రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంత ముఖ్యమో విత్తనశుద్ధి చేసుకొని విత్తనాన్నివాడటం కూడా అంతే ముఖ్యం. మంచి విత్తనం అయితే మంచి పంట చేతికి వస్తుంది. అదే శిలీంద్రం ఆశించిన విత్తనాలైతే దిగుబడి శాతం తగ్గుతుంది. రైతులు విత్తేముందు విధిగా విత్తన మొలకశాతం తెలుసుకొని విత్తాలి. వరి పంటను తీసుకున్నట్లయితే 80 శాతం, వేరుశనగ 70 శాతం, కంది పంట 75, జొన్న 75 శాతం, గోధుమ 85 శాతం, కుసుకు 80 శాతం, మిరప 60శాతం, మినుము, పెసర పంటలకు 75 శాతం మొలక శాతం ఉన్నట్లయితే విత్తనాలు మంచివిగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి.
రబీలో ముఖ్యంగా వరి, శనగ, కుసుమ, జొన్న, మొక్క జొన్న, గోధుమ, పెసర, మినుము, కంది, మిరప పంటలను సాగు చేస్తారు. ఈ పంటల్లో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
వరి: కిలో విత్తనానికి ఒక గ్రాము చొప్పున కార్బెండాజిమ్ ఒక లీటరు నీటిలో కలిపిన ద్రావణంలో విత్తనాలను ఒక రోజు నానబెట్టి తర్వాత ఒక రోజు మండెగట్టి నారు మడిలో చల్లడం వల్ల అగ్గితెగులు, ఆకుమచ్చ, పొడ తెగులు అదుపులో ఉంటాయి. మెట్ట నారుమడి పోసే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2.5 గ్రా. కార్బెండాజిమ్ తో పొడి విత్తనశుద్ధి చేసి విత్తుకోవచ్చు. అలాగే నాటేటప్పుడు వరి నారు వేర్లను 200 లీటర్ల నీటికి 200 మి.లీ. క్లోరిపైరిఫాస్ కలిపిన మందు ద్రావణంలో 12 గంటలు ముంచి నాటితే 20 రోజుల వరకు పురుగు బెడద ఉండదు.
జొన్న: కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సమ్ కలిపి శుద్ధి చేసినట్లయితే పేనుబంక, తెల్ల దోమ పురుగుల బెడద ఉండదు. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్ / 3 గ్రా. కాప్టాన్ తో కలిపి విత్తనశుద్ధి చేస్తే తేనెబంక, ఆకుఎండు, కాటుక తెగులు అదుపులో ఉంటాయి.
మొక్కజొన్న: కత్తెరపురుగు నివారణకు థయోమిథాక్సమ్ + సయాంట్రానిలిప్రోల్ 4 మి.లీ. చొప్పున కిలో విత్తనానికి కలిపి శుద్ధిచేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ తో శుద్ధి చేస్తే కాండం కుళ్ళు, మసికుళ్ళు, ఆకుమాడు తెగులు అదుపులో ఉంటాయి.
శనగ: రబీ పంటల్లో శనగ ప్రధానమైంది. ఈ పంటలో ముఖ్యంగా ఫ్యుజేరియం ఎండు తెగులు, మాక్రోఫోమినా వేరుకుళ్లు తెగులు ప్రధానమైనవి. కిలో విత్తనానికి 3 గ్రా. కార్బాక్సిన్ + థైరామ్ (వైటావాక్స్ పవర్)లేదా కార్బెండాజిమ్ 2.5 గ్రా.తో విత్తన శుద్ధిచేయాలి. ఎండుతెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడిని ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. 8 కిలోల శనగ విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చరు వాడాలి.
పెసర, మినుము: తొలిదశలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందు కలిపి విత్తనశుద్ధి చేయాలి. పది గంటల వ్యవధి తర్వాత 3 గ్రా. కాప్టాన్ లేదా 3 గ్రా. థైరామ్ తో కలిపి విత్తనశుద్ధి చేయాలి. రైజోబియం కల్చర్ ను పంట విత్తే ముందు రోజు విత్తనానికి పట్టించి వాడితే అధిక దిగుబడి పొందవచ్చు.
