాప్తి చేస్తాయి. నివారణకు థయోమిథాక్సామ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్. 5 మి.లీ. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లేక ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పొగాకు లద్దె పురుగు: పైరు 30 రోజుల దశ నుంచి ఈ పురుగు ఆశిస్తుంది. గుంపులుగా చేరి ఆకుల పై పత్రహరితాన్ని తినడం వలన ఆకులు జల్లెడ ఆకులుగా మారుతాయి. వీటి నివారణకు నోవాల్యురాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక విషపు ఎర (5 కిలో తవుడు + 1/2 కిలో బెల్లం + 0.5 లీ. మోనోక్రోటోఫాస్ లేక క్లోరిపైరిఫాస్ కలిపి ఉండలుగా చేసి) సాయంత్రం వేళల్లో పొలంలో అక్కడక్కడా చల్లాలి.

ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు: ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు

మాడిపోయినట్లు అవుతాయి. ప్రొపికోనజోల్ (25% ఇ.సి.) 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు: తేమ ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆకుల అడుగు భాగాన బూడిద లాంటి పొడి కప్పబడి ఉంటుంది. వివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి ఈ తెగులును అరికట్టుకోవచ్చు.

నెక్రోసిస్ తెగులు: ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులు సరిగా పెరగక గిడసబారిపోతాయి. పువ్వులు మెలిక తిరిగి వంకరగా మారుతాయి. దీని నివారణకు ప్రతి కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3 గ్రా. లేక ఇమిడాక్లోప్రిడ్ 5 మి.లీ. కలిసి విత్తన శుద్ధి చేయాలి. అలాగే పంటలో మరియు పొలం పరిసర ప్రాంతాలలో పార్థినియం కలుపును నివారించాలి. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ. లేదా థయోమిథాక్సామ్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు సార్లు పిచికారి చేయాలి.

పక్షుల బెడద: ప్రొద్దుతిరుగుడు గింజ పాలుపోసుకునే దశ నుండి పక్షుల (ముఖ్యంగా రామచిలుకలు) వలన అధిక నష్టం వాటిల్లుతుంది. ఉత్తర – దక్షిణ దిశలో మెరుపు రిబ్బనులను పంటపైన అడుగు ఎత్తులో కట్టాలి. శబ్దం చేయడం ద్వారా లేదా దిష్టి బొమ్మలను ఉపయోగించి పక్షులను పాలద్రోలాలి. కోడి గ్రుడ్డు ద్రావణాన్ని 20 మి.లీ. కలిసి పూలపై వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. పిచికారి చేసే సమయంలో మూతికి మాస్క్ ధరించాలి

పంట కోత: పువ్వు వెనక భాగం నిమ్మ పచ్చ రంగులోకి మారిన తర్వాత కోత యంత్రం చేతా లేదా కూలీల సాయంతో పంటను కోయాలి. కోత అనంతరం పుష్పలను 2-3 రోజులు ఆరనిచ్చి కుట్రలతో కొట్టి గాని, ట్రాక్టర్ తో నడిపి నూర్పిడి వేసి గింజను వేరుచేసుకోవచ్చు. గింజల్లో తేమ 9-10 శాతం వచ్చేవరకు ఎండబెట్టాలి.

జీరో టిల్లేజ్ పద్ధతిలో ప్రొద్దుతిరుగుడు సాగును పైన పేర్కొన్న మేలైన యాజమాన్య పద్దతులు పాటిస్తే ఎకరాకు 8-9. క్వింటాళ్ళ దిగుబడిని రైతులు సాధించవచ్చు. ఒక ఎకరాకు జీరో టిల్లేజ్ నకు అయ్యే సాగు ఖర్చు సుమారు రూ.17,000/- నుండి రూ.18,000/- వరకు వస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన మద్దతు ధరతో ఈ వంట నుండి ఎకరాకు రూ.35,000 – 40,000/- నికరాదాయం పొందవచ్చు.

యాసంగి వరితో పోలిస్తే జీరోటిల్లేజ్ పద్ధతిలో సాగు చేసిన ప్రొద్దుతిరుగుడు పంట వల్ల చాలా లాభాలు పొందవచ్చు. పంట కాలం నెల రోజులు తగ్గడంవల్ల పంట సాగుకు అయ్యే కూలీల ఖర్చు మరియు ఎరుపుల అక్కు దాదాపు రూ.4,500- 5,000/- తగ్గుతుంది. అలానే ఎరువుల వినియోగం తగ్గుతుంది. ఎరువులు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. తక్కువ నీటితో అధిక పంట దిగుబడి సాధించవచ్చు. వరి సాగుతో పోలిస్తే జీరో టిల్లేజ్ ప్రొద్దుతిరుగుడు సాగు ద్వార నీటి వనరులు తక్కువ ఉన్న ప్రాంతంలో కూడా అధనంగా రూ.8,000-10,000/- వరకు ఆదాయం పొందవచ్చు.

ఎన్. చరిత, ఎ. సాయి కిషోర్, డి. స్రవంతి, కె. నాగంజలి, మరియు              జె. హేమంత కుమార్.

Leave Your Comments

సీడ్ డ్రిల్ తో విత్తె వరి సాగు ద్వారా అధిక లాభాన్ని అర్జించిన రైతు విజయ గాధ

Previous article

డ్రాగన్ ఫ్రూట్ ఉప ఉత్పత్తుల ఉపయోగం – ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ఆదాయం

Next article

You may also like