వరి పంటను ఎక్కువ శాతం రైతులు నాటు వేసే విధానంలో సాగు చేస్తూ ఉంటారు. అయితే, గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు, కూలీల కొరత, పెరుగుతున్న నారుమడి యాజమాన్యం, తక్కువ దిగుబడి, మొదలగు కారణాల వలన వరి సాగు గిట్టుబాటు కానీ పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇసకలపాలెం గ్రామం, సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం జిల్లా కి చెందిన శ్రీ ధర్మారావు అనే రైతు కృషి విజ్ఞాన్ కేంద్రం ఆమదాలవలస, శాస్త్రవేత్తల సలహాల మేరకు నిక్రా పథకం క్రింద 2021 సంవత్సరంలో ఒక ఎకరంలో సీడ్ డ్రిల్ తో వరి విత్తనాలు నాటి వరి సాగు చేయడం జరిగినది. సీడ్ డ్రిల్ వినియోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమించడమే గాక, పంట పది రోజుల ముందుగా కోతకు రావడం మరియు సాగు ఖర్చు తగ్గడం మొదలగు ప్రయోజనాలు తెలుసుకున్న రైతు ఇప్పుడు 10 ఎకరాలలో వరి సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.
ఈ రైతు సీడ్ డ్రిల్ వినియోగించి వరి సాగును గత నాలుగు సంవత్సరాలుగా నాటు తున్నాడు. ఈ విధానంలో 16 కిలోల విత్తనాన్ని ఒక ఎకరాకు ఉపయోగిస్తున్నారు. విత్తనం చల్లిన తర్వాత 3 రోజుల లోపు బ్యూటాక్లోర్ కలుపు మందు 1.25 లీటరు, 15 నుంచి 20 రోజుల మధ్యలో బిస్పైరిబాక్ సోడియం (10% ద్రావకం) కలుపు మందు 120 మి.లీ. ఎకరానికి వాడుతూ సమర్థవంతంగా కలుపును అరికట్టుతున్నారు. ఈ విధంగా మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఎకరానికి 32.5 బస్తాల దిగుబడిని సాధిస్తూ సగటున 5000 రూపాయలు పైగా ఖర్చును తగ్గించుకుంటూ ఎకరానికి 2700 రూపాయల నికర ఆదాయాన్ని పొందుతున్నారు ఈ విధంగా సాంప్రదాయ వరి సాగు కంటే సీడ్ డ్రిల్ తో వరి సాగు ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తూ ఉన్నాడు అదే విధంగా వరి సాగులో సీడ్ డ్రిల్ ను ఉపయోగించే విధంగా తోటి రైతులను ప్రోత్సహిస్తున్నాడు ఈ క్రమంలో ఇతర రైతులు కూడా స్ఫూర్తి పొంది ఇసుకల పాలెం గ్రామంలో 100 ఎకరాల విస్తీర్ణంలో సీడ్ డ్రిల్ తో వరి విత్తనాలు విత్తడం గర్వించదగ్గ విషయం.
సీడ్ డ్రిల్ తో విత్తె వరి సాగు ద్వారా అధిక లాభాన్ని అర్జించిన రైతు విజయ గాధ

Leave Your Comments