తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా మరాట్వాడా వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. తమిళనాడు నుంచి కర్ణాటక వరకు సముద్రమట్టం నుంచి 900మీటర్ల వరకు ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.