మినుము పంటను సార్వా, దాళ్వా, మెట్ట పంటగా, వరి మాగాణుల్లో సాగుచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మినుము సగటున 1.5 లక్షలహెక్టార్లలో సాగవుతోంది. వరి మాగాణుల్లో మినుము సాగుకు వరి కోతకి రెండు, మూడు రోజుల ముందు విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిన విత్తనం మొలిచి, భూమిలో మిగిలిన తేమను, భూసారాన్ని ఉపయోగించుకుని పంటకు అందిస్తుంది. ఈ సాగులో భూమిని తయారు చేయడం, ఎరువులు వేయడం వంటి యాజమాన్య పద్ధతులు లేకుండానే పైరు పండించడం జరుగుతుంది. మినుములో రసంపీల్చు పురుగులు ప్రధానంగా తెల్ల దోమ,పేనుబంక, తామర పురుగులు పంటను ఆశించి రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగుళ్ళను ఒక మొక్క నుంచి వేరొక మొక్కకు వ్యాప్తి చేసి పంటకు నష్టాన్ని కలుగచేస్తాయి. తెల్లదోమ పల్లాకు తెగులును, పేనుబంక బొబ్బరాకు లేదా సీతాఫలం తెగులును, తామర పురుగులు తలమాడు తెగుల వ్యాప్తికి తోడ్పడతాయి. కావున తొలి దశలో రసం పీల్చు పురుగుల నుంచి సుమారు 30 రోజుల వరకు మినుము పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 5 గ్రా. థయోమిథాక్సమ్ 70 డబ్ల్యు.ఎస్. లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. మందుతో విత్తనశుద్ధి చేసుకుని విత్తుకుంటే పైరు తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు. తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్ళను (పల్లాకు తెగులు, మొవ్వు కుళ్ళు, సీతాఫలం తెగులు) కూడా అరికట్టవచ్చు. గత కొంత కాలంగా మినుము మొక్కలకు కాండం గజ్జి తెగులు ఆశించి మొక్కలు చనిపోతున్నాయి. కాండం దగ్గర గజ్జిలా ఉబ్బెత్తుగా తెల్లటి మచ్చలు మొదలై క్రమేపి ఆ మచ్చలు పెరిగి ముదురు గోధుమ రంగుకు మారి గజ్జి మచ్చలు మొక్క పై భాగానికి పెరుగుతూ ఉంటాయి. మొక్క ఎదుగుదల లోపించి కురచగా ఉంటుంది. ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి 1.5 మి.లీ టెబ్యూకొనజోల్ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. రసాయన మందులతో కుదరని పక్షంలో జీవ శీలీంధ్రనాశిని అయినటువంటి ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి 10 గ్రా. చొప్పున కలిపి విత్తుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి హాని కలిగించే శీలీంద్రాలను పెరగనీయకుండా, పెరుగుదలకు అవసరమైన పోషకాలను కూడా వేగంగా గ్రహించి, ఆహార లభ్యతను తగ్గిస్తూ పోషకాల లోపాన్ని ఏర్పరుస్తుంది. వ్యాధికారక శిలీంధ్రాల పెరుగుదల, పునరుత్పత్తిని నిరోధిస్తుంది.
డా.కె. రేవతి, డి. సుధా రాణి, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల.
Leave Your Comments