తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైంది. గత కొద్ది కాలంగా రైతాంగం, కూలీల కొరత అధిగమించడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఈ యంత్రాలు నేల మట్టానికి దుబ్బులు కోయకపోవడం, కోసిన గడ్డి పశువులకు పూర్తిగా ఉపయోగపడకపోవడం, వరి గడ్డి కట్టలు కట్టే యంత్రాలు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం, చేలో గడ్డి ఎక్కువగా ఉంటే దమ్ము సరిగా రాకపోవడం వంటి కారణాల వల్ల రైతులు కోతలు పూర్తయిన వెంటనే గడ్డిని తగుల బెట్టడం జరుగుతుంది. గతంలో ఇలాంటి చర్యలు కేవలం పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే ఉండేది. కాని మారుతున్న పరిస్థితుల కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ ప్రభావం పాకింది. ఈ విధంగా చేలల్లో గడ్డిని తగులబెట్టడం వల్ల సుమారు 149.24 మి. టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ (CO2), 9 మి. టన్నుల కార్బన్ మోనాక్సైడ్ (CO), 0.25 మి. టన్నుల సల్ఫర్ ఆక్సైడ్,1.28 మి. టన్నుల బూడిద, నుశి వంటివి విడుదలై వాతావరణ కాలుష్యం కలుగచేస్తున్నాయి. అంతే గాక డిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో విపరీతమైన పొగ ఏర్పడి వాతావరణ కాలుష్యం జరగడానికి, హిమగిరులు వంటివి కరిగిపోవడానికి కూడా ఈ పొలాలు తగులబెట్టడం అనేది ఒక కారణంగా చెబుతున్నారు. రైతులు పొలంలో గడ్డిని మండించడం వల్ల కలిగే వేడి సుమారు ఒక సెంటి మీటరు లోతు వరకు వెళుతుంది. దీనివల్ల లోపల ఉండే మేలుచేసే బాక్టీరియా, సూక్ష్మ జీవులు చనిపోయి క్రమేపీ పొలాలు నిర్జీవంగా మారతాయి. ఈ వేడి వల్ల మిత్ర కీటకాలు, మిత్ర శిలీంద్రాలు చనిపోయి, పంటలను ఆశించే చీడపీడల ఉధృతి క్రమేపీ పెరిగి పోతుంది.
ఒక టన్ను గడ్డిని తగులబెడితే…
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఒక టన్ను గడ్డిని తగులబెట్టడం వల్ల నేల 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్ఫరస్, 2.5 కిలోల పొటాషియం, ఒక కిలో సల్ఫర్ తోపాటూ నేలలో ఉండే సేంద్రీయ కర్బనాన్ని కూడా నేల కోల్పోతుందని తేలింది. ఒక టన్ను వరి గడ్డిలో 5 – 8 కిలోల నత్రజం, 0.7 – 1. 2 కిలోల భాస్వరము, 12 – 17 కిలోల పొటాష్, 0.5 – 1 కిలోల గంధకం, 3 – 4 కిలోల కాల్షియం, 1 – 3 కిలోల మెగ్నీషియం, 40 – 70 కిలోల సిలికాన్ ఉంటాయని తేలింది.
- మనుషుల్లో కలిగే దుష్ప్రభావాలు:
వరిగడ్డి తగలబెట్టడం వల్ల మనుషుల్లో కలిగే దుష్ప్రభావాల గురించి చేసిన పరిశోధనల్లో పొగ వల్ల 76.8 శాతం మందికి కళ్ళ మంటలు, 44.8 శాతం మందికి ముక్కులో మంట, 45.5 శాతం మంది ప్రజలకు గొంతు నొప్పి బారిన పడ్డట్టుగా గుర్తించారు. అంతేకాక గడ్డి తగలబెట్టడం వల్ల వచ్చే పొగని పీల్చడంవల్ల నుశి ఊపిరి తిత్తులలో పేరుకుపోయి ఆస్తమా, బ్రాంఖైటిస్ వంటి శ్వాస సంబంధ రుగ్మతలు మనుషులలో ఏర్పడుతున్నట్లుగా గుర్తించారు. ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే పొలంలోని వ్యర్ధాలను కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా కలిగే అనారోగ్యాలను నివారించడానికి ప్రతి ఏట 7.6 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టుగా గుర్తించారు. మన దేశంలో ప్రతియేటా 500 మిల్లియన్ టన్నుల పంట వ్యర్దాలు ఉత్పత్తి అవుతుండగా దానిలో 70 శాతం గింజ ధాన్యపు పంటలనుండే ఉత్పత్తి అవుతున్నట్టుగా గుర్తించారు. వీటిలో 34 శాతం వరి పంట నుంచి, 22 శాతం గోధుమ పంట నుంచి ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తయిన పంట వ్యర్ధాలలో 80 శాతం పైగా కాలబెట్టడం వల్ల ప్రజలకు బ్రాంఖైటిస్, ఆస్మా వంటి శ్వాస సంబంధ రుగ్మతలు కలుగుతున్నాయి.పంట వ్యర్దాల సమర్ధ వినియోగానికి…
పంట వ్యర్ధాల సమర్ధ వినియోగంపై శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు గమనిస్తే… - పొలంలో మిగిలిన గడ్డిని కంపోస్ట్ చేయడం వల్ల ఎంతో విలువైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఈ ఎరువులు పర్యావరణ హితమైనవే గాక, రైతుల సాగుఖర్చు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.