కంది: కందిలో ఎండు తెగులు ప్రధానమైంది. కిలో విత్తనానికి 10గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేయాలి లేదా కార్బెండాజిమ్ 2 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. రబీ కందిలో ఎండు తెగులు ప్రధాన సమస్య కాబట్టి 2 కిలోట్రైకోడెర్మా విరిడి పొడి జీవనియంత్రకాన్ని 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపచెక్కతో బాగా కలిపి 14 రోజులపాటు ఉంచాలి. ప్రతి రోజు మార్చి రోజు పాలితీన్ కవర్ తొలిగించి నీటిని పిచికారి చేయాలి. ఇలా 14 రోజులు చేసిన తర్వాత ట్రైకోడెర్మా శిలీంద్రం తెల్లగా దట్టంగా వ్యాపిస్తుంది. తర్వాత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. దీనిని పోలం తయారీలో దుక్కిలో వేసి కలియదున్నాలి.
వేరుశనగ: రబీలో వేసే వేరుశనగ విత్తనానికి స్ప్రింట్ (మాంకోజెబ్ + కార్బెండాజిమ్) 3 గ్రా. లేదా వైటవాక్స్ పవర్ 3 గ్రా. లేదా 1 గ్రాము టెబ్యూకొనజోల్, ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. వేరుపురుగు సమస్య ఉన్న ప్రాంతాల్లో ఒక కిలో విత్తనానికి 10 మి.లీ. క్లోరిపైరిఫాస్ తో శుద్ధి చేసి నీడలో 30 నిముషాలు ఆరబెట్టిన తర్వాత మాంకోజెబ్ తో విత్తనశుద్ధి చేయాలి. ఇమిడాక్లోప్రిడ్ 1 మి.లీ. 6 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి కిలో విత్తనానికి కలిపి శుద్ధిచేయాలి.
ఆముదం: మొలక దశలో ఆశించే మచ్చ తెగులు, కాండం కుళ్ళు నివారణకు కిలో విత్తనానికి 1గ్రాము కార్పెండాజిమ్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ కలిపి విత్తుకోవాలి.
కుసుమ: ఈ పంటలో ప్రధానంగా ఆల్టర్ నేరియా ఆకుమచ్చ, ఫ్యుజేరియమ్ ఎండుతెగులు, మాక్రోఫోమినా వేరుకుళ్లు తెగులు ప్రధానమైనవి. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బెండాజిమ్ తో కలిపి విత్తనశుద్ధి చేయాలి.
గోధుమ: కిలో విత్తనానికి ఒక గ్రాము టెబ్యూకొనజోల్ పట్టించి విత్తుకోవాలి.
రబీలో పంట పండించే రైతులు ముఖ్యంగా పంటమార్పిడి,సేంద్రియ ఎరువుల వాడకం, విత్తన శుద్ధి, కంపోస్ట్ వినియోగం, వేపకషాయం 5 శాతం లేదా వేపనూనే1500 పి.పి.ఎం వినియోగం, సమతుల్య పోషకాల వినియోగం చేసినట్లయితే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు.
మిరప: కిలో విత్తనానికి తగినంత తుమ్మజిగురు కలిపి 15 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత 3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. పొడిమందు కలిపి నారుమడిలో చల్లుకోవాలి. తెగుళ్లు సోకకుండా 3 గ్రా. మాంకోజెబ్ లేదా 3 గ్రా. కాప్టాన్ మందుల్లో ఎదో ఒకటి కలపాలి. వైరస్ తెగుళ్లు సోకకుండా ట్రైసోడియం ఆర్థో ఫాస్ఫేట్ 150 గ్రా. తీసుకొని ఒక లీటరు నీటిలో కరిగించి అందులో ఒక కిలో విత్తనాలు పోసి 20 నిమిషాలు నానబెట్టి తర్వాత నీటిని వడగట్టి, మంచి నీటిలో రెండు సార్లు కడిగిన తర్వాత విత్తనాలను నీడలో ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి.
డా. బి. రాజేశ్యరి, డా. శ్రీధర్ చౌహాన్, డా. భానురేఖ,
డా. అనిత, డా. సురేష్, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్.