ఆంధ్రా వ్యవసాయంచీడపీడల యాజమాన్యంవ్యవసాయ పంటలు

దోస జాతి మొక్కల్లో జిగురు కాండం తెగులు సమస్యా ?  

0
దోసజాతికి చెందిన మొక్కల్లో వచ్చే ముఖ్యమైన తెగుళ్ళలో జిగురు కాండం తెగులు ఒకటి. దీనినే గమ్మీ స్టెమ్ డిసీజ్ (జి.ఎస్.బి.) అని అంటారు. ఈ వ్యాధి వల్ల 19 నుంచి 27 శాతం వరకు పంట నష్టం కలుగుతుంది. అనుకూల పరిస్థితుల్లో ఈ తెగులు పంట ఉత్పత్తికి గణనీయమైన నష్టాలను కలిగిస్తుంది. అంతే కాకుండా తెగులు సోకిన పండ్లపై కనిపించే లక్షణాల కారణంగా దీనిని నల్ల తెగులు/ నల్ల కుళ్ళు అని కూడా పిలుస్తారు.
తెగులు లక్షణాలు:
దోస జాతి మొక్కల్లో నాటినప్పటి నుంచి కోత దశ వరకు ఎప్పుడైనా ఈ తెగులు ఆశించవచ్చు. మొక్క వేరు మినహా అన్ని భాగాల్లోనూ ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఆకు అంచులు పసుపు రంగులోకి మారడం దీని మొదటి లక్షణం. తెగులు ఆశించిన భాగాలపై  మొదటగా నీటిలో నానబెట్టినట్లు మచ్చలు కనిపిస్తాయి. తర్వాతి దశల్లో లేత నుంచి ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకులపై కనిపిస్తాయి. ప్రధాన కాండం మీద గాయాలు, పగుళ్లు తరుచుగా కనిపిస్తాయి. కాండం మీద గజ్జిలాగా అభివృద్ధి చెందుతాయి. కాండపు పగుళ్ళ నుంచి తేనె రంగులో జిగురు పదార్థం వెలువడుతుంది. ఈ తెగులు సోకిన ఆకులు, కాండం, పండ్లపై శిలీంద్రం నల్లని బీజాంశాలు కనిపిస్తాయి. దీనిని బట్టి ఈ తెగులను నిర్ధారించవచ్చు. ఈ తెగులు ఇన్ఫెక్షన్ దశ సాధారణంగా మూడు నుంచి నాలుగు వారాల వ్యవధి వరకు ఉంటుంది. జిగురు కాండం తెగులు ఆశించిన మొక్కల్లో పండ్ల కుళ్లు అనేది ప్రధానమైన లక్షణం. పండ్లపై ఏర్పడిన మచ్చలు మొదట ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తర్వాత దశలో కలిసిపోయి గోధుమ, నలుపు రంగులోకి మారుతాయి. తెగులు ముదిరే కొద్దీ ఈ మచ్చలు మధ్యలో నొక్కినట్లు గుంతలా కనిపిస్తాయి. చివరి దశలలో మొక్కలు ఎండి చనిపోతాయి.

వ్యాధి వ్యాప్తి:

శిలీంధ్రం అభివృద్ధి చెందడానికి 16 నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 1-10 గంటల పాటు 85 శాతం గాలిలో తేమ శాతం వంటి అనుకూలమైన పరిస్థితులు అవసరమవుతాయి. పనిముట్ల వల్ల కలిగే గాయాల ద్వారా మొక్క గాయపడటం,పెంకు పురుగుల ద్వారా అశిస్తుంది. కోత సమయంలో పండుపై దెబ్బ తగలడం వల్ల కూడా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది.
వ్యాధి నివారణ:
ఈ తెగులు నియంత్రణకు నిర్వహణ చర్యల ప్రణాళిక క్రమాన్ని తప్పనిసరిగా పాటించాలి.  విత్తనం ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున జిగురు కాండం తెగులు  రహిత విత్తనాలను నమ్మకమైన కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాలు విత్తన శుద్ధి చేసిలేకుంటే రైతులే నాటే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికోసం థైరం 3 గ్రా., ట్రైకోడర్మా విరిడి 5 గ్రా./100 గ్రా. విత్తనానికి చొప్పున ఉపయోగించాలి.
మొలక దశలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను ప్రదర్శిస్తుంది. రైతులు నాటిన మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. సాధ్యమైనంత వరకు తెగులు సోకిన మొక్కలు ఉన్న ట్రే / ప్రాంతంలోని మిగిలిన మొక్కలను ఉపయోగించకూడదు.
పంటను పండించిన వెంటనే దీర్ఘకాలిక పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలి. దీనికోసం ఆ పంట నుంచి కుళ్ళిన చెత్తను మట్టిలోకి లోతుగా కలియ దున్నాలి. దోసజాతులను నాటడానికి ముందు కలుపు / ఇతర మొక్కలను నిర్మూలించాలి. సాధారణంగా రెండు నుంచి  మూడు సంవత్సరాలు పంట మార్పిడి చేయాలి. క్లోరోథాలోనిల్ 2గ్రా./లీ., మాంకోజెబ్ 3గ్రా./లీ., డైఫెన్ కొనజోల్ 0.5- 1 మి.లీ./లీ., టెబ్యూకోనజోల్ 1-1.5 మి.లీ ./లీ., థయోఫానేట్ మిథైల్ 0.5 గ్రా./లీ., ఫ్ల్యూవోవైరం + టెబ్యూకోనజోల్ 1 గ్రా./లీ., అజాక్సిస్ట్రోబిన్ + డైఫెన్ కొనజోల్ 1మి.లీ ./లీ., మెటిరం+ పైరక్లోస్ట్రోబిన్ 0.6 గ్రా./లీ., టెబ్యూకోనజోల్ + ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.7 గ్రా./లీ. వంటి మందులను మార్చి, మార్చి పిచికారి చేయాలి.
డా. ఎస్. మానస, డా. ఎ. వీరయ్య, డా.వి. శిల్పకళ, డా. కె. సాయి మహేశ్వరి, డా. టి. మహేశ్ బాబు, డా. ఎస్. ప్రశాంతి, డా. ఐ. సురేశ్ కుమార్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఊటుకూరు, కడప, వై.యస్.ఆర్. జిల్లా.
Leave Your Comments

ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచివి !

Previous article

You may also like