జాతీయంవ్యవసాయ పంటలు

కొబ్బరి చిప్స్ తయారీ చిన్నతరహా పరిశ్రమలకు అత్యంత అనుకూలం

0

కొబ్బరితో తాయారు చేసుకోగలిగిన ఆరోగ్యకరమైన, పోషకాలు గల నాణ్యమైన తినుబండారాలలో కొబ్బరి చిప్స్ ఒకటి. ఈ కొబ్బరి చిప్స్ తయారీలో మిగతా చిప్స్ తయారీలో వాడినట్లు నూనెను వినియోగించడం ఉండదు. అంతే గాక మిగతా చిప్స్ కంటే కూడా అధిక విలువైన పోషకాలను కలిగి ఉంటాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐ.సి.ఎ.ఆర్.) లో విభాగమైన కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధన సంస్థ (సి.పి.సి.ఆర్.ఐ.) కొబ్బరిచిప్స్ ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనాత్మక ప్రక్రియను, ఈ ప్రక్రియా విధానంలో అవసరమైన వివిధ యంత్రాలను తయారు చేసింది. ఈ సంస్థ (ICAR- CPCRI) ఇప్పటికే అనేక మహిళా ఔత్సాహిక, స్వయం సహాయక బృందాలకు చిప్స్ తయారీ ప్రక్రియ మీద పెద్దసంఖ్యలో శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణ ద్వారా అనేక చిన్న వ్యాపార సంస్థలు కూడా వీటి ఉత్పత్తిని ప్రారంభించి లాభాల బాటలో నడుస్తున్నాయి. కొబ్బరి చిప్స్ తయారీ విధానం, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

చిప్స్ తయారీ విధానం:

కొబ్బరి కాయల ఎంపిక: కొబ్బరి కాయల ఎంపిక చిప్స్ తయారీలో అతి ముఖ్యమైనది. చిప్స్ తయారు చేసుకోవడానికి 8- 9 నెలలు పక్వతగల కొబ్బరి కాయలు ఎంచుకోవాలి. ఎక్కువ ముదిరితే కొబ్బరిలో పీచుపదార్థం ఎక్కువగా ఉండి చిప్స్ తినడానికి అనుకూలంగా ఉండవు. అదే లేత కొబ్బరి కాయలైతే కొబ్బరిని తరగడం, టెస్టా పొరను తొలగించడం కష్టమవుతుంది.

కొబ్బరి పీచు,టెంక తొలగించడం: కాయలు కోసిన తర్వాత కొబ్బరి పీచును, టెంకను జాగ్రత్తగా తొలగించుకోవాలి. ఈ పీచు,టెంక వేరు చేయడానికి ICAR- CPCRI ప్రత్యేక యంత్రాలను తయారుచేసింది. యంత్రాలను వినియోగించి గానీ లేదా మనుషుల సహాయంతో గానీ కొబ్బరికాయ నుంచి పీచు, టెంక భాగాలను తొలగించుకోవచ్చు.

కొబ్బరి వెనుక భాగంలోని గోధుమరంగు పొర తొలగించటం: ఈ దశలో కొబ్బరి వెనుక భాగంలో గల పలుచని గోధుమ రంగుపొరను తొలగించుకోవాలి. ఈ పొరను తొలగించడం ద్వారా చిప్స్ రంగుమారకుండా తెల్లగా ఉంటాయి. టెస్టా అనే ఈ గోధుమరంగు పొరను చాకు సహాయంతో గానీ లేదా ICAR- CPCRI రూపొందించిన యంత్రంతో గానీ తీసివేయవచ్చు.

కొబ్బరిని ముక్కలుగా చేసుకోవడం: టెస్టా పొరను తొలగించిన తర్వాత కొబ్బరిని పెద్ద త్రిభుజాకార ముక్కలుగా కత్తిరించుకుంటే చిప్స్ తరగడానికి అనుకూలంగా ఉంటాయి.

కొబ్బరిని చిప్స్ మాదిరి తరగటం: ఈ త్రిభుజాకారంలో ఉన్న కొబ్బరి ముక్కలను స్లైసర్ సహాయంతో లేదా ICAR-CPCRI తయారు చేసిన కొబ్బరి చిప్స్ యంత్రం సహాయంతో చిన్న ముక్కలుగా తరుగుకోవచ్చు. తరిగే సమయంలో ఈ ముక్కలు నేరుగా పరిశుభ్రమైన నీటిని కలిగి ఉన్న పాత్రలో పడేలా చూసుకోవాలి.

