చీడపీడల యాజమాన్యంతెలంగాణతెలంగాణ సేద్యంమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

యాసంగి వరిలో జింక్ లోపం సమస్య – ఎలా గుర్తించి, నివారించాలి ?

0

వరిలో దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో స్థూలపోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి. ఈ సూక్ష్మ పోషకాలలో జింకు పోషకం చాలా ముఖ్యమైంది. చాలా చోట్ల యాసంగి (రబీ)వరి నారుమళ్లు, ప్రధాన పొలాల్లో ఈ జింక్ పోషక లోపం ప్రధాన సమస్యగా మారిం.

          ప్రధాన కారణాలు:   

  • నేలల్లో లవణాల సాంద్రత అధికంగా ఉండటం, ఇసుక నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే జింక్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. నేల ఒత్తిడి వల్ల కూడా వేర్లకు జింక్ పోషకం అందదు.
  • నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నాఈ పోషక లోపం ఏర్పడుతుంది మురుగు నీటి పారుదల సౌకర్యం లేని పల్లపు భూముల్లో వరి తర్వాత వరి పండించే భూముల్లో, సున్నపు నేలల్లో ఈ పోషక లోపం కనిపిస్తుంది.
  • భాస్వరం ఎరువులు ఎక్కువగా వాడడం, భూమిలో మెగ్నీషియం అధికంగా ఉన్నప్పుడు
    ఉదజని సూచిక (pH) 7 దాటినప్పుడు ఈ పోషక లోపం ఏర్పడుతుంది. పంట మార్పిడి పాటించకపోవడం వల్ల కూడా ఈ లోపం పెరగవచ్చు.
  • ఎక్కువ రోజులు నేలలో నీరు నిల్వ ఉండడం వల్ల మొక్కల వేర్లకు జింక్ సరిగా అందదు. రసాయన ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ లను అధికంగా వాడడం, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల వరిలో జింక్ పోషక లోపం కనిపిస్తుంది.లోపాన్ని ఎలా గుర్తించాలి ?
  •  వరి నారు మడిలో, నాట్లు వేసుకున్న 20 నుంచి 40 రోజుల వరకు జింక్ లోపం కనిపిస్తుంది. మొక్కలు గిడసబారి చివరి ఆకులు కుచ్చుగా మారుతాయి.
  • ఆకులు సాధారణ పరిమాణం కంటే సులువుగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ముదురు ఆకుల చివరి భాగంలో ఈనెల ఇరువైపులా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. అవి ఆకు అంతా వ్యాపించి ఆకులు లేత ఎరుపు లేదా ఇత్తడి రంగులోకి మారుతాయి.
  • జింక్ లోపం వల్ల మొక్కల్లో జరిగే జీవ, రసాయన చర్యలకు అంతరాయం ఏర్పడి మొక్క ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. కావున దీని మోతాదు తగ్గినప్పుడు మొక్క ఎదుగుదల సక్రమంగా లేక మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది.
  • జింక్ లోపం సవరించకపోతే పిలకలు తగ్గి పంటకాలం పెరిగే ఆస్కారం ఉంటుంది. అలాగే నత్రజని ఎరువులు వేసినా పైరు పచ్చబడదు.

ఎలా నివారించాలి ?

  •  జింక్ లోపాన్ని రెండు పద్ధతుల ద్వారా నివారించుకోవచ్చు. నేలల్లో జింక్ లోపం ఉంటే నాట్లు వేయడానికి ముందు ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి.
  • వరి తప్ప వేరే పంటలు పండించని పొలాల్లో ప్రతి మూడు పంటలకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేయాలి. దీని వల్ల పంట దిగుబడిలో అశించిన వృద్ధి సాధించవచ్చు.
  • ఒకవేళ పైరు పెరుగుతున్నప్పుడు జింక్ లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. దీని వల్ల ఆకులు త్వరగా పోషకాన్ని గ్రహిస్తాయి.
  • పోషకం వ్యర్థం కాదు గాని మందు ద్రావణం గాఢత ఎక్కువయితే అకులు మాడిపోతాయి. రైతులు గమనించాల్సింది ఏమిటంటే జింక్ పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. భూమిలో వేసిన జింక్ మట్టి  రేణువులు గట్టిగా పట్టుకొని మొక్కలకు అందకుండా చేస్తాయి.

      వాడకంలో జాగ్రత్తలు:

  • జింక్ ను భాస్వరంతో పాటు కలిపి చల్లకూడదు. రెండూ కలిపి చల్లితే వాటి మధ్య రసాయనిక చర్య జరిగి జింక్ పోషకం మొక్కకు అందకుండా పోతుంది.
  • జింక్, భాస్వరం ఎరువుల మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి పాటించాలి, సమస్యాత్మక నేలలైతే ఎకరాకు 40 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి.
  • సుమారు 200 కిలోల సేంద్రియ ఎరువును 15 కిలోల జింక్ సల్ఫేట్ తో కలిపి ఒక నెల మాగనిచ్చి నాటే ముందు వేస్తే జింక్ సామర్థ్యం పెరుగుతుంది.
  • జింక్ సల్ఫేట్ ద్రావణంలో ఎలాంటి తెగుళ్లు, పురుగుల మందులు కలిపి పిచికారి చేయకూడదు.

– మధుకర్ బొంతల, అగ్రానమి,
  పి.జె.టి.ఎస్.ఏ.యు.
– శివకుమార్ చిన్నం, ఏ.ఇ.ఓ,
  కొలనుపాక, ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా.

Leave Your Comments

గులాబీ సాగులో అధిక పూల దిగుబడుల కోసం …

Previous article

ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించటం ఎలా ?

Next article

You may also like