చీడపీడల యాజమాన్యంతెలంగాణతెలంగాణ సేద్యంవ్యవసాయ పంటలు

పత్తిలో కాయ కుళ్ళు సమస్య – నివారణ జాగ్రత్తలు  

0
పత్తిలో కాయకుళ్ళు తెగులు ఇటీవలి కాలంలో దేశంలోని మూడు పత్తి పండించే జోన్లలో ప్రబలంగా ఉంది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ, పత్తి ఉత్పత్తిలో గణనీయమైన దిగుబడిని తగ్గిస్తుంది. వర్షాకాలంలో మేఘావృతమైన వాతావరణం, తగ్గిన సూర్యకాంతి, నేలలో అధిక తేమ, వ్యాధి అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి. కాయకుళ్ళు వ్యాధి శిలీంధ్రాలు, బాక్టీరియా ద్వారా వస్తుంది.
శిలీంధ్రాలలో ఆల్టర్నేరియా, బోట్రిడిప్లోడియా, కొల్లెటోట్రైకం, ఫ్యుజేరియమ్, ఆస్పర్‌జిల్లస్, రైజోపస్, డిప్లోడియా, ఫైటోఫ్తోరా మొదలైనవి, బ్యాక్టీరియాలో పాంటోయా, బాసిల్లస్, ఎర్వినియా మొదలైనవి.
కాయ కుళ్ళులో రెండు రకాలు:
1. బాహ్య కాయ కుళ్ళు: శిలీంధ్రాల వల్ల వస్తుంది
2. అంతర్గత కాయ కుళ్ళు: బాక్టీరియా వల్ల వస్తుంది
కాయ కుళ్ళు లక్షణాలు:
బాహ్య కాయ కుళ్ళు:
  • ముదురు గోధుమ నుంచి నలుపు రంగు మచ్చలు కాయల పైన లేదా కింది భాగంలో కనిపిస్తాయి.
  • కాయల లోబ్స్ కలిసే ప్రదేశాలలో గోధుమ రంగు మచ్చలు కనిపించవచ్చు.
  •  కాయలపై ఉన్న మచ్చలు ఐదు నుంచి ఏడు రోజుల్లో కలిసిపోతాయి. కుళ్ళిన లక్షణాలతో మొత్తం కాయలను కప్పివేస్తాయి.
  • శిలింద్రం కారణంగా మృదు కణజాల అభివృద్ధితో కాయలు వంకరగా మారుతాయి.
  • తెలుపు, గోధుమ లేదా నలుపు శిలీంధ్రాల పెరుగుదల మొత్తం కాయల ఉపరితలం పైన చూడవచ్చు.
  • కాయలు విచ్చుకోకుండా ఎండిపోవచ్చు లేదా ఎండిన తర్వాత మొక్కల నుంచి కింద పడవచ్చు.
  • తెగుళ్ళు ఆశించిన కాయలలోని దూది, గింజలు పసుపు, గోధుమ లేదా నలుపు రంగులోకి మారి పత్తి నాణ్యతను తగ్గిస్తుంది.
అంతర్గత కాయ కుళ్ళు:
ఇది ద్వితీయ కారకంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
  •  కీటకాలు లేదా యాంత్రిక నష్టం ద్వారా చేసిన గాయం ద్వారా వ్యాధికారకలు కాయల లోపలికి ప్రవేశిస్తాయి.
  • కాయలు బయటి వైపు ఆకుపచ్చగా ఉన్నప్పటికీ కేవలం ఒక క్యావిటి లేదా కాయ అంతర్గత భాగం చాలా క్యావిటిల్లో పసుపు, గోధుమ లేదా ఎరుపు రంగుగా మారుతుంది.
  • ముదిరిన దశలో కాయ కణజాలం మృదువుగా మారుతుంది. కుళ్ళిపోతుంది
  • అపరిపక్వత కాయలలోని అంతర్గత క్యావిటీలోని దూది, గింజలు పసుపు, గోధుమ లేదా ఎరుపు రంగుతో ముడుచుకుంటాయి.
  • కుళ్ళిన వాసన, జిగురు పదార్థంతో క్యావిటి లోపల గమనించవచ్చు.
  • వ్యాధి సోకిన కాయలు విచ్చుకోవచ్చు లేదా విచ్చుకోకపోవచ్చు
  • తెగుళ్ళు సోకిన కాయలలో దూది, గింజలు పసుపు, గోధుమ లేదా నలుపు రంగులో కనిపిస్తాయి.