బ్లాంచింగ్: ఈ ప్రక్రియలో శుభ్రం చేసి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను మస్లిన్ వస్త్రంలో ఉంచి 90-95 డిగ్రీలసెం.గ్రే. వద్ద వేడిచేసిన నీటిలో 2 నిమిషాల పాటు ఉంచాలి. ఈ బ్లాంచింగ్ ప్రక్రియ ముక్కల్లోని చమురును తొలగించడమేగాక, ఎంజైముల పనితీరును నిర్బంధించి పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ ICAR-CPCRI తయారుచేసిన బ్లాంచింగ్ యంత్రం ద్వారా చేసుకోవచ్చు.

ఆస్మాటిక్ డీహైడ్రేషన్: బ్లాంచింగ్ కు గురిచేసిన కొబ్బరి ముక్కలను 15 నిమిషాల పాటు ఆస్మాటిక్ ద్రావణంలో ఉంచి తర్వాత ఎండబెట్టుకోవాలి. మనం తయారుచేసుకొనే చిప్స్ రకాన్ని బట్టి ఆస్మాటిక్ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. కొబ్బరితో తీపి, కారం, వివిధ ఫ్లేవర్స్ కలిగిన న్యూట్రాసూటికల్స్ చిప్స్ ను తయారు చేసుకోవచ్చు.

  • తీపి చిప్స్ తయారు చేసుకోవడానికి ఒక కిలో చక్కెర, 20గ్రా. ఉప్పును కలిపి ఆస్మాటిక్ ద్రావణం తయారు చేసుకోవచ్చు. లీటరు ఆస్మాటిక్ ద్రావణంలో ఒక కిలో కొబ్బరి ముక్కలను 15 నిమిషాల పాటు ఉంచి వేరుచేయాలి. తర్వాత ఈ ఆస్మాటిక్ ద్రావణాన్ని తిరిగి వినియోగించుకోవడానికి ఈ ద్రావణానికి 150గ్రా. చక్కెర, 5గ్రా. ఉప్పు అదనంగా కలుపుకోవాలి.
  • ఆస్మాటిక్ ద్రావణానికి ఫైనాపిల్, నారింజ, నిమ్మ ఫ్లేవర్స్ కూడా కలుపుకొని వాటి వాసనతో కూడిన చిప్స్ తయారు చేసుకోవచ్చు.
  • ఆస్మాటిక్ ద్రావణానికి 150గ్రా. అల్లం నుంచి తీసిన రసం కలపడం ద్వారా ఔషధ గుణాలు కలిగిన చిప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ద్రావణం తిరిగి వినియోగించడానికి 250గ్రా. చక్కెర, 5గ్రా. ఉప్పు, 50గ్రా. అల్లం నుంచి తీసిన రసాన్ని ప్రతి కిలో కొబ్బరి ముక్కలకు అదనంగా కలుపుకోవాలి.

    కారం చిప్స్: ఇందులో చక్కెరకు బదులుగా ఒక లీటరు నీటికి 20గ్రా. ఉప్పు కలిపిన అస్మాటిక్ ద్రావణం వాడి తయారు చేసుకోవచ్చు. తిరిగి వినియోగించుకోవడానికి ప్రతి కిలో చిప్స్ కి 10 గ్రాములు అదనంగా ఉప్పును ఈ ద్రావణానికి కలుపుకోవాలి. ఇలా అరబెట్టిన ముక్కలకు కారంతో కూడిన మసాలా వంటి పదార్ధాలను జోడించడం ద్వారా కారం చిప్స్ తయారు చేసుకోవచ్చు.

    న్యూట్రాసూటికల్ చిప్స్: కొబ్బరి పుష్పగుచ్చం నుంచి తీసిన నీరా ద్రావణానికి 600గ్రా. క్యారెట్ లేదా బీట్ రూట్ నుంచి తీసిన రసాలను జోడించడం ద్వారా ఔషధ, పోషక విలువలు గల చిప్స్ తయారు చేసుకోవచ్చు

    కొబ్బరిచిప్స్ ఆరబెట్టడం: అస్మాటిక్ ద్రావణం నుంచి తీసిన కొబ్బరి ముక్కలను పేపర్ అమర్చిన ట్రేలలో ఉంచి డ్రయ్యర్ సహాయంతో ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలను ఎలక్ట్రికల్ డ్రయ్యర్లో అయితే 70- 80 సెం.గ్రే. వద్ద 5- 6 గంటల పాటు ఆరబెట్టాలి.

    ప్యాకింగ్: చిప్స్ కు గాలిలోని తేమను పీల్చే గుణం ఉంటుంది కనుక వీటిని మెటలైజ్ డు పాలీఫిల్మ్ లేదా ఎల్.డి.ఇ.పి. లామినేట్ చేసిన అల్యూమినియం ఫాయిల్ కవర్లలో ప్యాక్ చేయడం ద్వారా ఈ చిప్స్ నాణ్యతను 6 నెలల వరకు పొడిగించవచ్చు.