- వరి గడ్డిని పుట్టగొడుగుల పెంపకంలో బెడ్డింగ్ మెటీరియల్ గా వాడతారు. గనుక గడ్డిని సేకరించి ఇటువంటి పరిశ్రమలకు అమ్మడం ద్వారా రైతుకు కొంతవరకు ఆర్థిక తోడ్పాటు ఏర్పడుతుంది.
- మరొక ప్రత్యామ్నాయం పొలంలో మిగిలిన గడ్డిని నేలలో కలియదున్ని పూర్తిగా కుళ్ళిపోయేటట్లు చేయడం. గడ్డి అంత తొందరగా కుళ్ళదు గనుక ఘజియాబాద్ లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం వారు రూపొందించిన “వేస్ట్ డికంపోజర్” ద్రావణాన్ని మిగిలిన గడ్డి, దుబ్బులపై పిచికారీ చేసినట్లయితే 20 – 25 రోజుల్లో గడ్డి కుళ్ళిపోతుంది. తద్వారా నేల ఫలదత పెరుగుతుంది. ఈ “డికంపోజర్” వాడకం వల్ల నెల రోజుల్లో పదివేల టన్నుల వరకు సేంద్రీయ వ్యర్ధాలను కుళ్ళిపోయేటట్లు చేస్తున్నట్లుగా గుర్తించారు.
- మిగిలిన గడ్డిని పూర్తిగా నేలలో కలియదున్ని తొందరగా కుళ్ళిపోయేలా చేయడానికి రోటావేటర్ సహాయంతో పూర్తిగా నేలలో కలియ దున్ని మురగ దమ్ము చేయాలి
- కొన్ని ప్రైవేటు సంస్థలు వరి గడ్డి ఉపయోగించి ప్యాకింగ్ మెటీరియల్, కార్డ్ బోర్డ్ లు,ప్లేట్లు, స్పూన్లు, బయో ఇథనాల్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ఇటువంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని వారికి గడ్డి అమ్మడం ద్వార్వా రైతుకు ఆర్థిక తోడ్పాటుతో పాటూ పర్యావరణానికి మేలు కలుగుతుంది.
- కోతల తర్వాత వరి దుబ్బులు మరీ పొడవుగా ఉంటే తర్వాత వేసే అపరాలు, మొక్క జొన్న వంటి పంటలు సరిగా పెరగవు గనుక “ స్టబుల్ షేవర్” అనే యంత్రాలను ఉపయోగించి పొలంలో మిగిలిన దుబ్బులను నేల మట్టానికి కత్తిరించవచ్చు.
- చిన్న కమతాలలో వరి సాగుచేసే రైతులు గడ్డి నష్టపోకుండా ఉండటానికి రీపర్ లేదా రీపర్ కం బైండర్ యంత్రాన్ని ఉపయోగించవచ్చు. రీపర్ తో కోతకొస్తే పనలు ఒక పక్కగా వరుసలలో పేర్చబడతాయి. తర్వాత ఈ పనలను నూర్పిడి యంత్రాలతో నూర్పిడి చేసుకోవడం వల్ల గడ్డి పాడవకుండా ఉంటుంది. అదే రీపర్ కం బైండర్ అయితే పంటను కోసి కట్టలుగా కడుతుంది. ఇటువంటి కట్టలను కుప్పలు వేసుకోవడం, నూర్చుకోవడం చాలా సులువు. దీని సామర్ధ్యం రోజుకు 3 నుంచి 5 ఎకరాలు. కూలీలతో గడ్డి ఏరడం కంటే ఈ పద్ధతి చాలా తక్కువ ఖర్చుఅవుతుంది.
- కంబైన్ హార్వెష్టర్ సహాయంతో కోత కోసినప్పుడు పొలంలో మిగిలిన గడ్డి తీయడం చాల ఖర్చుతో కూడుకున్న పని గనుక అటువంటి పొలాల్లో గడ్డి కట్టలు కట్టే యంత్రాన్ని (బేలర్) ఉపయోగించడం వల్ల పొలం నుంచి సులువుగా గడ్డి బయటకు తీసుకురావడమే గాక, ఈ గడ్డిని పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి గడ్డిని గుండ్రంగా కట్టలు కట్టేది, రెండోది చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలో కట్టలు కట్టే యంత్రం.