వ్యాధి వ్యాప్తికి అనుకూల పరిస్థితులు:
  • ఎడతెగని వర్షం, మంచు కారణంగా మొక్క దిగువ భాగంలో ఉన్న అధిక తేమ వ్యాధి అభివృద్ధికి అత్యంత అనుకూలం.
  • వర్షాకాలంలో మేఘావృతమైన వాతావరణం, తగ్గిన సూర్యకాంతి వ్యాధి తీవ్రతను, వ్యాప్తిని సులభతరం చేస్తుంది.
  • మొక్కలు దగ్గర దగ్గరగా ఉండి ఎపుగా పెరుగుదలతో పాటు చల్లని వాతావరణం వ్యాధి పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
  • మొక్కల కింది బాగంలో నేలపై ఉన్న విచ్చుకోని, ముదిరిన కాయలు ఉండటం వల్ల వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
  • చేనులో తడి, కాయలలో నీరు నిలవడం వ్యాధి వ్యాప్తికి దోహద పడుతుంది.
  • కీటకాల వల్ల రంద్రాలు లేదా యాంత్రిక నష్టం కారణంగా కాయలపై గాయం సంక్రమణ,  వ్యాధి అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
తెగుళ్ళు ఆశించే సమయం:
పంట విత్తిన వంద రోజుల తర్వాత, మొక్క కింది కొమ్మలలో విచ్చుకోని, పరిపక్వమైన కాయలు ఉండటం ద్వారా ఆశించే అవకాశం ఉంటుంది.
సమగ్ర యాజమాన్య పద్దతులు:
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా…అధిక నత్రజని వినియోగాన్ని నివారించాలి. అదనపు తడులను ఇవ్వకూడదు. ఆలస్యంగా విత్తడం మానుకోవాలి. మొక్కల మధ్య విస్తృత అంతరాన్ని తగ్గించాలి. చేను నుంచి చెత్త, చెదారం తొలగించాలి. వర్షాకాలంలో మొక్కల కింది కొమ్మల్లో ముదిరిన కాయలపై వ్యాధి లక్షణాల కోసం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి.
రసాయనాలతో నివారణ:
బాహ్య కాయ కుళ్ళు నివారణకు కార్బెండాజిమ్ 50 శాతం డబ్ల్యు.పి. 2 గ్రా. లేదా ప్రోపికొనోజోల్ 25 శాతం ఇ.సి.ఒక మి.లీ. లేదా క్రెసోక్సిమ్-మిథైల్ 44.3 శాతం ఎస్.సి.ఒక మి.లీ. లేదా పైరాక్లోస్ట్రోబిన్ 5 శాతం + మెటిరామ్ 55 శాతం డబ్ల్యు.జి. 2 గ్రా. లేదా అజాక్సిస్ట్రోబిన్ 18.2 శాతం + డైఫెన్ కొనజోల్ 11.4 శాతం ఎస్.సి. ఒక మి.లీ.లలో ఏదైనా ఒక శిలీంద్ర నాశినిని ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి
అంతర్గత కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 50 శాతం డబ్ల్యు.పి. 3 గ్రాముల చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయవచ్చు.
కె. రాజశేఖర్, జి. శివచరణ్, ఎం. సునీల్ కుమార్,
డి.మోహన్ దాస్, ఎ. పోశాద్రి,  వై. ప్రవీణ్ కుమార్,
కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్.
Leave Your Comments

కొబ్బరి చిప్స్ తయారీ చిన్నతరహా పరిశ్రమలకు అత్యంత అనుకూలం

Previous article

గులాబీ సాగులో అధిక పూల దిగుబడుల కోసం …

Next article

You may also like