    చిప్స్ లోని పోషక లక్షణాలు: కొబ్బరిలోని మీడియం చైన్ ట్రైగ్లిసరాయిడ్స్ ఆరోగ్యం, పోషణకు చాలా అవసరం. ట్రైగ్లిసరాయిడ్ అయిన లారిక్ఆమ్లం మోనోలారిన్ గా మారి వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా వంటి సూక్ష్మజీవి సంబంధిత వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతే గాక శరీరంలో హానికరమైన కొవ్వు ఎల్.డి.ఎల్. శాతాన్ని తగ్గించి, ఆరోగ్యం పెంపొందించే హెచ్.డి.ఎల్. శాతాన్ని పెంచుతుంది.

    చిప్స్ తయారీలో వరుసక్రమ అంశాలు (ఫ్లో చార్ట్):

    పూర్తిగా పరిణతి చెందిన కొబ్బరి కాయల సేకరణ.
    (8- 9 నెలలు ముదురు కొబ్బరికాయలు).

    కొబ్బరిపీచు వేరుచేయడం.

    కొబ్బరి టెంకను వేరుచేయడం.

    కొబ్బరి వెనుక భాగంలోని పలుచని గోధుమరంగు పొరను వేరుచేయడం.

    కొబ్బరిని ముక్కలుగా చేయడం.

    పరిశుభ్రమైన నీటితో కడగడం.

    సన్నగా చిప్స్ వలే తరగండం .
    (0.75 సెం.మీ. మందంతో)

    శుభ్రమైన నీటితో కడగడం.

    బ్లాంచింగ్ ప్రక్రియకు గురిచేయడం.
    (90-95 డిగ్రీల సెం.గ్రే. వద్ద 2 నిమిషాల పాటు).

    కొబ్బరి ముక్కలను ఆస్మాటిక్ ద్రావణంలో ఉంచటం.
    (15 నిమిషాల పాటు).

    తేమ తగ్గించడానికి ముక్కలను ఎండబెట్టడం.
    (70-80 డిగ్రీల సెం.గ్రే. వద్ద 5-6 గంటల పాటు).

    కొబ్బరి చిప్స్ తయారీ

    ప్యాకింగ్

    కొబ్బరి చిప్స్ లో ఉండే పోషకాలు: ప్రతి 100గ్రా. కొబ్బరి చిప్స్ లో తేమ 2.17 శాతం, మొత్తం కొవ్వు పదార్థాలు 48.10 శాతం, మాంసకృత్తులు 4.24 శాతం, మొత్తం చక్కెర 39.35 శాతం, పీచు పదార్థాలు 6.13 శాతం, బూడిద 1.36 శాతం, మొత్తం పిండి పదార్ధాలు 46.13 శాతం, శక్తి 6.22 కేలరీలు లభిస్తాయి (మూలం: డి.ఎఫ్.ఆర్.ఎల్.,మైసూర్).

    కొబ్బరిచిప్స్ లోని అదనపు విలువలు:

  • ఆరోగ్యకరమైనవి. ఇందులో మిగతా చిప్స్ వలే వంటనూనె వినియోగించడం జరగదు.
  • ఏ విధమైన రసాయనాలను వీటి తయారీలో లేదా నిల్వలో వినియోగించరు.
  • ఇందులోని కొవ్వుపదార్ధాలు హెచ్.డి.ఎల్. గ్రూప్ నకు చెందడం వల్ల ఆరోగ్యానికి  దోహదపడేలా ఉంటాయి.
  • వీటిని తిరిగి 50 డిగ్రీల సెం.గ్రే. వద్ద నీటిలో ఉంచినప్పుడు తాజా కొబ్బరిలా మారి ఉపయోగపడతాయి. ఈ సాంకేతికత చిన్నతరహా పరిశ్రమలకు అత్యంత అనుకూలం.

    పూర్తి వివరాలకు:
    కొబ్బరిచిప్స్ తయారీ విధానం, వీటికి కావాల్సిన యంత్రాలను ICAR-CPCRI రూపొందించడం జరిగింది. సలహాలకు, సాంకేతిక సహకారం కోసం 04994-232894, 232893 ఫోన్ నెంబర్లలో లేదా ఈ మెయిల్ shameena.pht @gmail.commanicpcri@gmail.com ద్వారా  సంప్రదించవచ్చు.

    అపర్ణ వేలూరు, పి. షమీనాబేగం,
     ఎం.ఆర్. మణికంఠన్, ఎ.సి. మాడ్యూ,
     ICAR- CPCRI, కాసర్ ఘడ్, కేరళ, ఫోన్: 7025983006.

Leave Your Comments

నవంబర్ లో పాడి పశువుల, జీవాల స౦రక్షణ ఇలా ?

Previous article

పత్తిలో కాయ కుళ్ళు సమస్య – నివారణ జాగ్రత్తలు  

Next article

You may also like