- గడ్డిని నేలలో కలియదున్నడం వల్ల సుమారు 30 – 40 శాతం రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. 3 – 5 సంవత్సరాల పాటు వరి గడ్డిని నేలలో కలయదున్నడం వల్ల భూమిలో సేంద్రీయ కర్భనం గణనీయంగా పెరగుతుంది. దీనివల్ల రసాయన ఎరువుల అవసరం తగ్గడంతో పాటు నేల ఫలదత కూడా పెరుగుతుంది.
డికంపోజర్ వాడకంలో మెళకువలు :
ఇటీవలి కాలంలో వరి గడ్డిని త్వరగా కుళ్ళిపోయేటట్లు చేయడానికి శాస్త్రవేత్తలు అనేక రకాల డికంపోజర్లను తయారుచేశారు. ఈ డికంపోజర్ ద్రావణాన్ని రైతు స్థాయిలో ఏవిధంగా తయారుచేసుకోవాలో చూద్దాం.
1. ఘజియాబాద్ డికంపోజర్ తయారీ విధానం :
ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకొని దానిలో 2 కిలోల బెల్లాన్ని కలిపి కర్రతో బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత ఒక బాటిల్ (30 మి.లీ) ఘజియాబాద్ డికంపోజర్ కల్చర్ ని కలిపి కర్రతో బాగా కలియబెట్టాలి. ఈ ద్రావణాన్ని 4 – 6 రోజులు నిలవగట్టి దానిపై ఒక మందపాటి కాగితం లేదా కార్డ్ బోర్డ్ కప్పి ఉంచాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక కర్రతో సవ్య దిశలో కలియబెడుతూ ఉండటం వల్ల సూక్మ జీవులు బాగా వృద్ధిచెందుతాయి. వారం రోజుల తరువాత ఈ ద్రావణం మెత్తం క్రీం కలర్ లోనికి మారుతుంది. దీన్ని బట్టి ద్రావణంలో సూక్ష్మజీవులు వృద్ది చెందినట్లు గుర్తించాలి. ఈ ద్రావణాన్ని పొలంలో మిగిలిపోయిన గడ్డిపై పిచికారీ చేసినట్లయితే 20 నుంచి 25 రోజుల్లో గడ్డి పూర్తిగా కుళ్ళిపోతుంది.
2. పూసా డికంపోజర్ తయారీ విధానం :
ఒక పాత్రలో 5 లీటర్ల నీటిని తీసుకోని అందులో 150 గ్రా. బెల్లాన్ని కలిపి బాగా మరిగించాలి.
ద్రావణం చల్లారిన తర్వాత 50 గ్రా. శనగపిండి, 4 పూసా డికంపోజర్ బిళ్ళలు కలిపి వెచ్చని ప్రదేశంలో గోనె సంచి కప్పిఉంచాలి. దీనిని 4 నుంచి 6 రోజులు ఉదయం, సాయంత్రం ఒక కర్రతో కలుపుతూ ఉండటం వల్ల సూక్ష్మజీవులు బాగా వృద్ది చెందుతాయి. వారం రోజుల తర్వాత ఆ ద్రావణంపై తెల్లని తెట్టులాగా తేలుతూ ఉంటుంది. దీన్ని బట్టి ద్రావణం తయారైనట్లుగా గుర్తించాలి. ఈ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలం అంతా సమానంగా పిచికారి చేయాలి. ఈ ద్రావణం ఒక ఎకరానికి సరిపోతుంది. పిచికారి చేసిన 15 నుంచి 20 రోజుల్లో గడ్డి పూర్తిగా కుళ్ళిపోతుంది.
3. ఆచార్య ఎన్. జి. రంగా డికంపోజర్ A, డికంపోజర్ B :
సూమారు 50 నుంచి 100 కిలోలు బాగా మాగిన పశువుల ఎరువులో ఒక కిలో డికంపోజర్ A, కిలో డికంపోజర్ B కలుపుకొని పొలమంతా సమానంగా వేసుకుంటే దానిలో ఉన్న సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెంది గడ్డిని త్వరగా కుళ్ళించడానికి ఉపయోగపడుతుంది.
అందువల్ల రైతులు గడ్డి తగుల బెట్టడం వల్ల కలిగే నష్టాలను గుర్తించి, ప్రత్యామ్నాయ మార్గాలలో గడ్డిని సమర్ధంగా వినియోగించుకోవడం వల్ల పర్యావరణానికి మేలుచేసినవారమవ్వడంతో పాటూ ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గించుకోవడం, నెల ఫలదత పెంచే అవకాశం కూడా ఉంటుంది.
డా.ఎం.వి.కృష్ణాజీ, డా.సి.హెచ్.శ్రీనివాస్
డా.ఎం.గిరిజా రాణి, డా.టి.శ్రీనివాస్
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు.